Thursday, March 28, 2024

పిసిసి పీఠముడి

- Advertisement -
- Advertisement -

Congress party

 

పురపోరు వదిలి పదవికోసం నేతల ఆరాటం

హైదరాబాద్ : పురపోరులో సత్తా చాటాల్సిన సమయంలో దానికంటే అధ్యక్ష స్థానమే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కొనసాగుతుండటం ఆ పార్టీ హైకమాండ్‌కు విస్మయాన్ని కలిగిస్తోంది. ఏపిలో పిసిసి సారథి నియామకం దరిమిలా తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవిపై కన్నేసిన ఆశావహులు అధ్యక్ష పీఠం తమకే దక్కాలంటూ ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం. సహజంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువేనని చెబుతుంటారు. నేడు అది తారాస్థాయికి చేరిందనే చెప్పవచ్చు. మాజీ పిసిసి అధ్యక్షులు వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలతో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మంథని, సంగారెడ్డి ఎమ్‌ఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీలు ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ హైకమాండ్‌ను వేడుకుంటున్నారు.

ఈ విషయంలో వీహెచ్ తాతయ్య ముందంజలో ఉన్నారు. హైదరాబాద్ ఫతేమైదాన్ క్లబ్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ పార్టీ రథ సారథి (పిసిసి అధ్యక్ష పదవి) రేసులో తాను ఉన్నానని ప్రకటన గుప్పించడం తెలిసిందే. టిపిసిసి సారథి ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ ఆలోచన ఏమిటనేది ఇంతవరకు అంతుబట్టకపోయినప్పటికీ ఎవరికి వారుగా రేసులో వున్న నేతలంతా తమ ప్రయత్నాలను చాప కింద నీరులా కొనసాగిస్తున్నారు. పురపోరులో ఆయా కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలలో పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలపలేకపోయింది.

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరవన్న వాదనకు బలం చేకూర్చినట్లైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బరిలో వున్న అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత ఉన్న ఆ నేతలు వారి వారి స్థాయిలో ప్రచారానికి పరిమితమవుతూ మిగిలిన సమయాన్నంతా పిసిసి పీఠాన్ని ఎలా దక్కించుకోవాలన్న వ్యూహరచనలోనే నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. తమకు అభ్యర్థుల కొరత లేదని.. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి తీరుతామన్న పైకి బీరాలు పలికినా చివరకు ‘చేతు’లెత్తేశారన్నది తేటతెల్లమైంది. ఆ విషయమై ఆనక ఆ పార్టీ నేతలు ‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలన్నట్లుగా తమదైన శైలిలో వివరణలిచ్చుకోవడం తెలిసిందే.

పుర పోరు తర్వాతే టిపిసిసి నూతన సారథి…
టీపీసీసీ అధ్యక్ష పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కొత్త టిపిసిసి సారధి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోందని ఉప్పందడంతో ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అయితే టిపిసిసి అధ్యక్ష రేసులో ఆశావహుల సంఖ్య చాంతాడంత ఉండటం హైకమాండ్‌కు అధ్యక్ష ఎంపిక తలకు మించిన భారంగా పరిణమించిందని చెబుతున్నారు.

కాగా, డిసెంబర్ 2018లో జరిగిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిపిసిసి అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి కట్టబెట్టాలని అధిష్టానం భావించింది. అయితే సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావులు వ్యతిరేకించడంతో రేవంత్‌కు ఆ పదవి దూరమైంది. ఇటీవలే మరికొద్ది మంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి.. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్లకే టిపిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని మెలిక పెట్టారు. దీంతో రేవంత్‌కు పిసిసి అధ్యక్ష పదవి ఇంకా అందని ద్రాక్ష పండుగానే మిగిలిందని అంటున్నారు.

ఎటూ తేల్చుకోలేకపోతున్న హైకమాండ్…
సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత పరిగణనలోనికి తీసుకోవాలా? జనాకర్షణ కలిగిన నేతను టిపిసిసి సారథిగా నియమించాలా? అన్నదానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇందుకు సంబంధించి పలువురు పేర్లతో కూడిన ఆశావహుల జాబితాను హైకమాండ్ పరిశీలన అయితే చేస్తోంది. ఎప్పటిలాగానే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లే జాబితాలో ముందు వరసలో ఉన్నాయని చెబుతున్నారు. మిగతా ఆశావహుల సంఖ్య తక్కువేమీ కాదు. దీంతో టిపిసిసి అధ్యక్ష పదవి ఎంపిక హైకమాండ్‌కు కత్తిమీద సాములాగా పరిణమించిందని చెప్పక తప్పదు. ఈ క్రమంలో స్ట్రయిట్‌గా టిపిసిసి సారథిని ఎంపిక చేసే సాహసం హైకమాండ్ చేయకపోవచ్చు. అంతర్గత ప్రజాస్వామ్యంతో పాటు తామనుకున్నది దక్కకపోతే అంతే స్థాయిలో అంసతృప్తి జ్వాలలు చెలరేగడమన్నది కాంగ్రెస్ పార్టీలో కొత్తేమీ కాదు. అది హైకమాండ్‌కు తెలియని విషయం కాదు.

ఎలా ముందుకు..?
ఏపిలో టిపిసిసి అధ్యక్ష పదవి కోసం గిడుగు రుద్రరాజు, పళ్లంరాజుతో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా శైలజానాథ్‌కి పదవిని కట్టబెట్టింది. అలా తెలంగాణ విషయంలోనూ అనూహ్య నిర్ణయాలేమైనా తీసుకుంటారా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ నెల 22న రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు కూడా టిపిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వాళ్లకు సవాళ్లుగా పరిణమించాయనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పుర ఎన్నికల తర్వాతే పిసిసి రధసారథి ఎవరనేది? తేలే అవకాశం ఉంది. కాగా, లోపాయికారిగా ఈ మారు టిపిసిసి అధ్యక్ష పదవి జనాకర్షణ కలిగిన నేతనే వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇంత మంది ఆశావహుల్లో ఆ ఒకే ఒక్కడు ఎవరనేది పుర ఎన్నికల తర్వాత కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకూ పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Internal Democracy in Telangana Congress party
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News