Wednesday, August 6, 2025

అణు నిరాయుధీకరణకు ఆటంకాలు

- Advertisement -
- Advertisement -

అమెరికా రష్యా దేశాల మధ్య అణునిరాయుధీకరణ కోసం దాదాపు నలభై ఏళ్ల క్రితం కుదిరిన చరిత్రాత్మక ఒప్పందమే ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ) ఒప్పందం. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ఇక పాటించేది లేదని రష్యా ప్రకటించడం తీవ్ర ప్రకంపనలకు దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా రష్యా మధ్య అణ్వాయుధాల పోటీ పెరిగే అవకాశం ఉండడమే కాక, పశ్చిమదేశాల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉంటుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యాను బెదిరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొందరపాటు చర్యలే ఈ పరిస్థితికి దారి తీసిందని చెబుతున్నారు. ఇది ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగా మారనుంది.

అమెరికా దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూర్ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం తదితర కారణాల వల్లనే ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి తాము వైదొలగడానికి దారి తీసిందని రష్యా ప్రకటించింది. 1987లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియట్ యూనియన్ అధినేత మిఖాయిల్ గోర్బచెవ్ ఈ ఐఎన్‌ఎఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా, సోవియెట్ యూనియన్ రెండూ మధ్యంతర శ్రేణి క్షిపణులను (భూమి నుంచి ప్రయోగించేవి) తయారు చేయడం, పరీక్షించడం, నిల్వచేయడం నిషేధించబడింది. 500 కిలోమీటర్ల నుంచి 5500 కిలోమీటర్ల మధ్యలోనివి ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. ఈ ఒప్పందం కారణంగానే సోవియట్, అమెరికా దేశాలకు చెందిన దాదాపు 2692 క్షిపణులను ధ్వంసం చేయబడ్డాయి.

ఈ ఒప్పందంవల్ల అగ్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడమే కాక, నాటో కూటమి దేశాలకు కూడా భద్రత కలిగింది. 1991 చివరలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ఉక్రెయిన్, బెలారస్, కజకిస్థాన్ గణతంత్ర రాజ్యాలుగా వెలిశాయి. కొత్తగా అణ్వాయుధాలను వారసత్వంగా పొందినా అణ్వాయుధ నిరాయుధీకరణను అనుసరించాయి. అయితే రానురాను అమెరికా, రష్యా దేశాల మధ్య అపోహలు పెరిగాయి. రష్యా ఇంకా అణ్వాయుధాలను తయారు చేస్తోందని అమెరికా ఆరోపించడం ప్రారంభించింది. 9 ఎం 729 లేదా ఎస్‌ఎస్‌సీ 8 క్షిపణులను మోహరించిందని ఆరోపించింది. క్షిపణులను నాశనం చేయకపోతే ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి ఆరు నెలల్లో తాము తప్పుకుంటామని 2019 ఫిబ్రవరిలో అమెరికా హెచ్చరించింది. చివరకు రష్యాతో కుదిరిన ఐఎన్‌ఎఫ్ చారిత్రక ఒప్పందం తమ జాతీయ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ అమెరికా 2019 లో ఒప్పందంనుంచి వైదొలగింది.

2004 2005 మధ్య చైనా, ఉత్తర కొరియా, భారత్, పాకిస్థాన్, ఇరాన్ దేశాలు మధ్యస్థ శ్రేణి క్షిపణులను కలిగి ఉన్నందున ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి అమెరికా తొలగిపోయి ఉండవచ్చని రష్యా ఆనాడు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ట్రంప్ రష్యాకు హెచ్చరికగా అణుజలాంతర్గాములను మోహరింప చేయడానికి ఆదేశాలివ్వడం రష్యా తీవ్రంగా స్పందించి ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలగుతున్నామని ప్రకటించింది. గతంలో కూడా రష్యా, అమెరికా నేతృత్వంలో కొన్ని ఆయుధ నియంత్రణ ఒప్పందాలు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 50 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ చరిత్రలో అత్యంత రక్తపాత ఘట్టం. 1945 లో అమెరికా అణుబాంబు ప్రయోగంతో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలు బుగ్గిపాలయ్యాయి. అణ్వాయుధాలతో విధ్వంసమే తప్ప ఏ దేశానికీ ఎలాంటి ప్రయోజనం ఉండబోదని అణ్వాయుధాల నిరాయుధీకరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

1960 నుండి అమెరికా, సోవియట్ దేశాలు అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ ఒప్పందాలకు మద్దతు పలికాయి. వీటిలో మొదటిది 1963 లో కుదిరిన పాక్షిక అణుపరీక్ష నిషేధ ఒప్పందం. 1967లో ఔటర్ స్పేస్ ట్రీటీ ద్వారా అణ్వాయుధాలు, ఇతర ఆయుధాల మోహరింపును పరిమితం చేశారు. 1968 లో అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ) కుదిరింది. దీని ద్వారా అణ్వాయుధాల విస్తరణలో ఏ దేశాన్నీ ప్రోత్సహించకూడదని అంగీకరించారు. ఈ ఒప్పందంలో అణ్వాయుధాలను కలిగి ఉన్న చైనా, ఫ్రాన్, రష్యా, బ్రిటన్, అమెరికా వంటి దేశాలే కాకుండా అణ్వాయుధేతర దేశాలు కూడా పాలుపంచుకున్నాయి. మొదట 62 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయగా, రానురాను 185 దేశాల వరకు పెరిగింది. ఈ ఒప్పందం 1970లో 25 సంవత్సరాల కాలానికి అమలు లోకి వచ్చింది.

దీనిని 1995లో నిరవధికంగా పొడిగించారు. 1970లో అగ్రరాజ్యాలు సోవియట్ యూనియన్, అమెరికా అణ్వాయుధ ఖండాంతర (దీర్ఘశ్రేణి లేదా వ్యూహాత్మక)బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణాన్ని నిరోధించడంలోనూ, వ్యూహాత్మక ఆయుధ పరిమితిలోనూ కీలకపాత్ర వహించాయి. ఇది 1972 నాటికి సత్ఫలితాలను అందించింది. యాంటీ బాలిస్టిక్ క్షిపణుల మోహరింపును బాగా పరిమితం చేయగలిగాయి. అణ్వాయుధాలను పరిమితం చేయడం కంటే తగ్గించడమే మంచిదన్న లక్షంతో 1991లో స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ టాక్స్(స్టార్ట్) ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం తమ అణ్వాయుధాలను కొన్నేళ్లలో 25 నుంచి 30 శాతం వరకు తగ్గించుకోడానికి నిర్ణయించుకున్నా ఆచరణలో సాధ్యం కాలేదు. ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని 2000లో రష్యా ప్రకటించడం గమనార్హం. ఐఎన్‌ఎఫ్ నుండి రష్యా, అమెరికా దేశాలు వైదొలగడం వల్ల అణ్వాయుధాల నియంత్రణ, నిరాయుధీకరణపై అంతర్జాతీయ సమాజంలో నమ్మకం తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News