Wednesday, April 24, 2024

మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నికకు మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

 Mayor

 

పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానమైతే లాటరీ
ఎ.. బి ఫారాలతో మేయర్.. ఛైర్ పర్సన్ పేర్లు
రాజకీయ పార్టీలు విప్‌లను నియమించుకోవచ్చు
29 కరీంనగర్ మేయర్ ఎన్నిక
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితం 10 గంటలలోపు
మీడియాతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయ పార్టీలు మేయర్, ఛైర్‌పర్సన్ల పేర్లను ఎ,బి ఫారాల ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. ఈనెల 26న ఉదయం 11 గంటల్లోపు ఎ ఫారం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, 27న ఉదయం 10 గంటల్లోపు బి ఫారం అభ్యర్థి పేరుపై ఇవ్వాలన్నారు. మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికకు రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించుకోవచ్చని, విప్ ఎవరన్నది 26న ఉదయం 11 గంటల్లోపు తెలపాలని చెప్పారు. మసాబ్‌ట్యాంక్‌లోని ఎస్‌ఇసి కార్యాలయంలో సిడిఎంఎ డైరెక్టర్ శ్రీదేవితో కలిసి కమిషనర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశామని ఆయన చెప్పారు. ఇక మేయర్, ఛైర్ పర్సన్ వివరాలు ముందుగానే ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలన్నారు.

ప్రిసైడింగ్ అధికారిని జిల్లా కలెక్టర్ నియమిస్తారన్నారు. పరోక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసిసి) అమల్లో ఉంటుందని.. శనివారం సాయంత్రం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. సాధారణ ఎన్నికల్లో ఉండే ప్రవర్తనా నియమావళిలాగే ఇది కూడా ఉంటుందని వివరించారు. ఇందులో అభ్యర్థుల ఖర్చు ఉండదని, అలాగే పదవులు ఇస్తామని హామీలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఈనెల 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో 75.82 శాతం, ఈసారి మున్సిపాలిటీల్లో 74.40 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. అలాగే 2014లో కార్పొరేషన్‌లలో 60.53 శాతం ఓటింగ్ కాగా ఈసారి కార్పొరేషన్లలో 58.83 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు.

గంగుల అలా చెబితే నేరం
కరీంనగర్ కార్పొరేషన్‌లో మంత్రి గంగుల కమలాకర్ కారుకు ఓటేశానని చెప్పడాన్ని పరిశీలిస్తున్నామని, అలా చెబితే నేరమే అవుతుందని తెలిపారు. నేరమే అని రుజవు అయితే..మంత్రి గంగులపై క్రిమినల్ చర్యలుంటాయని నాగిరెడ్డి ప్రకటించారు.

ఒక్కసారి ఇచ్చిన ఆప్షన్‌ను మార్చలేం : శ్రీదేవి
పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుందన్నారు. శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒకే మున్సిపాలిటీ ఉంటే స్థానిక ఎంపి, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు ఎక్స్‌అఫిషియో హోదాలో అక్కడే ఓటు వేయాలని, ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉండే వారు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఎక్స్ ఆఫిషియో ఓటింగ్‌కు మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు ఇవ్వాలన్నారు. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకపోతే నోటీసు ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఒక్కసారి ఇచ్చిన ఆప్షన్‌ను మళ్లీ మార్చడం కుదరదని స్పష్టం చేశారు.

Guidelines for election of Mayor and Chairperson
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News