Friday, May 3, 2024

హైదరాబాద్ ఇన్నింగ్ ఓటమి

- Advertisement -
- Advertisement -

Ranji-Trophy

ఒంగోలు: ఆంధ్రాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఒంగోలు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఇక, ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. మరోవైపు ఆంధ్రా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే వరుస విజయాలతో జోరుమీదున్న ఆంధ్రా పాయింట్ల పట్టికలో ఆగ్ర స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వరుస పరాజయాలు చవిచూస్తున్న హైదరాబాద్ అట్టడుగు స్థానానికి పడి పోయింది.

45/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. జట్టులో రవితేజ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆంధ్రా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రవితేజ మూడు సిక్సర్లు, 8 ఫోర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (41) పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్రా బౌలర్లలో విజయ్‌కుమార్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన విజయ్‌కుమార్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. పృథ్వీరాజ్ మూడు, శశికాంత్ రెండు వికెట్లు తీసి తమవంతు సహకారం అందించారు.

ఇక, హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేసింది. ఆంధ్రా మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 489 పరుగులు సాధించి డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (119) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మరో ఓపెనర్ జ్ఞానేశ్వర్ (73), కెప్టెన్ హనుమ విహారి (55), రికి బూయి (69) పరుగులు చేశారు. మరోవైపు కిరణ్ షిండే (94) కొద్ది తేడాతో సెంచరీని చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

డ్రాతో గట్టెక్కిన ముంబై

ఇక, చెన్నై వేదికగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌ను ముంబై డ్రాగా ముగించింది. ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై బలమైన తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో మెరుగైన ఆటతో ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ ఆదిత్య తారే అద్భుత బ్యాటింగ్‌తో ముంబైను ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న తారే 154 పరుగులు సాధించాడు. శమ్స్ ములాని (87), శశాంక్ (58) అర్ధ సెంచరీలతో తమవంతు పాత్ర పోషించారు. ఒక దశలో 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ముంబైను ములాని, తారేలు ఆదుకున్నారు.

ఇద్దరు అసాధారణ ఆటతో జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించారు. మరోవైపు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఓపెనర్ అభినవ్ ముకుంద్ (58), కౌశిక్ గాంధీ (60) అర్ధ సెంచరీలతో తమవంతు సహకారం అందించారు. కాగా, ముంబైకు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన తమిళనాడు చివరి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. మరోవైపు రైల్వేస్‌మధ్యప్రదేశ్, సౌరాష్ట్రకర్నాటక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు కూడా డ్రాగా ముగిసాయి. కాగా, కేరళ, విదర్భ జట్లు జయకేతనం ఎగుర వేశాయి.

Hyderabad Innings Defeat in Ranji Trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News