Thursday, March 28, 2024

టాప్10లో రాహుల్, కోహ్లి

- Advertisement -
- Advertisement -

kl-Rahul-And-virat

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్10లో చోటు సంపాదించారు. ఇక, బౌలింగ్ విభాగంలో యువ స్పీడ్‌స్టర్ నవ్‌దీప్ సైని తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు. శిఖర్ ధావన్, మనీష్ పాండేలు కూడా తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకోవడంలో సఫలమయ్యారు. శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్ తన రేటింగ్‌ను మరింత మెరుగు పరుచుకోవడం విశేషం.

రెండు మ్యాచుల్లోనూ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. దీంతో అతను 26 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తన ఆరో ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టాప్10లో నిలిచాడు. రెండు మ్యాచుల్లో కూడా కోహ్లి బాగానే ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి 9వ స్థానంలో నిలిచాడు. ఇక, మూడో మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో మెరిసిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. శనివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ధావన్ 15వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక, బౌలింగ్‌లో యువ సంచలనం నవ్‌దీప్ సైని తన ర్యాంక్‌ను అనూహ్యంగా మెరుగు పరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నవ్‌దీప్ ఏకంగా 146 స్థానాలు ఎగబాకాడు. దీంతో సైని టాప్100లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం సైని 98వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. మరో స్పీడ్‌స్టర్ శార్దూల్ ఠాకూర్ కూడా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో శార్దూల్ 92వ స్థానంలో నిలిచాడు. కాగా, బ్యాటింగ్‌లో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్, బౌలింగ్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో, ఇంగ్లండ్ మూడో ర్యాంక్‌లో నిలిచాయి. దక్షిణాఫ్రికాకు నాలుగో స్థానం లభించింది. ఇక, టీమిండియా తన ఐదో ర్యాంక్‌ను కాపాడుకుంది.

ICC T20I Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News