మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు సమస్యల్లో ఉన్నారు. తాజాగా మొత్తంగా పార్టీ మారిన పది మంది ఎంఎల్‌ఎలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిటిషన్ లో కోరారు.
ఖైరతాబాద్ నుంచి బిఆర్‌ఎస్ టికెట్ పై ఎంఎల్‌ఎగా గెలుపొందిన దానం నాగేందర్ ఆరు నెలల తిరగకముందే మరో పార్టీ నుంచి ఎంపిగా పోటీ చేశారని అందులో మెన్షన్ చేశారు. రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవించడం తప్పని ప్రస్తావించారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎల జీతాలు, సౌకర్యాలు కట్ చేయాలని ఆయన పిటిషన్ లో వెల్లడించారు. ఈ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు పది మంది ఎంఎల్‌ఎలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. బిఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన కాంగ్రెస్‌లో పది మంది ఎంఎల్‌ఎలు చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ హైకోర్టు అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ముగ్గురు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరినప్పుడు దాఖలైన పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత వారిపై అనర్హతా వేటు వేయాలని బిఆర్‌ఎస్ కోర్టును ఆశ్రయించింది.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా గడువులోపు నిర్ణయం తీసుకోవడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పట్టించుకోవడం లేదని వాదించారు. బిఆర్‌ఎస్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోపు అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేకపోతే తాము మరోసారి విచారణ చేపడతామని ప్రకటించిది. ఈ తీర్పుపై ఇంకా అసెంబ్లీ స్పీకర్ కానీ స్పీకర్ కార్యదర్శి కానీ ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు కెఎ పాల్ పిటిషన్‌తో అందరికీ నోటీసులు జారీ అయ్యాయి. మామూలుగా అయితే వీరందరిపై అనర్హతా పిటిషన్లను బిఆర్‌ఎస్ స్పీకర్ దగ్గర నమోదు చేసింది. స్పీకర్ ఇంత వరకూ విచారణ ప్రారంభించలేదు.
అయితే అనర్హతా పిటిషన్లపై తుది నిర్ణయం స్పీకర్ దేనని, కోర్టులు జోక్యం చేసుకోలేవని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అధికారం అంతా స్పీకర్ చేతుల్లోనే ఉంటుందని, ఫలానా తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదని అంటున్నారు. ముగ్గురు ఎంఎల్‌ఎల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ స్పందనను బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తాజాగా కెఎ పాల్ 10మంది ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్ విచారణలోనూ హైకోర్టు నోటీసులు జారీ చేయడం ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు మరింత ఇరకాటంగా తయారైంది.