Monday, April 29, 2024

గ్రూప్ -1 పోస్టులు 563 కాదు… 1600 పోస్టులు భర్తీ చేయాలి : ఆర్. కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్- 1 పోస్టులు 563 భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రూప్- 1 పోస్టులు 563 కాదు – 1600 కు పైగా పోస్టులు వస్తాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 డిఎస్‌పి ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలిస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయని ఆయన తెలిపారు.

ఇందులో గ్రూప్- 1, గ్రూప్ -2, గ్రూప్- 4 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయలేదుదని, వీటిని వెంటనే మంజూరు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -Iకు 50 శాతం, గ్రూప్- 2లో 30 నుంచి 40 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా స్థాయి పోస్టులు పెరగకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొత్త పోస్టులు ప్రకటించి మంజూరు చేయాలన్నారు. కొత్త పోస్టులు మంజూరు చేయకపోతే కొత్త జిల్లా ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏమిటని అడిగారు. కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ఒత్తిడికి లొంగి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను ప్రమోషన్లు ఇచ్చి ఈ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు.

ప్రస్తుతం గ్రూప్- 1 సర్వీస్ కింద 563 పోస్టులు ప్రకటించారని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600 పైగా వస్తాయని ఆయన తెలిపారు. గ్రూప్-2 సర్వీస్ కింద 783 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని కూడా కరెక్టుగా లెక్కిస్తే రెండు వేలకు పైగా వస్తాయన్నారు. ఒకసారి తమరు జోక్యం చేసుకుని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా పోస్టులను కరెక్టుగా లెక్కించి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకే దఫా గ్రూప్ 1,-2, -3, -4 మరియు టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నందున మెరిట్ అభ్యర్థులు ఈ పోస్టులoన్నింటికీ సెలెక్ట్ అవుతారని తెలిపారు.  అన్ని రకాల 6, 7 కేటగిరీల పోస్టులకు ఒకేసారి సెలెక్టైతే ఆ అభ్యర్థి ఒకే పోస్టు ఎంపిక చేసుకుంటారని మిగతా 5, -6 రకాల పోస్టులు మిగిలిపోతాయని తెలిపారు.  ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇతర అభ్యర్థులకు రాకుండా పోతాయన్నారు. వెయిటింగ్ లిస్టు పద్ధతి, ఆప్షన్ పద్ధతి లేదని అందుకే ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్టు కాల పరిమితి ప్రవేశపెట్టి పోస్టుల భర్తీ చేస్తే అందరికీ అవకాశం వస్తుందన్నారు. పోస్టులు మిగిలిపోకుండా భర్తీ అవుతాయని కృష్ణయ్య తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల పోస్టులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ గురుకుల పాఠశాలల పోస్టులు, ఆదర్శ పాఠశాల పోస్టులు కూడా వేరువేరుగా జరపడంతో మెరిట్ అభ్యర్థులు ఈ మూడు నాలుగు రకాల యాజమాన్యాల పాఠశాలల్లో మెరిట్ ఉన్న ఒకే అభ్యర్థి సెలెక్ట్ అవుతారని, ఒకే యాజమాన్యం పాఠశాలలో జాయిన్ అవుతారు. సెలెక్ట్ అయినా మిగతా మూడు వృథా అవుతాయన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News