Saturday, April 27, 2024

కనువిందు చేసిన జనమేడారం

- Advertisement -
- Advertisement -

Medaram Jatara

 

హైదరాబాద్, వరంగల్  : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆదివారం 8 నుంచి 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో క్యూలైన్ల గ్యాలరీలను ప్రారంభించి అక్కడి నుంచే తల్లుల దర్శనానికి అనుమతించగా సాధారణ భక్తుల దర్శనానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతోంది.

జాతరను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
ఆదివారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్‌లు తమ కుటుంబసభ్యులతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. సంప్రదాయ బద్ధంగా జంపన్నవాగులో స్నానమాడిన మంత్రుల కుటుంబసభ్యులు దర్శనానికి చేరుకునే ముందు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని తల్లుల గద్దెలను దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తమ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. జాతర ఇన్‌చార్జ్‌గా ఉన్న ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, మేడారం నోడల్ అధికారి విపి గౌతమ్‌లు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి షాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.

ఆదివాసీల సంస్కృతి గొప్పది..
మేడారంలో నీటిశుద్ధికరణ, మిషన్ భగీరథ ప్లాంట్‌లతో పాటు భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను ఈ సందర్భంగా మంత్రులిద్దరూ ప్రారంభించారు. అనంతరం గిరిజన మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కృతీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. చిలకలగుట్ట ఆవరణలోని 800 ఎకరాల అటవీ భూములను పూజారుల పరిధిలో ఉండేలా మంత్రులు ఆదేశాలు పత్రాలను జారీ చేశారు. ఈ భూముల్లో అటవీ, పర్యావరణ సంరక్షణకు ఇబ్బందులు కలగకుండా వన దేవతల పూజలను నిర్వహించాలని మంత్రులు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి గొప్పది, దానిని పరిరక్షించుకోవాలన్నారు. మేడారం జాతర వన జాతరని గిరిజన సంక్షేమంలో ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. మేడారం నిత్యం జనంతో ఉండాలని, ఆదివాసీ సంస్కృతిని కాపాడుకుంటూ అందరం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా జాతరను నిర్వహించుకోవాలని పూజారుల సలహాలు, సహకారంతో జాతరను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

5వ తేదీ నుంచి 8 వరకు జరిగే కార్యక్రమాల వివరాలు..

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు మేడారం జాతర జరగనుంది. దానికి సంబంధించిన వివరాలు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.
మొదటిరోజు : ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.
రెండోవరోజు : ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.
మూడవరోజు : ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
నాల్గవరోజు : ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

Huge Devotees at Medaram Jatara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News