Saturday, July 27, 2024

రాష్ట్రంలో 1340 ప్రాథమిక సహకార సంఘాలు!

- Advertisement -
- Advertisement -

 

Primary Agricultural Cooperative Societies

హైదరాబాద్: రైతన్నలకు ప్రభుత్వ సహకారాన్ని మరింత చేరువగా తీసుకువచ్చేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) సంఖ్యను పెంచనున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఖచ్చితంగా రెండు ప్యాక్స్‌లు ఉండాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా కొత్తగా 434 ప్యాక్స్‌లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సహకార శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీటి ఏర్పాటు పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మొత్తం 584 మండలాలకు 906 సహకార సంఘాలున్నాయి. 81 మండలాల్లో ఒక్క ప్యాక్స్ కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ప్రస్తుతమున్న 584లో 272 మండలాల్లో ఒక్కో ప్యాక్స్ మాత్రమే ఉంది.

కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటిలో అదనంగా మరొక ప్యాక్స్ ఏర్పాటు చేస్తారు. 81 మండలాల్లోను రెండు చొప్పున మొత్తం 162 ఏర్పాటు చేస్తారు. దీంతో కొత్తగా 434 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటుకానున్నాయి. కొత్త ప్యాక్స్‌లు ఏర్పాటైన వెంటనే అంటే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత అన్నింటికి కలిపి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నాలుగు సార్లు పర్సన్ ఇంఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణ వచ్చిన తరువాత ప్యాక్స్‌కు ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతమున్న గడువు ఫిబ్రవరి 5వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతమున్న 906లో 300 వరకు ప్యాక్స్‌లు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్యాక్స్‌లు మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు కొని రైతులకు విక్రయించినా మళ్లీ తిరిగి మార్క్‌ఫెడ్‌కు త్వరగా సొమ్ము చెల్లించడం లేదు.

సిబ్బంది కూడా పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వం వీటిని బలోపేతం చేయడంతో పాటు పారదర్శకత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులైన రైతులకు పంట రుణాలను ఇవ్వడం, సమర్ధవంతంగా వసూలు చేయడమే కాకుండా ఇతర సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా వీటిని తీర్చిదిద్దేందుకు చర్యలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు గ్రామస్థాయిలో అన్ని రకాల సేవలు ప్యాక్స్ ద్వారానే అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విత్తనాల విక్రయాలు మొదలుకుని, పంట కొనుగోలు దాకా అన్ని రకాల పనులు ప్యాక్స్ చేయాలనేది లక్ష్యం. అందులో భాగంగానే రైతులందరికీ దగ్గరలో ఉండేలా ప్రతీ 10 కిలో మీటర్ల నుంచి నుంచి 15 కి.మీ పరిధిలోనే ఒక ప్యాక్స్ ఉండేలా కసరత్తు చేస్తున్నారు.

Increased Primary Agricultural Cooperative Societies
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News