Thursday, April 18, 2024

జిఎస్‌టి మోదం- రాష్ట్రాల ఖేదం!

- Advertisement -
- Advertisement -

GST collections

 

వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు 2019 డిసెంబర్‌లో కూడా లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఇవి ఈ స్థాయికి చేరుకోడం వరుసగా ఇది రెండో మాసం. నవంబర్ నెలలో సైతం రూ. 1,03,492 మేరకు పన్ను వసూలయింది. 2018 నవంబర్, డిసెంబర్‌ల వసూళ్లతో పోల్చుకుంటే ఇది బాగా ఎక్కువ. డిసెంబర్‌లో రూ. 1.03 లక్షల కోట్లకు చేరింది. జిఎస్‌టి రాబడి తగ్గిపోయిందని తలపట్టుకుంటున్న తరుణంలో ఇది నిస్సందేహంగా అసాధారణమైన ఆర్థిక శుభ సమాచారం. వరుసగా గత ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వసూళ్లు తగ్గడంతో నెలకొన్న నిరాశను ఈ పరిణామం తొలగించింది. 2019 ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పెరుగుతూ వచ్చిన జిఎస్‌టి ఆదాయం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో తగ్గిపోయింది. దానితో భయోత్పాత వాతావరణం ఏర్పడింది.

ప్రస్తుత పెరుగుదల ముందు ముందు ఇలాగే కొనసాగుతుందో లేక మళ్లీ కొడిగడుతుందో వేచి చూడాలి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడమే జిఎస్‌టి ఆదాయం పెరుగుదలకు కారణమని కొంత మంది వాదన. దేశంలో వస్తువులకు గిరాకీ పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు. పండగల సీజన్ కూడా ఇందుకు దోహదపడి ఉండవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం వసూళ్లపై గట్టిగా దృష్టి పెట్టడం ఆశించిన ఫలితాన్ని ఇచ్చి ఉండవచ్చు. పన్ను ఎగ్గొట్టే వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు, ఇన్‌పుట్ టాక్స్ రుణ సదుపాయాన్ని తొలగించడం వంటి చర్యలకు ఆదేశించడం ఫలించిందని భావిస్తున్న వారు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందని ప్రజల కొనుగోలు శక్తి పుంజుకుంటున్నదనే వాదన పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు. పండగల కాలంలో అప్పు చేసైనా కొత్త వస్తువులు కొనుక్కొనే మధ్య తరగతి మనస్తత్వం వస్తు విక్రయాన్ని పెంచి ఉంటే దానికి సంబుర పడిపోవలసిన పని లేదు.

నిరుద్యోగం, ఉత్పత్తి మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి పోయిందనే అభిప్రాయం విశ్వసించదగినది కాదు. జిఎస్‌టి వసూళ్లు మళ్లీ తలపైకెత్తాయని అత్యుత్సాహం చూపించనవసరం లేకుండా చేస్తూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా కుంగిపోయింది. వాటి అప్పులు తడిసి మోపెడయ్యాయి. జిఎస్‌టిలో వాటాను, పరిహార మొత్తాన్ని బదలాయించడంలో కేంద్రం అసాధారణ జాప్యం చేస్తున్నందు వల్ల రాష్ట్రాల అప్పు బరువు పెరిగిపోయే ప్రమాదాన్ని గురించి ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై 15వ ఆర్థిక సంఘం ఇంతకు ముందే హెచ్చరించింది. రాష్ట్రాల రుణ భారాన్ని తగ్గించడానికి తగిన వ్యూహ రచన అవసరమని గత నవంబర్ మాసారంభంలో సూచించింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రాలకు కేటాయింపులు తగ్గించవలసి వస్తుందని ఆర్థిక సంఘం అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్ను ఆదాయంలో 42 శాతం రాష్ట్రాలకు చెందాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రాలన్నింటి మొత్తం అప్పు గత అక్టోబర్ డిసెంబర్ మూడు మాసాల కాలంలో రూ. 1.71 లక్షల కోట్లకు చేరుకుంది. 2018 సంవత్సరం అదే సమయంలో ఈ మొత్తం 1.23 లక్షల కోట్లు. రాష్ట్రాలకు జిఎస్‌టి బకాయిల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యమే ఇందుకు కారణం. ఇప్పటికైనా ఈ జాప్యాన్ని తొలగించకపోతే రాష్ట్రాల రుణ భారం మరింతగా పెరిగిపోయే ప్రమాదముంది. అది పథకాల అమలుపై, ప్రజల జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల వాటా 13.98 శాతంగా నిర్ణయించారు. అయితే గత ఏప్రిల్ అక్టోబర్ కాలంలో ఈ వాటా 2.7 శాతం తగ్గింది. దీనికి తోడు జిఎస్‌టి పరిహారం చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం రాష్ట్రాలను విలవిలలాడిస్తున్నది. ఈ ఒత్తిడిని తట్టుకోడానికి అవి మరింతగా అప్పులు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతున్నది.

ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకర సంకేతం’ అని ప్రధాని ఆర్థిక సలహా మండలి అభిప్రాయపడింది. జిఎస్‌టి బాకీపై బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు బిజెపి పాలనలోని రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి తలెత్తుతున్నది. ఈ విషయమై అనేక రాష్ట్రాలు ఈ సరికే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి తమ గోడును వినిపించుకున్నాయి. నిధుల కొరత ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాలు సునాయాసంగా పరిపాలన సాగించలేని పరిస్థితి వస్తుందని ప్రాజెక్టుల ప్రగతి కుంటుపడుతుందని వివరించాయి. 2019 20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల జిఎస్‌టి వసూళ్లలో రూ. 16,629 కోట్ల లోటు ఏర్పడవచ్చని అంచనా. పరిస్థితి చేయి దాటక ముందే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, ప్రజల వాస్తవ కొనుగోలు శక్తిని పెంచడం తద్వారా పన్ను వసూళ్లను మెరుగుపరుచుకొని రాష్ట్రాలకు సకాలంలో బకాయిలు చెల్లించి అవి దివాళా తీయకుండా చూడడం కేంద్రంపై ఉన్న అత్యవసర బాధ్యత.

GST collections crossed one Trillion Rupees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News