Wednesday, April 24, 2024

మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!

- Advertisement -
- Advertisement -

amit shah

ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్‌యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. వారితో పాటు బిజెపి దాని అధికారాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అదే పద బంధాన్ని ప్రయోగిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న దుస్థితి ఉంది. కానీ, నిజానికి దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని ప్రత్యేకంగా చెప్పక తప్పదు.

సుమారు 70 ఏళ్లుగా దేశంలో కుల,మత, ప్రాంత, జాతి, భాషలకి అతీతంగా ప్రజానీకాన్ని నిత్యం మతపరంగా విభజిస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నది. ముస్లిం ప్రాబల్య కశ్మీర్‌కి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ముస్లిం యువకులని జైలు పాలు చేసి ఆ మత కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో మతపరంగా సిటిజన్ షిప్ ఇవ్వడం అందులో ముస్లిం మతస్థులకి నిరాకరించడం చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వమని అర్థం చేసుకోక తప్పదు. ఇంత స్థాయిలో దేశాన్ని విడగొడుతున్న మోడీ, షాల కంటే తుక్డే తుక్డే గ్యాంగ్ ఇంకెవరు ఉంటారు.
ఇటీవల ప్రతిష్ఠాత్మక జెఎన్‌యులో జరిగిన పరిణామాలు ఆందోళకరం. సాటి భారతీయుడిగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎంతో బాధగా ఉందని అనుకుంటున్న దుస్థితి ఉంది.

జెఎన్‌యు విద్యార్థులను కాషాయ తీవ్రవాదులు తీవ్రంగా కొట్టారు. అటు తర్వాత వారిపైనే కేసులు బనాయించారు. దాడిలో దెబ్బలు తిన్న జెఎన్‌యు ఎస్‌యు అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ని పరామర్శించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నిజ జీవితంలో కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఆమె కాషాయ తాలిబన్లుగా పేరొందిన బిజెపి దాని అనుబంధ సంస్థలకి టార్గెట్ అయ్యారంటే సత్యదూరం కాదు.

జెఎన్‌యులో కాషాయ మూకలు చేసిన దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శ చేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశ ద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు. ఆ చిత్నాన్ని బ్యాన్ చేయాలని వాదిస్తున్నారంటే జెఎన్‌యులో విద్యార్థులపై తామే దాడి చేశామని ఒప్పుకుంటున్నట్టే కదా. దీనికి వారంతా సమాధానం చెప్పాల్సి ఉంది.

జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా చావబాదారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్ ఛాన్సలర్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో పోలీసులే కాషాయ మూకలకి మారణాయుధాలిచ్చి సరికొత్త దాడులకు తెర తీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు. అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం.

జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే! దాదాపు 50 మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరావ్‌ు, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికి పైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పథకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు.

పోలీసులు, యూనివర్శిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్ర మోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూడా విసి జగదీష్ కుమార్(తెలంగాణ వాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురు దాడులకు దిగారు.

దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకొనె చేసిన ‘నేరం, ఘోరం’. నిందితులపై ఇంత వరకు చర్యలు లేవు.

పోలీసుల తీరు కూడా పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది. దాడి చేసినవారిపై కాకుండా బాధితులపై మాత్రం కేసులు పెట్టారు. ఈ తరహా దాడి మన దేశంలో ఇదే ప్రథమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్క తి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు. ఇటువంటి వాటి ప్రజాస్వామ్య లోకం తీవ్రంగా ఖండించాల్సి ఉంది.

కాషాయ మూకలు చేసిన దాడిపై పౌర సమాజం తీవ్రంగా స్పందించింది. విద్యార్థి లోకంగా గర్జించింది. ముంబైలో మరికొందరు బాలీవుడ్ నటీనటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనె చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది? జనవరి 10వ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాద దాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు.

దీపిక జెఎన్‌యుకి రావడంపై భిన్న వాదనలు బిజెపిలోనే వినిపిస్తున్నాయి. ఒక కేంద్ర మంత్రి జవదేవకర్ ఛపాక్ సినిమాను బహిష్కరించాలనడాన్ని తాను అంగీకరించనని చెబుతారు. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్ నిలిచిందని అన్నారు. జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహీంద్రా, కిరణ్ షా మజుందార్, హర్షా మారివాలా కూడా ఖండించారు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేధావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలక పార్టీ పెద్దలు దేశద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, పాలక పార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా? బ్రిటీష్ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన చరిత్ర మన దేశానికి ఉన్న విషయం మరవరాదు.

tukde tukde gang for violence in Delhi

                                                                              మన్నారం నాగరాజు, 9550844433

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News