Wednesday, April 24, 2024

ఇక చాలు

- Advertisement -
- Advertisement -

Municipal Election

 

నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం

ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898 మంది, అత్యధికంగా టిఆర్‌ఎస్ నుంచి

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా కూడా ప్రచారం చేయకూడదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని ఎస్‌ఇసి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎన్నికల అధికారులు దీనిపై నిఘా ఉంచాలని పేర్కొంది. మొత్తంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎటువంటి యాక్టివిటి ఉండరాదని ఎన్నికల అధికారులకు సర్కులర్ ద్వారా తెలిపింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది.

దాదాపు 55 వేల మంది సిబ్బంది మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పటికే ఎస్‌ఇసి పూర్తి చేసింది. సగటున 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 8111 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఓటర్లకు తగు సదుపాయాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డులు, తొమ్మిది కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గాను 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2972 వార్డులకు ఎన్నికలు జరగునున్నాయి. మొత్తం 12,898 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థుల్లో పార్టీల వారీగా చూస్తే అధికార టిఆర్‌ఎస్ నుంచి ఎక్కువగా 2972 మంది, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి 2616 మంది, బిజెపి నుంచి 2313 మంది బరిలో నిలిచారు. వామపక్ష పార్టీలు సిపిఐ(ఎం) 166 మందిని పోటీలో నిలపగా, సిపిఐ అభ్యర్థులు 177 స్థానాల్లో ఉన్నారు.

టిడిపి నుంచి 347 మంది, ఎంఐఎంకు చెందిన 276 మంది, ఇతర రాష్ట్రాల్లో రాష్ర్ట స్థాయి గుర్తింపు ఉన్న పార్టీల నుంచి 281 మంది, ఇండిపెండెండ్లు 3750 పోటీపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 వార్డులకు గాను అత్యధికంగా 415 మంది అభ్యర్థులుండగా అతి తక్కువగా వడ్డెపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులకు కేవలం 29 మంది బరిలో నిలిచారు. డిసెంబర్ 23న ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఇచ్చిన గుడువు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించేందుకు సరిపోదనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయితే ఎస్‌ఇసి మాత్రం అనుకున్నట్టుగానే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అయిపోయినట్టుగా ప్రకటించింది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, ఉపసంహరణ, ఏకగ్రీవాల ప్రకటన అంతా చకచకా జరిగిపోయింది.

ఓటర్ల జాబితాపై ఇప్పటికీ ఆందోళనే
ఒక వైపు ఓటర్ల జాబితాలో తప్పులపై ఇప్పటికీ ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. కొంత మంది ఓటర్లు పేర్లు జాబితాలో లేవని, బహుళ అంతస్థుల భవనాల్లో ఉన్న ఇండ్లన్నింటిని ఒకే వార్డులో కాకుండా వేరు వేరు వార్డుల్లో వేసినట్టు పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఒక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను తలా ఒక వార్డులో పడేసి చేతులు దులిపేసుకున్నారు. ఉదాహరణకు మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి అపార్ట్‌మెంట్ ను మూడు ముక్కలు చేశారు.

ఈ అపార్ట్ మెంట్ వాసులను 9, 19, 20 వార్డులకు పంపిణీ చేశారు. ఇదే అపార్ట్ మెంట్ లో నివసించే బి.చంద్రారెడ్డిని 19వ వార్డు ఓటరుగా నమోదు చేస్తే ఆయన భార్యను మాత్రం 9వ వార్డులో కలిపేశారు. మరికొంత మంది తమ పేర్లు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలోని మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు.

24న స్థానిక సెలవు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్‌ఎంసి పరిధిలోని డబీర్‌పురాలో ఈ నెల 24న పోలింగ్ జరగనున్నది. ఈ రెండు ప్రాంతాల్లో వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని రాష్ర్ట ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ర్ట ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో 20న సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తుందని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, డబీర్ పురా వార్డులో మాత్రం 22న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని మరో ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌ల పరిధిలో 48 గంటల పరిధిలో మద్యం విక్రయాలు జరపరాదని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Municipal Election Campaign will end on Monday
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News