గళం ఒక శబ్దం మాత్రమే కాదు. అది బాధను పలికించేది, నిరసనకు నినాదం ఇచ్చేది, ఆశయానికి అర్థ్ధం చెప్పేది. అలాంటి గొంతు గద్దర్‌ది.(Gaddar life story) విప్లవ గేయాలకు ప్రాణం పోసినవాడు. గోళీల కంటే గొంతు మిన్న అన్న సత్యాన్ని నిరూపించినవాడు. విప్లవాన్ని వేదికపైకి తెచ్చిన వాడు. వాణిని ఆయుధంగా మార్చుకున్నవాడు. అలాంటి వ్యక్తిత్వం గద్దర్‌ది. ఆయన కవిత్వం, పాట, ఉద్యమం, జీవితం అన్నీ ఒకే తాడుతో అల్లుకున్నవి. తెలుగు జాతికి ఆయన గొంతు ఒక నడకల పాట. విప్లవ జ్వాలను కమ్ముకున్న కంఠస్వరాన్ని ప్రజలు గద్దర్ రూపంలో చూసారు. ఆయన్ను కేవలం ఓ గాయకుడిగా, ఓ కవిగా చూడటం తక్కువైపోతుంది. ఆయన జీవితం నిండా ప్రజల బతుకుపై ప్రేమ, శోషితుల పట్ల బాధ్యత, సమానత్వ పట్ల ఆశయ నిబద్ధత నిండి పోయినది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.
1949 ఆగస్టు 17న హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో కార్మిక కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకటయ్య, తల్లి శారదమ్మ. బాల్యంలోనే అణచివేత, అసమానతలు, అత్యాచారాలను ప్రత్యక్షంగా చూశారు. ఈ అనుభవాలే ఆయనను సామాజిక చైతన్యపు మార్గంలో నడిపించాయి. తార్నాక ఐటిఐలో డిప్లొమా చేసిన తరువాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు. కానీ పేదల బతుకులపై నడిచే మార్గం వైపు ఆయనకు చిరునవ్వులు ఎక్కువ, చీకట్లపై ప్రశ్నలు ఎక్కువ. 1970లలో వామపక్ష భావజాలం ప్రభావితుడై, నక్సల్బరీ ఉద్యమానుసంధానంగా వెలసిన తెలంగాణ జ్ఞానవేదిక, ప్రజా నాటక ఉద్యమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. అనంతరం ‘జననాట్య మండలి’లో చేరి ప్రజలలో చైతన్యం నింపే కళాకారుడిగా, ఉద్యమ స్ఫూర్తిని రగిలించే గాయకుడిగా మారారు. అదే సమయంలో ‘గద్దర్’(Gaddar life story) అనే పేరిట పిలువబడుతూ ప్రజల గుండెల్లో నిలిచారు. ‘గద్దర్’ అనే పేరు ఒక బంగ్లాదేశ్ యువయోధుని జ్ఞాపకార్థంగా స్వీకరించారు.
ఈ పేరు తరువాత ఆయన గళానికి, ఆయన పాటలకు, ఆయన పోరాట జీవనానికి ప్రతీకగా మారింది. ఆయన పాడిన పాటలు ప్రాచుర్యంలోకి రావడం కాదు -ప్రజల్లో ఉద్యమాత్మక చైతన్యాన్ని నింపడం ముఖ్యమైనది. ‘బండెనక బండి కట్టి’, ‘పొద్దంతా పాడుతా నీ పేరంటో చెప్పు బాబోయ్’, ‘ఇక్కడ ఖైదీ గదిలా ఊరు’ వంటి గీతాలు సామాన్య ప్రజానీకంలో ఉద్యమాత్మక స్ఫూర్తిని నింపాయి. ఆయన గళం వినిపించిన చోట ప్రజలు గుమికూడారు. ఆయన వేదిక ఎక్కితే ఆ వేదిక ఉద్యమ రంగస్థలంగా మారేది. గద్దర్ జీవితంలో 1997 సంవత్సరం ఒక మైలురాయి. ఆ సంవత్సరం ఆయనపై నక్కి వేసిన గుళ్లదాడిలో గుండెలోకి మూడు బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఒకటి ఆయన శరీరంలో జీవితాంతం మిగిలిపోయింది. హింసను ఎదిరించిన ఆ గళాన్ని బుల్లెట్లు ఆపలేకపోయాయి. ఆ గాయంతోపాటే ప్రజల గుండెల్లో ఆయనకి స్థానం ఏర్పడింది.
తన ప్రాణాల మీద జరిగిన దాడిని కూడా ప్రజల పక్షాన ఓ రాజకీయ ప్రకటనగా మలిచినవాడు ఆయన. గుండెపై బుల్లెట్లు పడ్డా, గళం ఆగదు అని స్పష్టంగా ప్రకటించిన ధీశాలి ఆయన. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి వచ్చినప్పుడు, ఆ ఉద్యమానికి శక్తినిచ్చిన శబ్దం గద్దర్ గళమే. విభజన అనివార్యమని ప్రకటించి, ప్రాంతీయతను కాదు ప్రజల ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన. ఆయన పాటలు తెలంగాణ ఆకాంక్షకు ప్రాణం పోసినవే. ఉద్యమకాలంలో జరిగిన అసంఖ్యాక సమావేశాల్లో, సదస్సుల్లో, ఊరేగింపుల్లో గద్దర్ పాటలు బలంగా ప్రతిధ్వనించాయి. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ఒక ఉద్యమ గీతంలా మార్చిన ఘనత ఆయనదే. 1998 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, తనను ‘జనజ్ఞాన వేదిక’ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. అది పార్టీ కోసం కాదు- ప్రజల ఆకాంక్షల్ని వేదికలపై నుంచి, సభల్లో నుంచి రాజ్యాంగ నిబంధనల వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నం. రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఆయన గళం మారలేదు. ఆయన ధోరణిలో మార్పు రాలేదు. ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు రూపం చెరగలేదు.
గద్దర్ చివరికి మారినది మార్గమే అయినా, లక్ష్యానికి దూరంగా పయనించలేదు. హింస, గుంపుల రాజకీయం, ఆయుధ మార్గంపట్ల విముఖత ప్రకటించారు. ప్రజాస్వామిక విలువలతో, మానవీయ నడకలతో కూడిన మార్గాన్నే ఆశ్రయించారు. ఈ దిశగా తన కుమారుడి వివాహాన్ని మతపరమైన సంప్రదాయాల నుంచి బయటికి తీసుకొచ్చి, ఒక ఉదారతకు నిదర్శనంగా మలిచారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఆగస్టు 6న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు నేల ఒక గొప్ప గొంతును కోల్పోయింది.
ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందిన ఒక యుగపురుషుడిని కోల్పోయింది. అయితే గద్దర్ జీవితం (Gaddar life story) మౌనం గా ముగియలేదు. ఆయన పాటలు ఈ నేలపై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. వృద్ధుల ఆశలలోనూ, యువత శ్వాసలలోనూ, అణగారిన వర్గాల ఆశయాలలోనూ, ఆయన గొంతు పదేపదే వినిపిస్తూనే ఉంటుంది. గద్దర్ అనగానే గుర్తుకొచ్చేది పాట కాదు, పోరాటం. గళం కాదు, గుండె ధైర్యం. వేదిక కాదు, విప్లవం. ఆయన జీవితం ఒక యాత్ర కాదు – ఒక యుగం. ఆయన లేరు గాని, ఆయన గళం సజీవంగా ఉంది. ఆయన పాట ఒక కాలపు శబ్దమాత్రం కాదు ప్రజల కోసం ఆ శబ్దం శాశ్వతమైంది. జయహో గద్దర్! నీ గళం లేకపోయినా నీ గాథ ప్రజల గుండెల్లో ఉండిపోతుంది.
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494
(నేడు గద్దర్ వర్ధంతి)