Thursday, April 18, 2024

కొత్త ఏడాదిలో ఆరోగ్యానికే పెద్దపీట

- Advertisement -
- Advertisement -

Health

 

కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలతో శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో ఎక్కువ శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారు. వేళకు తినడం, నిద్రపోవడం లేకపోవడంవల్ల కూడా ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. ఒకసారి ఊబకాయం బారినపడ్డామంటే తగ్గడం కొంచెం కష్టమే.

ఈ సంవత్సరంలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది నిపుణుల సలహా. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే. వేళకు పోషకాహారం, సమయానికి నిద్ర, ఆందోళన, ఒత్తిడిలేని జీవన విధానం, క్రమం తప్పకుండా వ్యాయామం..ఇవన్నీ పాటిస్తుంటే ఈ కొత్త సంవత్సరం అంతా ఆనందంగా ఉండొచ్చని చెబుతున్నారు.

1975లో ఊబకాయంలో 19వ స్థానంలో ఉన్న మన దేశం 2014లో మహిళల విభాగంలో 3, పురుషుల విభాగంలో 5 వ స్థానానికి చేరుకుంది. సరైన జీవనవిధానం లేకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మోకాళ్ల సమస్య, కాళ్లనొప్పులు, స్త్రీలలో రుతుచక్రం, సంతానలోపం సమస్యలు అధిక మయ్యాయి. ఊబకాయం తగ్గిస్తామంటూ అనేక ప్రకటనలు చూస్తుంటాం. అలా తగ్గడం కంటే సహజసిద్ధంగా తగ్గడమే మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఊబకాయం బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం…

* నీళ్లు బాగా తాగాలి. నీళ్లతో కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి తక్కువగా వేస్తుంది. ఆహారం తక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా నీళ్లు తాగేవారు ఇతరులతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటారని ఓ సర్వే చెబుతోంది.
* ఒకేసారి ఎక్కువమోతాదులో తినకుండా కొంచెం కొంచెం తినండి. ఇందువల్ల రోజంతా శారీరక శక్తి నిల్వ ఉంటుంది. ఆకలి వేసినప్పుడే తినాలి. కడుపు నిండగానే ఆపేయాలి.

* ఎక్కువ తినొద్దు. సంతోషంగా ఉన్నప్పుడో, బాధగా ఉన్నప్పుడో కొంతమంది ఎక్కువ తినడం చేస్తుంటారు. ఈ కొత్త ఏడాదిలో ఈ పద్ధతిని మానుకోండి. ఆకలి వేసినా వేయకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండటం చాలా మంది చేసే పని. ఇలా ఎక్కువ తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.

* జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండండి. చిప్స్, స్వీట్లు, చాక్లెట్స్, కేక్స్, బిస్కట్లు, ఆయిలీ ఫుడ్,శీతలపానీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోండి. వీటితోపాటు రిఫైండ్ ఆయిల్, చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే శరీరంలో బ్లడ్ షుగర్ శాతం పాడవుతుంది.

* వైట్ రైస్‌కి గుడ్‌బై చెప్పండి. తెల్ల అన్నానికి బదులు బ్రౌన్ రైస్ తినడం మంచిది. వైట్ బ్రెడ్, పాస్తా, నూడుల్స్, మైదాతో చేసిన ఆహారం, చక్కెర ఇవన్నీ ఆరోగ్యానికి హానికరాలే. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కువ శాతం పోషకతత్వాలు నష్టపోతాయి.
ఎక్కువ శాతం క్యాలరీలు మిగిలిపోతాయి. అందుకే వీటి స్థానంలో మొలకెత్తిన గింజలు, జొన్న, రవ్వ, పండ్లు, బ్రౌన్ బ్రెడ్, డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవాలి.

* ఎక్కువ నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో బద్ధకం ఏర్పడుతుంది. వీటి స్థానంలో ఆవిరిపై వండినవి, ఉడికించినవి, వేయించినవి, పచ్చి ఆహారం తీసుకోవడం మంచిది.
* స్వీట్లకు స్వస్తి చెప్పడం మంచిది. ఐస్‌క్రీమ్, కేక్స్, జెల్లీ, డోనట్, క్యాండీలవంటివాటిల్లో చక్కెర ఉండటం వల్ల అవి శరీరంలో షుగర్‌ను చేరుస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా కర్బూజా, తర్బూజాలాంటి పండ్లను తీసుకోవచ్చు.

* ఆకలిగా ఉన్నప్పుడు మరమరాలు, పండ్లు, సలాడ్, వేయించిన శనగలు …ఇలాంటివి తింటే శరీరానికి హానికలిగించవు.
కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆఫీసుకెళ్లేవారైతే వీటిని ఓ బాక్స్‌లో పెట్టుకుని తీసుకెళ్తే సరిపోతుంది. బయటి తిండి జోలికే వెళ్లనక్కర్లేదు. బ్రెడ్, గుడ్డు, చేప, చికెన్, పప్పు, కోవా, పాలు, పాలతోచేసిన పదార్థాలను తక్కువగా తినాలి.
* ఆకుకూరలు, పప్పులు, ఇతర కూరగాయలు, సలాడ్,. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

Greater Emphasis on Health
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News