Saturday, June 3, 2023

సత్యాహింసల మార్గదర్శి

- Advertisement -
- Advertisement -

వేద యుగంలో పెరిగిన జీవహింస, ఖర్చుతో కూడిన యజ్ఞ యాగాలు, క్రతువులు, సమాజంలో పేరుకు పోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు ఆలోచనా పరులైన కొద్ది మందిలో జిజ్ఞాసను రేకెత్తించాయి. వీటిని అధిగమించడానికి అజీవకులు, చార్వాకులు, జైన, బౌద్ధ మత కర్తలైన.. మహావీరుడు, బుద్ధుడు వంటివారు క్రీ.పూ 6వ శతాబ్దంలో భావ వికాసానికి నాంది పలికారు. జైన మతాన్ని అనుసరించేవారు జైనులు. జినులు అంటే కోరికలను జయించి వారు అని అర్థం. జైన మతాన్ని వృషభ నాథుడు స్థాపించగా, ఇది ‘జిన’ (విజేత) అనే పదం నుంచి వచ్చింది. జైన మత గురువులను తీర్థంకరులని పిలుస్తారు. తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు. జైన మతంలో తొలి తీర్థంకరుడు వృషభ నాథుడు కాగా, ఆయన గురించి రుగ్వేదంలో పేర్కొన బడింది. అంతే కాదు విష్ణు పురాణం, భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి జైన మతం రుగ్వేద మతం అంతటి ప్రాచీనమైంది. ఇక, చిట్టచివరి ఇరవై నాలుగో తీర్థంకరుడు వర్థమాన మహావీరుడని జైనుల విశ్వాసం.

బీహార్‌లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీ.పూ. 599 లో (అధిక సంఖ్యాకుల విశ్వాసం) క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. కొందరు జైనులు మాత్రం మహవీరుడు క్రీస్తు పూర్వం 599 లో జన్మించాడని నమ్ముతుండగా, మరి కొందరు క్రీస్తు పూర్వం 615లో జన్మించాడని భావిస్తున్నారు. అయితే ఇందులో దేనికీ స్పష్టమైన ఆధారాలు లేవు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం 13వ రోజున అంటే చైత్ర శుక్ల త్రయోదశి రోజున మహావీరుడు జన్మించారు. అల్లారు ముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులు 28వ ఏట మరణించారు. యశోధరను వివాహమాడి, ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత మహవీరుడు అకస్మాత్తుగా తన సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి సత్యాన్వేషణ కోసం స్వయంగా బయలుదేరాడు.

తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుని శిష్యునిగా ఉన్నాడు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించి, వర్ధమానుడు ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద వైశాఖ మాసం పదమూడో రోజున జృంభిక గ్రామంలో జ్ఞానోదయం కలిగింది. తద్వారా తపోసిద్ధిని పొందాడు. తదనంతరం… వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహా వీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. 32 ఏళ్ళ పాటు అహింసా ధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు తన 72వ ఏట క్రీ.పూ. 527లో పావాపురిలో దేహాన్ని త్వజించాడు.

మహావీరుని బోధనలు: 1. వైదిక కర్మలు చేయడం, దేవుణ్ని వేడుకోవడం వల్ల మనిషికి ఉపయోగం లేదు. 2. చెడు చేయకుండా మంచి జీవితాన్ని గడపడమే మోక్ష మార్గం. 3. జైనమత ప్రకారం ‘ఆత్మ’ ప్రాణులకే కాదు, ప్రతి వస్తువులోను ఉంటుంది. దేవుడితో నిమిత్తం లేదు. 4. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర- మోక్ష మార్గాలు. వీటిని ‘త్రి రత్నాలు’ అంటారు. (సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడి) 5. పార్శ్వ నాధుడు ప్రతిపాదించిన సత్య, అహింస, అపరిగ్రహ, అనస్తేయ అనే నాలుగు మూల సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్య సూత్రాన్ని అదనంగా జోడించాడు. వీటిని ‘పంచానువ్రత’ అని పిలుస్తారు.

పార్శ్వనాధుడు శ్వేతాంబర వాదాన్ని, మహావీరుడు దిగంబర వాదాన్ని సమర్థించారు. మహావీరుని అనుచరులను నిగ్రంధులు అంటారు (బంధాల నుంచి విముక్తి పొందిన వారు). జైనులు పూజించే స్త్రీ దేవతను ‘విద్యాదేవి’ అని పిలుస్తారు. జైన మతంలో సల్లేఖనం (శరీరాన్ని క్షీణించుకొని మరణించడం) ద్వారా పరమపదం చేరుకోవడం ఆచారం. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం ద్వారా పరమపదించాడు. భారతీయ వాస్తు -శిల్ప కళాభివృద్ధికి జైనమతం గొప్ప సేవ చేసింది. మహావీరుడు సాధారణంగా కూర్చొని లేదా నిలబడి ధ్యాన భంగిమలో, అతని క్రింద ఉన్న సింహం చిహ్నంగా చిత్రీకరించబడింది.

ఉత్తర భారత దేశంలోని మధురలోని పురావస్తు ప్రాంతాల నుండి అతని మొట్టమొదటి విగ్రహం క్రీ.పూ 1వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందినది. అయన పుట్టిన రోజును మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఆయన మోక్షంను జైనులు దీపావళిగా గుర్తించారు. చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సత్యం, అహింస, ప్రేమ మార్గాన్ని చూపించిన మహావీరుని జయంతి సందర్భంగా జైన మతానికి చెందిన వారు వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మహావీరుని ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. దీని ద్వారా మహవీరుని సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తారు.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News