Saturday, April 27, 2024

చివరి పంచ్ మనదే

- Advertisement -
- Advertisement -

నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ (87 పరుగులు)తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించడంతో 287 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి మరో 15 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా అధిగమించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2 1 తేడాతో దక్కించుకుంది. గతేడాది సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ గాయపడ్డం భారత అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేసినా రోహిత్ శర్మ, కోహ్లీని ఆ లోటు కనిపించకుండా చేశారు. శిఖర్ ధావన్ బ్యాటింగ్‌కు రాకపోయినప్పటికీ టీమిండియా సునాయాస విజయం సాధించడం విశేషం. గాయం కారణంగా బ్యాటింగ్‌కు దూరమైన ధావన్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం 19 పరుగులు చేసిన రాహుల్ అగర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ జంటగా రోహిత్ చెలరేగి పోయాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికే 200 పరుగులు దాటిపోయింది. ఇదే క్రమంలో రోహిత్ శర్మ వన్డేలలో మరో సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్‌ల తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 9 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈక్రమంలో గంగూలి, సచిన్ తెండూల్కర్‌లను సైతం వెనక్కి నెట్టేశాడు. ఇన్నింగ్స్ ఆద్యంతం దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ కేవలం 128 బంతుల్లో 6 సిక్స్‌లు, 8 ఫోర్లతో 119 పరుగులు చేసిన అనంతరం ఔటయ్యాడు. రోహిత్ శతకానికి తోడు కోహ్లీ కూడా మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా విజయం సునాయాసం అయింది. రోహిత్ ఔటయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాట్ ఝళిపించాడు. 89 పరుగులు చేశాక కోహ్లీ చివర్లో ఔటయినా తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయ తీరాలకు చేరింది. కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. కాగా శ్రేయాస్ అయ్యర్ కేవలం 35 బంతుల్లోనే 6 బౌండరీలు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేయగా, కేవలం4 బంతులు ఆడిన మనీష్ పాండే 8 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో అగర్. జంపా, హాజిల్‌వుడ్‌లు తలా ఒక వికెట్ పడ గొట్టాడు. సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాగా విరాత్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
ఆరంభంలోనే ఎదురుదెబ్బ
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. డేవిడ్ వార్నర్‌ను షమీ 3 పరుగులకే సట్ చేయగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (19) సిత్ తప్పిదం కారణంగా రనౌట్ అయ్యాడు. దీంతో 46 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్‌తో కలిసి స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు యత్నించాడు.ఆరంభంలో వీరిద్దరూ ఆచితూచి ఆడినప్పటికీ ఆ తర్వాత ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది.ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు.అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని రవీంద్ర జడేజా విడగొట్టాడు. అర్ధ సెంచరీ తర్వాత జడేజా బౌలింగ్‌లో కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో లబుషేన్ పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.లబుషేన్ ఔటయిన తర్వాత అనూహ్యంగా బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ స్టార్క్ జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు వెనుదిరిగాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో స్మిత్ దూకుడు పెంచారు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా క్రీజ్‌లోకి వచ్చినప్పటినుంచీ బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు.దీంతో ఓ దశలో ఆసీస్ 300 పరుగులను దాటుతుందని అందరూ భావించారు. అయితే చివర్లో భారత బౌలర్లు చక్కగా రాణించారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి ఆసీస్ దూకుడుకు కళ్లెం వేశాడు. మొదట క్యారీ(35) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
స్మిత్ సెంచరీ
ఓ వైపు వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం పరుగుల వేట కొనసాగించాడు. ఇదే క్రమంలో వన్డేలలో తన తొమ్మిదో సెంచరీని పూర్తి చేశాడు. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేశారు. షమీ వేసిన 48వ ఓవర్ తొలిబంతికి భారీ షాట్ ఆడబోయి శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.132 బంతుల్లో 131 పరుగులు చేసిన స్మిత్ స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆసీస్ బ్యాట్‌సమెన్ పెద్దగా రాణించలేక పోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లుముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా జడేజా రెండు వికెట్లు తీశాడు. నవ్‌దీప్ సౌని, కుల్దీప్ యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది.

ధావన్‌కు గాయం
కాగా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేసే సమయంలో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. బుమ్రా బౌలింగ్‌లో ఫించ్ ఆడిన బంతిని అడ్డుకునే యత్నంలో ధావన్ ఎడమ భుజానికి గాయమైంది. దీంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. డైవ్ చేసి బంతిని ఆపిన తర్వాత అతను తన భుజాన్ని కదపడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.ఈ కారణంగానే అతను భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా బ్యాటింగ్‌కు రాలేదు. అతని స్థానంలో కెఎల్ రాహుల్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

India win ODI Series against Australia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News