Saturday, October 12, 2024

సిరీస్ ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి టి20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు అసాధారణ రీతిలో రాణించడంతో భారత్ ఘన విజయం అందుకుంది. తొలి రెండు మ్యాచుల్లో భారత్‌పై సునాయాస విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఆ తర్వాత వరుసగ పరాజయాలను మూటగట్టుకుంది. అయితే ఆఖరి టి20లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో సఫారీ జట్టు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో చివరి టి20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఓపెనర్లే కీలకం..
ఇక ఈ సిరీస్‌లో భారత్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో రుతురాజ్ తక్కువ స్కోరుకే ఔట్ కావడం కాస్త కలవరానికి గురి చేస్తోంది. కానీ చివరి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలనే ఉద్దేశంతో రుతురాజ్ ఉన్నాడు. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు ఇషాన్ కిషన్ సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో కూడా ఇషాన్ బాగానే బ్యాటింగ్ చేశాడు. అయితే కీలక సమయంలో పెవిలియన్‌కు చేరడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు. మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతని బ్యాటింగ్‌లో నిలకడగా కనిపించడం లేదు. ఇది జట్టును ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ సిరీస్‌లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా సత్తా చాటలేక పోయాడు. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా రాణించాల్సిన అవసరం అతనిపై ఉంది. రిషబ్ విజృంభిస్తే టీమిండియా బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.
అందరి కళ్లు ఇద్దరిపైనే..
మరోవైపు కిందటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌లపై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. కీలక సమయంలో హార్దిక్, దినేశ్‌లు అద్భుతంగా రాణించారు. కార్తీక్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో కెరీర్‌లోనే తొలి అర్ధ సెంచరీని కూడా నమోదు చేశాడు. చివరి టి20లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. హార్దిక్ కూడా జోరుమీదున్నాడు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ చివరి వరకు క్రీజులో నిలిచినా టీమిండియాకు మెరుగైన స్కోరు ఖాయం. కాగా, బౌలింగ్‌లో కూడా టీమిండియా బలంగా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. హర్షల్ పటేల్, భువనేశ్వర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం..
ప్రతిభావంతులైన క్రికెటర్లతో కూడిన సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. మిల్లర్, డుసెన్, క్లాసెన్, ప్రెటోరియస్, డికాక్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. మరోవైపు నోర్జే, రబాడ, ప్రెటోరియస్, షమ్సి,పర్నెల్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. దీంతో సౌతాఫ్రికా కూడా సిరీసే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

IND vs SA 5th T20 Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News