Saturday, April 20, 2024

రెడ్‌సీపై దాడుల ప్రభావం

- Advertisement -
- Advertisement -

గత సంవత్సరం అక్టోబర్‌లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్‌కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్‌కి మద్దతుగా నిలిచింది. ఇరాన్ మద్దతు గల హౌతి తిరుగుబాటుదారులు ఎలాగైనా అమెరికా, యుకె దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అమెరికా, యుకె దేశాల వాణిజ్య నౌకలపై దాడులు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ దాడులకు అనువైన ఎర్ర సముద్రాన్ని వారు ఎంచుకొని దాడులకు తెగబడ్డారు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలిపే కెనాల్‌ని సూయెజ్ కెనాల్ అంటారు. ఆ సూయెజ్ కెనాల్ గుండా వెళ్లే నౌకలను హౌతి మిలిటెంట్లు దాడి చేస్తున్నారు. ఇదే మార్గంలో భారత దేశ వాణిజ్య నౌకలు కూడా ప్రయాణిస్తాయి. ఈ దాడుల కారణంగా భారత నౌకలు ప్రత్యామ్నాయ మార్గమైన దక్షిణాఫ్రికా గుండా వెళ్ళవలసి వస్తుంది.ఈ మార్గం గుండా ప్రయాణించడం ద్వారా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి.

ఇది భారత ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికిప్పుడు ప్రభావితం చూపనప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో ముల్టీప్లేయిర్ ఎఫెక్ట్ కారణంగా ఇది భారత వాణిజ్యంపై కూడా ప్రభావం చూపనుంది. పశ్చిమ దేశాలలో ఇటీవల సంఘటనల తీవ్రత దృష్టిలో ఉంచుకొని భారతీయ షిప్పింగ్ కంపెనీలు ఆందోళన చెందుతున్నవి. ఆర్‌ఆర్బి షిప్ చాటరింగ్ కంపెనీ ప్రకారం హౌతి దాడుల వలన షిప్పింగ్ ఖర్చులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఎర్ర సముద్రంలో జరిగిన ఈ సంఘటనలు షిప్పింగ్ పరిశ్రమనూ ఆందోళనకు గురి చేస్తున్నాయి . సముద్రంలో జరిగిన ఈ సంఘటన వెలుగులో రావడంతో కార్గో కంపెనీల యూరప్ వెళ్లే కంటైనర్లు సూయెజ్ కెనాల్ బదులుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంలో వెళ్తున్నాయి. ఇలా షిప్పింగులు దారి మరలించడం వలన రవాణా ఖర్చు దాదాపు 3 రెట్లు పెరిగింది. ఎర్ర సముద్రం భారత దేశానికి షిప్పింగ్ మార్గంలో ముఖ్యమైనది. భారత దేశం ఈ మార్గం ద్వారా యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తుంది.

సూయెజ్ కెనాల్ అనేది ఆసియా నుండి యూరప్ వెళ్లే అతి తక్కువ దూరం గల జలమార్గం, దానిని చేరుకోవటానికి ఓడలు ఎర్ర సముద్రం గుండా వెళ్లాలి. భారత దేశం ఎగుమతుల్లో దాదాపు 34% యూరప్, అమెరికా తూర్పు తీరానికి జరుగుతున్నాయి. మన ఎగుమతులలో ప్రధానమైనవి ఉక్కు, ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, బాస్మతి బియ్యం, చేపలు, ఇతర ఆహార ఉత్పత్తులు. ఇవి ప్రధానంగా ఆఫ్రికా ఇంకా పశ్చిమ దేశాలకు ఎర్ర సముద్రం గుండా ఎగుమతి చేయబడుతున్నాయి. ఇతర ప్రత్యామ్నాయ మార్గమైన కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి నౌకాయానం చేయడం వల్ల దాదాపు 10- 14 రోజుల అధిక సమయం పడుతుంది. ఇలా అధిక సమయం పట్టడం వలన మన ఎగుమతి చేసే చేపలు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ సామర్థాన్ని కోల్పోయి పాడైపోయే అవకాశం ఉంది. తద్వారా తీవ్ర ఆర్ధిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంతే కాకుండా అధిక ఇంధన వినియోగం ద్వారా ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అనేక బీమా కంపెనీలు ఎర్ర సముద్రంలో ప్రయాణించే ఓడలకు ప్రీమియంలను 100 రెట్లు పెంచాయి. అంతేకాకుండా కొన్ని బీమా కవరేజీని పూర్తిగా నిలిపి వేశాయి.

ప్రస్తుత పరిస్థితి కారణంగా భారతీయ ఎగుమతులకు ఇతర మార్కెట్ విభాగాల్లో పోటీ లేమి కారణంగా ముందు ముందు వ్యాపారం మందగించనుంది. అజయ్ శ్రీ వాస్తవ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు హౌతి దాడుల కారణంగా ఈ మార్గాన్ని Gate of Tears అనగా కన్నీళ్ల ద్వారంలా మారిందని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన ముద్రను నిలుపుకున్న భారత దేశానికి డిమాండ్ మందగించిన నేపథ్యంలో 2023లో పశ్చిమాసియాలో నెలకొన్న భూగోళ రాజకీయ యుద్ధ పరిస్థితి వల్ల న్యూఢిల్లీలోని విధాన రూపకర్తలకు సవాలుగా మారనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం ఎగుమతుల నుండి 30 బిలియన్ల మేర తగ్గవచ్చని అంచనా. రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ డెవెలపింగ్ కంట్రీస్ ప్రాథమిక అంచనా ఆధారంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఎగుమతులు 6.7% తగ్గవచ్చని పేర్కొంది. దుస్తులు తయారీ అధికంగా జరుగుతున్న భారత దేశం, పాకిస్తాన్ నుండి సరుకులకు కొంత అంతరాయం కలిగిందని యుఎస్ రూటర్స్ టార్గెట్ అనే సంస్థ వెల్లడించింది.

ప్రపంచంలోని అతిపెద్ద షిప్-బ్రోకర్ యూనిట్ అయిన క్లార్క్‌సన్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం సూయెజ్ కెనాల్‌ను ఉపయోగించే ఓడల సంఖ్య డిసెంబర్ మొదటి అర్ధభాగంలో సగటు కంటే 44 శాతం తక్కువగా ఉందని జనవరిలో నివేదించింది. జనవరి మొదటి వారానికి 4 మిలియన్ల నుండి 2.5 మిలియన్లకు నౌకల స్థూల ఎగుమతి తగ్గింది. హౌతి తిరుగుబాటుదారులు డ్రోన్లు, నౌకా వ్యతిరేక క్షిపణులను ఆశ్రయించి, నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓడ, సిబ్బందిని సీజ్ చేయడానికి వారు హెలికాప్టర్‌ను కూడా ఉపయోగించారు. వారు మొదట్లో ఇజ్రాయెల్‌కు వెళ్లే లేదా ఇజ్రాయెల్ నుండి వెళ్లే ఏదైనా ఓడను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించినప్పటికీ, వారు ఇప్పుడు నార్వే, లైబీరియా వంటి దేశాలకు ఫ్లాగ్ చేయబడిన కంటైనర్ షిప్‌లు, ఆయిల్ ట్యాంకర్‌లతో సహా ఏదైనా ఓడపై దాడి చేస్తామని లేదా క్షిపణి కాల్పులు జరుపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాడుల పట్ల జాగ్రత్త వహించి,

మెరస్క్ వంటి ప్రధాన షిప్పింగ్ కంటైనర్ కార్పొరేషన్‌లు తమ నౌకలను ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ పంపుతున్నాయి. ఇది ఇతర ఖర్చులతో పాటుగా షిప్పింగ్, బీమా, ఇంధనం ఖర్చులను పెంచుతూ ఒక వారం లేదా రెండు వారాల పాటు ప్రయాణాలను పెంచుతుంది. కాగా భారత దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల ఇరాన్‌తో చర్చలు జరిపారు. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కూడా సముద్ర మార్గం గుండా వెళ్లే నౌకలకు నిఘా పెంచాలని నిర్ణయించింది. దీని కోసం కంటైనర్ షిప్పులకు ఎస్కార్ట్ కల్పించింది. ఇలా హౌతి దాడులు భారత ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపెట్టనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News