Sunday, October 6, 2024

జన్నిక్‌కు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్

- Advertisement -
- Advertisement -

ఇటలీ యువ సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు జన్నిక్ సిన్నర్ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. ఇంతకుముందు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఛాంపియన్‌గా సిన్నర్ నిలిచాడు. 23 ఏళ్ల సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యా స్టార్ డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఐదు సెట్ల సమరంలో సిన్నర్ జయకేతనం ఎగుర వేశాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో కూడా టైటిల్ సాధించి సత్తా చాటాడు. ఒకే సీజన్‌లో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి సిన్నర్ పెను ప్రకంపనలు సృష్టించాడు. కాగా ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో రెండు టైటిల్స్‌ను జన్నిక్ సిన్నర్ సాధించగా, మిగిలిన రెండు ట్రోఫీలను స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. అల్కరాజ్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు. ఇక సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కూడా గెలువలేక పోయాడు. కాగా, మహిళల విభాగంలో బెలారస్‌కు చెందిన రెండో సీడ్ అరినా సబలెంక ఛాంపియన్‌గా నిలిచింది.

యూఎస్ ఓపెన్ ఛాంపియన్ స్పిన్నర్

ఫైనల్లో ఫ్రిట్జ్ ఓటమి
న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సిన్నర్ అమెరికాకు చెందిన 12వ సీడ్ టెలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. జన్నిక్ సిన్నర్‌కు ఈ ఏడాది ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇంతకుముందు ఇదే ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా సిన్నర్ ట్రోఫీని గెలుచుకున్నాడు. తాజాగా తన ఖాతాలో యూఎస్ ఓపెన్‌ను కూడా జత చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సిన్నర్ 63, 64, 75 తేడాతో ఫ్రిట్జ్‌పై విజయం సాధించాడు. ఆరంభం నుంచే సిన్నర్ దూకుడుగా ఆడాడు. అద్భుత ఆటతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. సిన్నర్ ధాటికి ఫ్రిట్జ్ ఎదురు నిలువలేక పోయాడు. తొలి సెట్‌లో సిన్నర్ చెలరేగి ఆడాడు. తన మార్క్ షాట్లతో ఫ్రిట్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.

ధాటిగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో ఫ్రిట్జ్ కాస్త మెరుగైన ఆటను కనబరిచాడు. సమన్వయంతో ఆడుతూ సిన్నర్ ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఫ్రిట్జ్ ప్రయత్నాలు ఈసారి కూడా ఫలించలేదు. కీలక సమయంలో సిన్నర్ పుంజుకున్నాడు. అద్భుత షాట్లతో ఫ్రిట్జ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో ఫ్రిట్జ్ మరింత మెరుగ్గా ఆడాడు.

సిన్నర్‌ను కట్టడి చేసేందుకు సర్వం ఒడ్డాడు. అద్భుత షాట్లతో సిన్నర్‌ను హడలెత్తించాడు. ఫ్రిట్జ్ దూకుడుగా ఆడడంతో సిన్నర్ కాస్త ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. కానీ, కీలక సమయంలో సిన్నర్ తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. ఫ్రిట్జ్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ మళ్లీ ఆటపై పట్టు సాధించాడు. ప్రత్యర్థిని పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టివేస్తూ లక్షం దిశగా సాగిపోయాడు. చివరి వరకు నిలకడైన ఆటను కనబరుస్తూ టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకుని యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు ఫ్రిట్జ్ అద్భుత పోరాట పటిమను కనబరిచినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News