Thursday, April 25, 2024

టీమిండియా బోణీ

- Advertisement -
- Advertisement -

India win in 2nd T20

 

సైని మ్యాజిక్, రాణించిన కుల్దీప్, ఠాకూర్, రాహుల్, కోహ్లి, మెరుపులు, తొలి టి20లో భారత్ ఘన విజయం

ఇండోర్: కొత్త సీజన్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శ్రీలంకతో ఇండోర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం గౌహతిలో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన తొలి గెలుపును దక్కించుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో టి20 శుక్రవారం పుణెలో జరుగనుంది. రెండో టి20లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 17.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్ శుభారంభం అందించారు. ఇద్దరు లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ధావన్ సమన్వయంతో ఆడగా రాహుల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడడంతో భారత్‌కు మెరుగైన ఆరంభమే లభించింది. ఇదే క్రమంలో ఇద్దరు జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 32 బంతుల్లో ఆరు ఫోర్లతో 45 పరుగులు చేసిన రాహుల్‌ను వనిండు హసరంగా వెనక్కి పంపాడు. దీంతో 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో ఓపెనర్ ధావన్ కూడా ఔటయ్యాడు. రెండు ఫోర్లతో 32 పరుగులు చేసిన ధావన్‌ను కూడా హరసంగా పెవిలియన్ బాట పట్టించాడు.

కోహ్లి మెరుపులు
ఈ దశలో జట్టును ముందుకు నడిపించే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. భారీ షాట్లతో స్కోరును పరిగెత్తించారు. ఇక, భారత్‌పై ఒత్తిడి పెంచాలని భావించిన లంక బౌలర్ల ఆశలపై వీరు నీళ్లు చల్లారు. ఇటు అయ్యర్, అటు కోహ్లి ధాటిగా ఆడడంతో భారత్ లక్షం దిశగా సాగింది. చెలరేగి ఆడిన 3ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా 34 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. లంక బౌలర్లను హడలెత్తించిన కోహ్లి 17 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ మరో 15 బంతులు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

శుభారంభం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్లు దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. వీరిద్దరూ కుదురుగా ఆడడంతో లంకకు శుభారంభం ఖాయమనిపించింది. కానీ, 16 బంతుల్లో ఐదు ఫోర్లతో 22 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపించిన అవిష్క ఫెర్నాండోను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. దీంతో 38 పరుగుల వద్ద లంక తొలి వికెట్‌ను కోల్పోయింది. కొద్ది సేపటికే మరో ఓపెనర్ గుణతిలక కూడా ఔటయ్యాడు. 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన గుణతిలకను సైని పెవిలియన్ పంపించాడు.

బౌలర్ల జోరు
ఆ తర్వాత భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ లంక బ్యాటింగ్ లైనప్‌ను హడలెత్తించారు. మధ్యలో వికెట్ కీపర్ కుశాల్ పెరీరా ఒక్కడే కాస్త రాణించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కుశాల్ మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. మరోవైపు భారత బౌలర్లలో నవ్‌దీప్ సైని, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా రాణించారు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సైని 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. లంక బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన శార్దూల్ 23 పరుగులకే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా కీలక సమయంలో రెండు వికెట్లు తీసి తనవంతు సహకారం అందించాడు.

ఇక, గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చిన స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. బుమ్రా చివరి ఓవర్లో లంక బ్యాట్స్‌మన్ హరసంగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడం విశేషం. హరసంగా మెరుపులు మెరిపించడంతో లంక స్కోరు 142 పరుగులకు చేరింది. ఒక దశలో 180 పరుగులు సాధించడం ఖాయమని కనిపించిన లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్ల సఫలమయ్యారు. ఇక, అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నవ్‌దీప్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

India win in 2nd T20
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News