హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో(Gulzar House) ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం(Ex gratia) ప్రకటించింది. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. సిఎం ఆదేశాలతో ఆయన మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్‌లతో ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై అధికారులతో చర్చిస్తూ.. సిఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూటే అని ప్రాధమికంగా అధికారులు చెబుతున్నారని అన్నారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియగానే.. 6.17కి మొగల్‌పుర ఫైరింజన్ సిబ్బంది బయల్దేరి 6.20 గంటలకు ఘటనస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మొత్తం 11 మంది ఫైర్ ఇంజన్లతో పాటు ఒక రోబో కూడా సహాయకచర్యల్లో ఉపయోగించామన్నారు. మొత్తం 70 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. కాబట్టి ప్రమాద తీవ్రతను అరికట్టామని పేర్కొన్నారు. ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని.. మృతల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.