Saturday, April 27, 2024

భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు

- Advertisement -
- Advertisement -

కాన్హాశాంతి వనం ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్‌’లో జి. కిషన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు అని, హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఈ మతాలన్నీ శాంతి, సామరస్యం, పరోపకారాన్ని ప్రపంచానికి బోధించాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. కాన్హాశాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానం అని పేర్కొన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్‌లో ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతం తెలియజేస్తున్నామన్నారు.

‘ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్’… మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా మనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. భారతదేశం ప్రపంచంలోని దేశాలన్నింటికీ మిత్రదేశం అని, ప్రపంచంలో ఎక్కడ ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నా.. భారతదేశం శాంతిమంత్రాన్నే బోధించిందన్నారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో స్వామి వివేకానందుడు అందించిన సందేశం యావత్ ప్రపంచానికి భారతదేశ తత్వాన్ని మరోసారి గుర్తుచేసిందన్నారు. ప్రాచీనకాలం నుంచి భారతదేశం ఆత్మశోధనకు కేంద్రంగా ఉందని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తత్వవేత్తలు, మేధావులు స్వయం శోధనకు భారతదేశం వచ్చేవారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో భారతదేశంలో తత్వవేత్తలు సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు కృషిచేశారన్నారు. ఇందులో ఆదిశంకారాచార్య, రామానుజాచార్య, బసవణ్ణ.. తర్వాత.. శ్రీ అరబిందో, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఇందుకు కృషిచేశారన్నారు.

ప్రపంచమంతా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు భారత్ మొదటి నుంచి కృషిచేస్తోందని, ఇకపైనా ఈ ప్రయత్నం కొనసాగనుందన్నారు. ప్రపంచశాంతి లక్ష్యంగా ఉద్దేశించిన ఈ కార్యక్రమం సంకల్పిత లక్ష్యాలను చేరుకోగలదనే విశ్వాసం నాకుందన్నారు. ఈ దిశగా మీ అందరి సహకారం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, సుదేశ్ జగదీప్ ధన్ఖర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు, గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్ నెస్ కమలేశ్ డి పటేల్ (దాజీ) తోపాటుగా.. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక విధానాలను అనుసరించే స్పిరిచువల్ గురువులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News