Tuesday, April 23, 2024

ఆసుపత్రులపై అదుపు

- Advertisement -
- Advertisement -

Private Hospitals

 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం?

హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లినికల్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత పదునుపెడుతోంది. ఇందుకు సంబంధించిన చట్టం ముసాయిదా కూడా ఇప్పటికే పూర్తి అయింది. దీనికి సిఎం కెసిఆర్ సైతం దాదాపుగా ఆమోద ముద్రవేసినట్లుగా తెలిసింది. ఈ చట్టాన్ని రానున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టానికి ఆమోదం తెలుపనున్నారని సమాచారం. ఈ కొత్త చట్టంతో రాష్ట్రంలోని చిన్నచిన్న క్లినికల్ మొదలుకుని బడా కార్పొరేట్ ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు నాలుగువేలకుపైగా ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే 80 శాతం వరకు కార్పొరేట్ అక్రమాలు నియంత్రణలోకి రానున్నాయి.

కొత్త చట్టంతో ఇకపై ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న రోగ నిర్ధారణ పరీక్షలకు ఫీజులపై కూడా నియంత్రణలోకి రానున్నాయి. ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి అడ్డగోలుగా దోపిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం అమలులో ఉన్నా ఆ చట్టంలో కఠినంగా చర్యలు తీసుకొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ఆసుపత్రులు, నిర్ధారణ పరీక్షల కేంద్రాలపై నిఘాను కఠినతరం చేయాలన్న లక్షంతో ఈ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తుది మెరుగులు అద్దింది.

ఈ చట్టానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు సర్కారు కొద్ది రోజుల క్రితం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్త చట్టంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, నిర్ధారణ కేంద్రాలను నేరుగా తనిఖీ చేయడానికి మార్గం సులభతరం కానుంది. ప్రస్తుతం గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడానికి వెసులుబాటు మాత్రమే ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం అన్ని ఆసుపత్రులూ, నిర్ధారణ కేంద్రాలపై తనిఖీ చేసే అధికారం లభించనుంది.

శస్త్ర చికిత్సల ధరలతో పాటు రోగులకు అందించే సౌకర్యాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండనుంది. ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలతోపాటు కాస్మోటాలజీని కూడా చట్ట పరిధిలోకి తీసుకొస్తోంది. నిజానికి, గుండె శస్త్ర చికిత్సకు ఉపయోగించే స్టెంట్లు, మోకీలు శస్త్ర చికిత్సల ధరలను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. కానీ, కార్పొరేట్ ఆస్పత్రులు ఆ ప్రయోజనాలను రోగులకు బదిలీ చేయడం లేదు. ఇతర చార్జీల పేరిట రోగులను బాదేస్తున్నాయి. ఇటువంటి అక్రమాలకు ఇప్పుడు చెక్ పడుతుందని భావిస్తున్నారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ఇకపై కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి మొదలుకుని గల్లీలో ఉండే నర్సింహ్ హోమ్‌ల వరకు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్ని ఆసుపత్రులు కూడా వారి అందించే సేవలు…వాటి వాటికయ్యే చార్జీల వివరాల పట్టికను కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఏ ఆపరేషన్‌కు ఎంత వసూలు చేస్తారో కూడా స్పష్టంగా పట్టికలో తెలపాల్సి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పత్రులన్నింటిలోనూ కచ్చితంగా వెంటిలేటర్లతో పాటు శస్త్ర చికిత్స అందించే పరికరాలన్నీ ఉండాలి. మొత్తం మీద కొత్త చట్టం అమలులోకి వస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడికి చెక్‌పెట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కూడా లభించనున్నాయి.

Regulation on Private Hospitals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News