Monday, April 29, 2024

కొన్ని చోట్ల మొరాయించిన ఈవిఎంలు

- Advertisement -
- Advertisement -

అరగంట నుంచి గంటన్నర పాటు ఆగిన పోలింగ్
పోలింగ్ ఆలస్యంపై ఓటర్ల అసంతృప్తి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాల మొరాయింపుతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ ఆలస్యంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 33వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఈవిఎం పనిచేయలేదు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని 63వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవిఎం మొరాయించడంతో సుమారు అరగంట పాటు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.
జూబ్లీహిల్స్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్ 153లో
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్ 153లో ఓటింగ్ యంత్రాలు పనిచేయలేదు. అధికారులు తక్షణమే స్పందించి వాటిని సరి చేశారు. సికింద్రాబాద్‌లోని. కంటోన్మెంట్ నియోజకవర్గం రెజిమెంటల్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 209లో ఈవిఎం మొరాయింపుతో ఓటర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. పోలింగ్ ఆలస్యంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్ధన్నపేట మండలంలో గంటపాటు మొరాయింపు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలోని 199వ బూత్‌లో ఈవిఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగే రాయపర్తి మండల కేంద్రంలోని 169 బూత్‌లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బంగారుగడ్డలోని 120 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రాలు పనిచేయలేదు. సుమారు గంట పాటు ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు.
వనపర్తి జిల్లాలో పోలింగ్ ఆలస్యం
వరంగల్ నియోజకవర్గంలోని దేశాయిపేట నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలు పనిచేయలేదు. దీంతో గంట పాటు పోలింగ్ నిలిచింది. వెంటనే అధికారులు స్పందించి మరో యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
మొరాయించిన వివి ప్యాట్ యంత్రం
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో ఈవిఎం మొరాయించింది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లోనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు వెంటనే మరో ఈవిఎం యంత్రాన్ని ఏర్పాటు చేసి ఎన్నిక సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండోన్‌పల్లి గ్రామంలోని 85వ నంబర్ పోలింగ్ కేంద్రంలో వివి ప్యాట్ యంత్రం మొరాయించింది. దీంతో సుమారు అరగంట సేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
రోడ్డు కోసం నిరసనకు దిగిన ఓటర్లు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో ఇంకా పోలింగ్ చాలా సేపటి వరకు మెుదలు కాలేదు. మూరుమూల అటవీ ప్రాంతంలో ఉండే ఈ గ్రామంలో ఓటర్లు నిరసనకు దిగారు. తమకు ఏళ్లుగా రోడ్డు సమస్య వేధిస్తున్నా ఏ నాయకుడు తమ గోడును పట్టించుకోలేదని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పోలింగ్‌కు ఇబ్బంది నెలకొంది.
ఓటు వేసేందుకు 10 కిలోమీటర్ల నడక..
ఇక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం డబోలి, లొద్దిగూడ గ్రామస్థులు పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు సుమారు 10 కిలోమీటర్లు నడిచి వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా ఈ ఎన్నికలు కూడా బహిష్కరించాలని అనుకున్నామని, కానీ, తమ హక్కును వినియోగించుకొని ఈ సమస్యపై మరోసారి గెలిచిన నాయకులను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News