Thursday, September 25, 2025

ద్రోహం చేసినోళ్లే సుద్దులు చెబుతున్నారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

* ప్రభుత్వానిది పూటకో మాట..గడియకో లెక్క
* హంతకుడే సంతాప సభ పెట్టినట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు
* 299 టిఎంసిల కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకుని తెలంగాణకు ద్రోహం చేసింది వారే
* చారిత్రక తప్పిదం చేసింది మీరు…తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు
* సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బిఆర్‌ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్
* చంద్రబాబుకు భయపడి బనకచర్ల పై మౌనం
* కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తు పెంపు పై మౌనం
* రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా?
* ధ్వజమెత్తిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా జలాల్లో వాటా 299 టీఎంసీలుగా ఒప్పుకుంది కాంగ్రెస్ పార్టీనేనని, ఇప్పుడు అదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడటం హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వానిది పూటకో మాట..గడియకో లెక్క అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక తప్పిదం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు వారేనని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామంటూ మంగళవారం స్టేట్‌మెంట్ ఇచ్చారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్‌వోసీ ఇచ్చి.. ఏ ప్రాజెక్టులైన కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చాడని చెప్పారని చేశారు. మళ్లీ సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే సీఎం కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటాడని ఎద్దేవా చేశారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి 763 టీఎంసీల లెక్క చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు.

నీళ్ల వాటా గురించి అడిగితే నీళ్లు నములుతారు : బేసిన్ల గురించి బేసిక్స్ అడిగితే వాళ్లకు తెలీదని, నీళ్ల వాటా గురించి అడిగితే నీళ్లు నములుతారని అన్నారు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నారని, వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. : కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలని ఒప్పుకుందే కాంగ్రెస్ అని, మళ్లీ సిగ్గులేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల హక్కుల విషయంలో తాము సంతకం పెట్టినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తామని అన్నారు. నిరూపించని లేని పక్షంలో ఉత్తమ్ రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసిందని, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా తిరిగి వాటలు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.

సమక్క సాగర్‌పై డబ్బా ప్రచారం : సమ్మక్క సారక్క బ్యారేజ్‌కు మంత్రి ఉత్తమ్ అనుమతులు సాధించినట్లు చెప్పుకుంటున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఆయన తీరు ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో కేవలం 50 ఎకరాల ముంపునకు సంబంధించి సూత్రప్రాయ అంగీకారం కుదిరితే ఏదో గొప్పలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది, దేవాదులను పటిష్టం చేసేందుకు 7 టీఎంస్లీ సామర్ధంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ నిర్మించిండని అన్నారు. 83 మీటర్లకు డీపీఆర్‌ను పంపామని, అన్ని డైరెక్టరేట్ల నుంచి అనుమతులు సాధించామని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహం చేస్తున్నాయని అన్నారు.

రేవంత్ రెడ్డి బిహార్ కు వెళ్లి రాజకీయాలు : కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే సీఎ రేవంత్ రెడ్డి బిహార్ కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక సర్కార్ కుట్రలు పన్నుతోందన్నారు. తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే కర్ణాటక సర్కార్‌ను ఆపే ధైర్యం లేదా ధ్వజమెత్తారు. బనకచర్ల రూపంలో కృష్ణా నీళ్లను ఏపీ కొల్లగొడితే మౌనమని, ఇప్పుడు కర్ణాటక కొల్లగొడుతుంటే అదే తీరున వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని సీఎం రేవంత్ రెడ్డిఈ నీళ్ల దోపిడిని అడ్డుకోకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని హరీశ్ రావు అన్నారు.

Also Read: ఆర్‌టిసిలో ఎఐ వినియోగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News