Thursday, May 2, 2024

వింబుల్డన్ క్వీన్ వొండ్రుసోవా

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి మర్కెటా వొండ్రుసోవా టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 64, 64 తేడాతో ట్యూనీషియాకు చెందిన ఆరో సీడ్ ఓన్స్ జాబేర్‌ను ఓడించింది. మరోవైపు జాబేర్ వరుసగా రెండోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, వొండ్రుసోవా మాత్రం మూడో ప్రయత్నంలో గ్లాండ్‌స్లామ్ విజేతగా అవతరించింది. ఇందుకుముందు రెండు సార్లు ఆమె ఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక అన్ సీడెడ్‌గా బరిలోకి వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన 11వ క్రీడాకారిణిగా వొండ్రుసోవా రికార్డును నెలకొల్పింది. ఇక జాబేర్‌తో జరిగిన ఫైనల్లో ఆరంభంలో వొండ్రుసోవా వెనుకబడింది.

తొలి సెట్‌లో దూకుడుగా ఆడిన జాబేర్ తొలి రెండు గేమ్‌లను గెలుచుకుని పైచేయి కనబరిచింది. అయితే ఆ తర్వాత వొండ్రుసోవా అనూహ్యంగా పుంజుకుంది. తన మార్క షాట్లతో జాబేర్‌ను హడలెత్తించింది. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిన వొండ్రుసోవా సెట్‌లో పైచేయి సాధించింది. చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తీవ్ర ఒత్తిడికి గురైన జాబేర్ వరుస తప్పిదాలకు పాల్పడి చేజేతులా సెట్‌ను సమర్పించుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగానే సాగింది. కానీ కీలక సమయంలో జాబేర్ మళ్లీ ఒత్తిడిని ఎదుర్కొంది. దాని నుంచి బయట పడడంలో విఫలమైంది. మరోవైపు వొండ్రుసోవా మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా నిలకడైన ఆటను కనబరిచింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. జాబేర్ కాస్త గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

ఆఖరు వరకు ఆధిపత్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన వొండ్రుసోవా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుని వింబుల్డన్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోపీని ముద్దాడాలని భావించిన జాబేర్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ఇక ఈ టోర్నమెంట్‌లో ఏ మాత్రం అవకాశాలు లేకుండా బరిలోకి దిగిన వొండ్రుసోవా ఏకంగా టైటిల్‌ను సాధించి మహిళల టెన్నిస్‌లో సరికొత్త స్టార్‌గా అవతరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News