Friday, April 26, 2024

బతకనిద్దాం బతుకునిద్దాం

- Advertisement -
- Advertisement -

National-Girl-Child-Day

సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా జనగణన లెక్కల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో ఆందోళనకరమైన తేడా కనిపిస్తోంది 2011 జనాభా లెక్కల ప్రకారం.. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది మాత్రమే మహిళలున్నట్లు తేలింది. అలాగే 6 సంవత్సరాలలోపు ఆడపిల్లలైతే ప్రతి 1000 మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నట్లు జనాభా లెక్కల్లో వెలుగు చూసింది. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది. అక్షరాస్యత శాతాన్ని చూస్తే మహిళల అక్షరాస్యత 68.4 శాతంగా ఉంది. బాల్య వివాహాలు భారత్‌లో అధికంగా అవుతున్నాయి. 26.8 శాతం మంది బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 40 శాతం బాల్య వివాహాలు అవుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే.

ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు కూడా దయనీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రా మీణ భారతంలో ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మగ పిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా, కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడ పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కూడా నూటికి 10 నుండి 30 శాతం మాత్రమే ఉండడం ఇందుకు సాక్ష్యం. నేటికీ ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య పోషకాహార లోపం. కుటుంబ ఆర్థిక సమస్యలతో ఏదో ఒక పని చేసి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి వస్తోంది. ఉన్న ఊర్లో పనులు దొరకక వలసలు పోతున్న ఆడ పిల్లలు, అక్కడా రక్షణ లేక లైంగిక దాడుల బారిన పడుతున్నారు. కనిపించకుండా పోతున్నవారి సంఖ్య వందల సంఖ్యల్లో ఉంది. సామాజిక, ఆర్థిక పరిస్థితిల్లో వచ్చిన మార్పుల ఫలితంగా బాలికలంటే కేవలం కట్నం తెచ్చే యంత్రంగానే పరిగణిస్తున్నారు. దాంతో ఆడ పిల్లల పెళ్లిళ్లు భారంగా మారాయి. దీంతో పేద తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో మైనారిటీ తీరకుండానే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు అతి చిన్న వయస్సులోనే తల్లులుగా మారుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

వీటితోపాటు రోజు రోజుకూ బాలికలపై, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు మరొకటి. ఆడ పిల్లకు బడిలో, గుడిలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, అత్తగారింట్లో చివరికి ఇంట్లో కూడా ఎక్కడా సరైన రక్షణ లేదు. ఆడ పిల్లల పైన జరిగే అకృత్యాలకు అంతే లేకుండా పోయింది. 5 సంవత్సరాల పాప నుండి 80 సంవత్సరాల ముదుసలి వరకు, రోజు కూలి చేసుకునే మహిళా దగ్గర నుంచి కోట్లు సంపాదించే సినీ తారల వరకు, చదువుకునే అమ్మాయి నుంచి, చదువు చెప్పే ఉపాధ్యాయుల వరకు ప్రాణాలు తీసే రౌడీల నుండి ప్రాణాలు పోసే డాక్టరు వరకు, సిల్లీగా గల్లీలో తిరిగే కుర్రకారు నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే బాబాల వరకు ప్రపంచంలో ఎక్కడో అక్కడ ప్రతి రోజు, ప్రతీ నిత్యం మనం అనేక అకృత్యాలు జరుగుతున్నట్లు చూస్తూనే ఉన్నాము. వీటిని అరికట్టి బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, సమాజం తీసుకోవాలి. పుట్టిన పన్నెండు మిలియన్ల బాలికల్లో మూడు మిలియన్ల మంది తమ పదిహేనవ పుట్టిన రోజును, ఒక మిలియన్ మంది తమ మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే మరణిస్తున్నారు. లింగ వివక్ష వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక చావుకి గురవుతున్నారు. యాభై శాతం బాలికలకు పోషకాహారం అందడం లేదు. బాలికలలో ఇద్దరిలో ఒకరు సరైన పోషకాహారం పొంద డం లేదు.

నేటి బాలలే రేపటి పౌరులు పదే పదే అనేక సందర్భాల్లో పాలకులు ఉటంకించే మాట. ప్రధానంగా బాలికలను, వారి తల్లిదండ్రులను బాగా వేధించే సమస్య బాలికల అక్రమ రవాణా. పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల చేతుల్లో బానిసలుగా మారిపోతున్నారు. సమాజాన్ని అర్థం చేసుకునేలోపు వారి జీవితాలు నలిగిపోతున్నాయి. వారి ఆనందాన్ని, ఆశలను కొన్ని శక్తులు చిదిమేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బాల బాలికల అక్రమ రవాణా. యూనిసెఫ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచంలో 15 వేల మిలియన్ల బాల, బాలికలు అక్రమంగా రవాణా అవుతున్నారు. భారతదేశం నుం చి 24 శాతం మంది రవాణా అవుతున్న వారి వయసు 15 ఏళ్ల లోపే. ఇలా రవాణా అవుతున్న వారిలో అధిక శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ అక్రమ రవాణా అంతా బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ నుంచి ఎక్కువగా సాగుతోంది. బాలల అక్రమ రవాణాకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. పిల్లల భద్రతగానీ, వారికి కల్పించాల్సిన సదుపాయాలపైనగానీ దృష్టి పెట్టడం లేదు. ఇటీవల కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 24 శాతం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామంటున్న పాలకులు దాన్ని మిథ్యగా మారుస్తున్నారు. ఇప్పటికైనా పాలకుల ఆలోచనా విధానం మారాలి. అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం కృషి చేయాలి.

బాలికల పట్ల సమాజం ఇంత వివక్ష చూపుతున్నా దేశం పరువును అన్ని రంగాల్లో నిలబెడుతుంది మాత్రం ఆడపిల్లలే. అలాంటి అమ్మాయిలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే తమ సత్తా చాటుకుంటారు. లింగ సమానత్వం కోసం భ్రూణహత్యలు, పౌష్టికాహార లోపాలు, అనారోగ్యం, అవిద్య, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా వంటి సమస్యలపై మరింత చిత్తశుద్ధితో పని చేయాలి. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, రాజకీయ, క్రీడా రంగాల్లో కీలక పాత్ర పోషించేలా తీర్చిదిద్దాలి. ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన కోసం బాలికల నైపుణ్యాలను మెరుగుపరచాలి. మంచి స్పర్శ, చెడు స్పర్శ, అనుచిత ప్రవర్తనపై బాలికలకు అవగాహన కల్పించాలి.

                                                                                                  బి.వెంకట శైలజ 

National Girl Child Day 202

 

బి.వెంకట శైలజ 0బి.వెంకట శైలజ 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News