Tuesday, July 16, 2024

2022లో నేను శ్రీలంక అధ్యక్షుడుగా కొనసాగాలి

- Advertisement -
- Advertisement -

భారత్ గట్టిగా కోరింది
కొన్ని పాశ్చాత్య దేశాల ప్రేరణతో జనంలో నిరసనలు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

కొలంబో : 2022లో జనంలో తిరుగుబాటుతో శ్రీలంక అధ్యక్షుడుగా పదవీచ్యుతుడైన గొటబాయ రాజపక్స కొన్ని పాశ్చాత్య దేశాల ప్రేరణతో జనంలో నిరసనలు పెరుగుతున్నప్పటికీ తాను పదవిలో కొనసాగాలని భారత్ పట్టుబట్టిందని గురువారం వెల్లడించారు. ‘నేను రాజీనామా చేయరాదని ఒక పెద్ద విదేశీ శక్తి పట్టుబట్టింది. శ్రీలంకకు అత్యవసర సరఫరాలు కొనసాగింపునకు ఏమైనా చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు’ అని రాజపక్స భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా తన గ్రంథంలో రాశారు.

‘అధ్యక్ష పదవి నుంచి నా తొలగింపునకు కుట్ర’ అనే శీర్షికతో రాజపక్స రాసిన గ్రంథం అమ్మకాలు గురువారం మొదలయ్యాయి. అయితే, అధికారికంగా ఆవిష్కరణ జరగలేదు. 400 కోట్ల అమెరికన్ డాలర్లు విలువ చేసే రుణ సాయాన్ని భారత అందజేసిన తరువాత 2022 జూలై మధ్యలో గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, మాల్దీవులకు పారిపోయారు. అంతకు ముందు నాలుగు నెలల పాటు నిత్యావసరాలు, ఇంధనం కోసం పొడుగాటి క్యూలు కానరాగా శ్రీలంక ఆర్థికంగా దివాలా తీసింది.

భారత్ నుంచి అందిన ఈ కీలక సాయం గురించి రాజపక్స పుస్తకంలో ప్రస్తావన ఉన్నది. ‘నిజమే. శ్రీలంక ప్రజలకు ఒకింత ఉపశమనం కలిగించేందుకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను’ అని మాజీ అధ్యక్షుడు గొటబాయ పుస్తకంలో తెలిపారు. రెండు సంవత్సరాల కొవిడ్ లాక్‌డౌన్‌లు, పాఠశాలల మూసివేత, ఉద్యోగాల నష్టం, జీవన వ్యయం పెరుగుదల వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘నా కారణంగా ప్రజలు సుదీర్ఘ రాజకీయ ప్రతిష్టంభనను ఎదుర్కోరాదని కోరుకున్నా’ అని ఆయన తెలియజేశారు. ‘ప్రతి ఒక్కరి జీవితాన్ని దుర్భరం చేస్తున్న విధ్వంసానికి, రాజకీయ కుట్రలకు ముగింపు పలికేందుకు రాజీనామా చేశాను’ అని ఆయన తెలిపారు.

‘నా అధికార చ్యుతికి సాగిన చర్యల వెనుక ఏ విదేశీ శక్తీ లేదనిఎవరైనా అనడం అమాయకత్వమే అవుతుంది’ అని రాజపక్స అన్నారు. ‘నా ఉద్వాసన కోసం హింసాత్మక నిరసనలు, విధ్వంసకాండను దృఢనిశ్చిత విదేశీ శక్తులు, కొన్ని స్థానిక పార్టీలు నిధులు సమకూర్చి, నిర్వహించాయి. నేను అధికారంలో కొనసాగినంత కాలం వారు వాటిని ఆపి ఉండేవారు కాదు. అందువల్ల ప్రజలు మరింత విధ్వంసకాండ, మరిన్ని కొరతలు, మరిన్ని అల్లర్లు, ప్రదర్శనలను ఎదుర్కొనవలసి ఉండేది. ప్రశాంతత పునరుద్ధరణ జరిగేది కాదు’ అని మాజీ అధ్యక్షుడు పుస్తకంలో రాశారు. ఆయన ఏ దేశాన్నీ పేరు పెట్టి ప్రస్తావించలేదు. కానీ‘ప్రజాస్వామ్యం.

ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధ పాలన పరిరక్షకులుగా తమను తాము చిత్రించుకుంటున్న కొన్ని దేశాలు’ వంటి వాక్యాలు ఆయన వేలెత్తి చూపుతున్న పాశ్చాత్య దేశం ఏదో చెప్పకనే చెబుతున్నాయి. ‘వాస్తవానికి ఏ వర్ధమాన దేశంలోనైనా ప్రజాస్వామ్యానికి భారీ నష్టం నిరంకుశ తరహా ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రపంచ శక్తుల నుంచి కాకుండా కొన్ని సంపన్న అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యాలు, వాటి చెల్లింపులు అందుకునే పాత్రికేయుల వల్ల జరుగుతుంది’ అని రాజపక్స పేర్కొన్నారు.

అధ్యక్షుడుగా సైనిక బలగాల సుప్రీం కమాండర్ అయిన రాజపక్స నిఘా వైఫల్యానికి రక్షణ శాఖలో వ్యక్తిగత సంఘర్షణలు కారణమని, అది ముంచుకు వస్తున్న ముప్పును సరిగ్గా మదింపు వేయలేకపోయిందని వివరించారు. భవిష్యత్తు కోసం ‘విదేశీ రాయబార కార్యాలయాల సిబ్బందితో సాయుధ బలగాలు, పోలీసులు, నిఘా విభాగం సీనియర్ అధికారుల సంప్రదింపులను క్రమబద్ధం చేయడం, పర్యవేక్షించడం, పరిమితి చేయడం వంటి కఠిన ప్రోటోకాల్స్‌ను అమలు జరపాలి. మిలిటరీ కేంద్రాలలో విదేశీ రాయబారుల సందర్శనలను నిలిపివేయాలి’ అని రాజపక్స స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News