వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రతీకార సుంకాలతో భారత్ సహా ప్రపంచ దేశాలపై ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్1 బి వీసాదారులపై పిడుగు పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 2000-5000 డాలర్ల వరకు ఉన్న హెచ్1 బి వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేశారు.ఈ మేరకు శనివారంనాడు కార్యనిర్వహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తాజా నిర్ణయం సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అంటే ఏదైనా కారణాల చేత అమెరికా వెలుపల ఉన్న హెచ్1 బి వీసా దారులు ఆ గడువు లోపల తిరిగి అగ్రరాజ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. లేకపోతే లక్ష డాలర్ల వాత తప్పదు. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు, ఇమిగ్రేషన్ అటార్నీలు తమ నిపుణులు, ఉద్యోగులకు వెంటనే వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. హెచ్1 ఫీజు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రధానంగా భారతీయ టెకీలు, ఆయా కంపెనీలపై పెను భారం పడనుంది. దీని ప్రకారం అమెరికా భూభాగంలోని కంపెనీలు ఎవరైనా విదేశీ నిపుణుడిని నియమించుకుంటే ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయం భారత్, చైనాలకు చెందిన లక్షలాది సాంకేతిక నిపుణులు, వారిని నియమించుకునే కంపెనీలపై పెను భారానికి దారీ తీస్తుంది.
ట్రంప్ నిర్ణయంపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మండిపడ్డారు. ‘ఎంతో కాలంగా మన నైపుణ్య శక్తిని బలోపేతం చేసి ఎన్నో ఆవిష్కరణలకు పురుడుపోయడమే కాకుండా పరిశ్రమలను నెలకొల్పి, అందులో లక్షలాది మంది అమెరికన్లకు ఉపాధి కల్పనలో ఇతోధికంగా సాయపడిన అత్యుత్తమ నిపుణు దేశంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడం. ఇదొక నిర్లక్షపూరిత ప్రయత్నం. ఇది మన దేశం తీసుకుంటున్న పనికిమాలిన నిర్ణయం’ అని అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ సలహాదారు, ఇమ్మిగ్రేషన్ పాలసీపై ఆసియా-అమెరికన్ కమ్యూనిటీ లీడర్ అయిన అజయ్ భూటోరియా మాట్లాడుతూ.. హెచ్-1బి వీసా ఫీజుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా టెక్నాలజీ రంగం పోటీతత్వానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించిన ఆవిష్కరణలకు జీవనాధారమైన హెచ్-1 బి కార్యక్రమం, భారీ ఫీజు పెంపుతో మునుపెన్నడూ లేని రీతిలో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నదని అన్నారు. ఇది విభిన్నరకాల ప్రతిభపై ఆధారపడిన చిరు వ్యాపారాలు మరియు స్టార్టప్‌లను అణిచివేస్తుందన్నారు. అమెరికా టెక్నాలజీ రంగంలో సంక్షోభాన్ని తీసుకువచ్చే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంతమందిపై ప్రభావం..?
హెచ్1బి వీసాదారుల్లో భారత్ 71 శాతం, చైనా 11.7 శాతం కలిగి ఉంది. తక్షణమే దీని ప్రభావం 60 వేల మంది భారతీయులపై పడనున్నది. అమెరికాలో మాస్టర్స్, పిహెచ్డి పూర్తి చేసిన తర్వాత హెచ్1బి వీసాలకు దరఖాస్తు చేసేవారిలో భారతీయులదే ఆధిపత్యం. అయితే ఇప్పుడు దానికి గండిపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సాంకేతిక నిపుణులపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. హెచ్1 బి లబ్ధిదారుల్లో టిసిఎస్ 5,505 హెచ్1 బి వీసాలతో రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 10,044మందితో మొదటి స్థానంలో అమెజాన్ ఉంది. టిసిఎస్ తర్వాత మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్, డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా అమెరికాస్ ఉనాయి. ఇదిలాఉండగా ట్రంప్ గోల్డ్ కార్డు పేరిట అమెరికా అధ్యక్షుడు కొత్త కార్డును ప్రకటించారు. దాని ఫీజును 10లక్షల డాలర్లుగా ఖరారు చేశారు. ఈ కార్డు ద్వారా అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
మాకు అత్యంత గొప్ప నిపుణులు, ఉద్యోగులు కావాలి : ట్రంప్
హెచ్1బీ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ఔట్ సోర్సింగ్ కంపెనీలు విపరీతమైన వీసా అక్రమాలకు పాల్పడుతున్నాయని, తాజా చర్యతో వాటికి అడ్డుకట్టపడబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా అత్యుత్తమ నిపుణులే అమెరికా వచ్చేలా కంపెనీలు ఎంచుకునేందుకు తప్పని పరిస్థితి కల్పించబోతున్నదని అన్నారు. తన ఈ నిర్ణయం టెక్ కంపెనీల సిఇఓలను కొంత కలవరపెట్టినా చివరికి వారంతా సంతోషిస్తారన్ని ట్రంప్ పేర్కొన్నారు.
ఖజానాకు అదనంగా 100 బిలియన్ డాలర్లు…
లుట్నిక్ మాట్లాడుతూ అమెరికన్ల నుండి ఉద్యోగాలు తీసుకోవడానికి ప్రయత్నించేవారికి బదులుగా, తాము అసాధారణ వ్యక్తులను మాత్రమే అగ్రస్థానంలో ఉంచబోతున్నామన్నారు. వారు వ్యాపారాలను సృష్టించబోతున్నారని, అదే విధంగా అమెరికన్ల కు ఉద్యోగాలను సృష్టించబోతున్నారని తెలిపారు. వీసా ఫీజు పెంపు నిర్ణయంతో అమెరికా ఖజానాకు 100 బిలియన్ డాలర్లకు పైగా సమకూరబోతుందని తెలిపారు. ఏదేమైనా, అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న భారతీయులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఆ వీసాలను నిలుపుకోవటానికి ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 డాలర్ల రుసుము చెల్లించకూడదని వారి కంపెనీలు నిర్ణయించుకుంటే వారు అమెరికాలో కొనసాగగలరా అనేది ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.
Also Read: రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కల్వకుంట్ల కవిత