Friday, April 19, 2024

ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ

- Advertisement -
- Advertisement -

Indian Electoral system

 

హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో శనివారం గత పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి తొలిసారిగా సేవ్ డెమోక్రసీ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాల కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటున్నదన్నారు. తాను గతంలో ఓటరుగా ఉన్న దక్షిణ చెన్నై నియోజకవర్గంలో విద్యావంతులు అధికంగా ఉంటారనీ, కాని ఓటింగ్ మాత్రం 49 శాతం మించలేదన్నారు.

మిగిలిన గ్రామీణ నియోజకవర్గాల్లో 80 నుంచి 90 శాతం ఓటింగ్ జరిగేదని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణ ఎంతో సంక్లిష్టమైన బాధ్యతతో కూడుకున్నదని, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి నిజమైన ఓటర్లు ఎక్కువగా వస్తుంటారని తెలిపారు. అనేక సమస్యల నడుమ సిబ్బంది సజావుగా ఎన్నికలను నిర్వహిస్తుంటారన్నారు. పోలీసులకు వరసగా రోజుల తరబడి నిద్రలేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుందన్నారు. ఇలాంటి వారిని గుర్తించి అవార్డులు ఇస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆమె అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ఓడినప్పుడు ఒకలా, గెలిచినప్పుడు మరోలా మాట్లాడుతుంటాయని అన్నారు. బయటికి ఏమన్నా సరే, వారి మనసులకు మాత్రం ఎన్నికల అధికారులు బాగా నిర్వహించారనే విషయం తెలిసే ఉంటుందని చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికార పార్టీకి సౌకర్యాలను ఇష్టానుసారంగా ఉపయోగించకుండా ఎన్నికల చట్టం, ప్రవర్తనా నియామావళిని అమలు చేయడం, ఎన్నికల వ్యయపరిమితిని పర్యవేక్షించడం, అర్హులందరికి టెండర్ ఓటింగ్ అవకాశం కల్పించడం లాంటివి క్లిష్టమైన విధులన్నారు. ఇబ్బందులెన్ని ఉన్నా అధికారులు, సిబ్బంది ఎన్నికలను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించారని ప్రశంసించారు. రాష్ట్రంలో పట్టణ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు 50, 50 నిష్పత్తికి చేరువగా వస్తున్నారని తెలిపారు.

ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాల కమిషనర్ల స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు అవార్డులను మొదట మహారాష్ట్ర ప్రదానం చేసిందని, తెలంగాణ రెండో రాష్ట్రం గా ఇస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల సంఘాల స్టాండింగ్ కౌన్సిల్ చైర్మెన్ ఎ.కె.చౌహాన్, కన్వీనర్ ఎస్.కె.శ్రీవాస్తవ, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నికల కమీషనర్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Indian Electoral system is best in World
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News