Tuesday, April 23, 2024

జోరుగా బెట్టింగ్

- Advertisement -
- Advertisement -
betting
మున్సిపల్ ఫలితాలపై పందాలు, పటి  కౌంటింగ్‌పై పెరిగిన ఆసక్తి

మున్సిపల్ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. గెలుపు ఓటములపై వందలు, వేలరూపాయలతో పందాలు కాస్తున్నారు. దీంతో శనివారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చర్చనీయాంశంగా మారింది. ఓ వైపున పార్టీలకు, అభ్యర్థులకు ఈ పోలింగ్ సవాల్‌గా మారగా.. మరోవైపున అనేక మంది రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోతోంది.

బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని జిల్లా కేంద్రాలైన సంగారెడ్డి, మెదక్‌తో పాటు సదాశివపేట అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐడిఏ బొల్లారం, అందోల్‌జోగిపేట, నారాయణ్‌ఖేడ్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చెర్యాల, రామాయంపేట మున్సిపాలిటీలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉన్నది. బందోబ స్తు మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఓట్లు నిల్వ ఉన్నాయి. అనేక వార్డుల్లో అధికార పార్టీదే పైచేయిగా కనిపించినప్పటికీ.. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఆగడం లేదు. సంగారెడ్డిలోని శాంతినగర్ వార్డు ఫలితంపై వేలాది రూపాయలను బెట్టింగ్ కాస్తున్నారు. అదే విధంగా ఓడిఎఫ్ కాలనీ, బృందావన్‌కాలనీ ఫలితంపై కూడా బెట్టింగ్ సాగుతోంది. సంగారెడ్డిలోని 23వ వార్డులో మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ముఖ్య అనుచరుడైన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు సతీమణి పోటీచేశారు.

ఈ సారి ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఆమెకే అధిక అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి బరిలో నిలిచారు. ఫలితంగా ఇక్కడి రిజల్ట్‌పై కూడా పందాలు కాస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సాబేర్ పోటీచేసిన వార్డుపై కూడా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఈ వార్డులో గతంలో ఎంఐఎం విజయం సాధించింది. ఈ సారి ముక్కోణపు పోటీ కొనసాగినట్లు భావిస్తున్నారు. ఖర్చుకూడా భారీగా చేశారని తెలుస్తోంది. అదే సమయంలో కల్వకుంట పరిధిలోని 7వ వార్డులో కూడా పోలింగ్ నువ్వా నేనా.. అన్నట్లు సాగింది. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీ తలపడ్డారు.

ప్రచారం దగ్గర నుంచి ఓటర్లను ఆకర్షించే వరకు పోటీపడ్డారు. తీసిపోని విధంగా పరస్పరం పోలింగ్ చేయించుకున్నారు. దీంతో ఈ వార్డు ఫలితంపై పట్టణంలో యెడతెగని ఆసక్తి నెలకొంది. దీంతో కల్వకుంట వాసులతో పాటు సంగారెడ్డికి చెందిన అనేక మంది ఈ ఫలితంపై బెట్టింగ్ చేశారు. వేలాది రూపాయలను పందెంగా కాస్తున్నారు. ఇవే కాకుండా సంగారెడ్డిలోని మరికొన్ని వార్డుల ఫలితాలపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బుధవారం ఫలితం ముగియడంతోనే వార్డుల వారీగా అనేక మంది అంచనా వేశారు. గురువారం ఈ అంచనాలు మరింత పెరిగాయి. శనివారం జరుగనున్న కౌంటింగ్‌కు సంబంధించి ఆసక్తి మరింత పెంచే విధంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇవేకాకుండా ఈ సారి సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎవ్వరు ఎన్నికవుతారో..? అన్న అంశంపై కూడా చర్చసాగుతోంది.

కొందరైతే ఈ అంశంపై కూడా బెట్టింగ్ కాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవేకాకుండా సదాశివపేట, బొల్లారం, అమీన్‌పూర్, తెల్లాపూర్, నర్సాపూర్, తదితర మున్సిపాలిటీల ఫలితాలపై కూడా పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల వారీగా కూడా అంచనాలు వేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిధీమాతో కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను ఈ సారి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌కు కాస్తో.. కూస్తో.. చాన్స్ ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను ఈ సారి సునాయాసంగా దక్కించుకుంటామని చెబుతోంది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ తేడాతో ఓడిపోతారని అంచనా వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం, పోలింగ్ తదితర అంశాల్లో పూర్తిగా పైచేయి సాధించామని, ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొన్నామని అందువల్ల ఫలితాలు తమకే అనుకూలంగా రాబోతున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ పూర్తిధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని, ఏమాత్రం అనుమానానికి ఆస్కారం లేనేలేదని అంటున్నారు. ఈ దెబ్బతో ఈ నియోజకవర్గ రాజకీయాలు మారిపోతాయని ఆయన చెబుతున్నారు.

Huge Betting on Telangana municipal Elections Results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News