Thursday, February 29, 2024

జనం దేవుడు జాన్‌పహాడ్ సైదన్న

- Advertisement -
- Advertisement -

Janpahad Dargah

 

పాలకవీడు : నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ సూర్యపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రానికి 10కిమీ దూరాన ఉన్న జాన్‌పహాడ్ దర్గా ఉమ్మడి జిల్లాలోనే గాక, రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పేరున్న ధర్గాగా ప్రసిద్ది చెందింది. ఈనెల 23,24,25తేదీలలో ఉర్సు ఉత్సవాలు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆద్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. పక్క రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఉర్సు ఉత్సవాలకు తరలి వస్తుంటారు. ఈ దర్గా ముస్లింలకు పవిత్ర స్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. భక్తులు తమ కోర్కెలు తీరితే కందూరు పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కలిగితే సైదులు బాబా పేరును పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తుంటారు.

జాన్‌పహాడ్ దర్గా చరిత్ర… సుమారు 400ఏండ్ల పైబడి మద్రాసు రాష్ట్రంలోని నాగూర్ గ్రామంలో వెలిసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను తెలుగు రాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి జాన్‌పహాడ్ సైదా, బాజీసైదా, మొహినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలోఉంది. ఈముగ్గురు భక్తులు తెలుగు రాష్ట్రాలకు చేరి నాగూర్ షరీఫ్ గొప్పతనాన్ని చాటుతూ ఊరూరా తిరగసాగారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి వారు అమరులయ్యారు. వాడపల్లి వద్ద అమరుడైన జాన్‌పహాడ్‌సైదా జ్ఞాపకార్ధం వజీరాబాద్ రాజకుమారుడు జాన్‌పహాడ్ వద్ద పవిత్ర సమాదులు కట్టించారని చెప్పుకుంటారు.

ఆతర్వాత జాన్‌పహాడ్‌ను సైదా నిర్మించాడని దీని మూలంగానే జాన్‌పహాడ్ దర్గా పేరు వాడుకలోకి వచ్చింది. ఈప్రాంతమంతా నీటి వసతి లేదని తర్జన బర్జన పడుతున్న సమయంలో వేముల శేషారెడ్డి తండ్రి మట్టారెడ్డి కలలో జాన్‌పహాడ్ సైదా కనిపించి గుర్రం డెక్కలు ఉన్నచోట బావిని తవ్వించమని చెప్పాడట. దీంతో అక్కడ నీరు కనిపించిందని పెద్దలు చెబుతుంటారు. దర్గా ప్రాంతమంతా అడవీ ప్రాంతం కావడంతో తమ దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం ఒక నాగుపాము, పెద్దపులిని ఏర్పాటు చేశారని పూర్వీకులు చెప్పారని ఇక్కడివారు చెబుతుంటారు.

దీపం విశిష్టత… జాన్‌పహాడ్ సైదులు బాబా దర్గాలో పవిత్ర సమాదులు వెలిసిన నాటి నుండి ఈదీపం నిత్యం వెలుగుతూనే ఉంది. భక్తులు దీపారాధన నూనెను ఎంతో పవిత్రంగా భావించి నొప్పులు ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈదీపంలో ప్రతీ శుక్రవారం రోజు వచ్చే భక్తులు నెయ్యి నూనెను దీపంలో పోస్తుంటారు. ప్రతీ సంవత్సరం ఉర్సు అయిన మరుసటి రోజు శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం దీపాలు వెలిగిస్తారు.

పంచపహాడ్‌లు.… జాన్‌పహాడ్ కేంద్రంగా మరో నాలుగు పహాడ్‌లు ఉన్నాయి. ఇవి జాన్‌పహాడ్, గుండ్లపహాడ్, శూన్యపహాడ్, గణస్త్రష్‌పహాడ్, రావిపహాడ్‌లు . ఇవి పంచభూతాలకు సంకేతాలా…..లేక బారతీయ ధర్మంలోని పంచాయతన దేవారాధనకు సంకేతాలా అనే చర్చ కొనసాగుతుంది.

కందూరు… జాన్‌పహాడ్ దర్గా వద్దకు ప్రతీ శుక్రవారం దర్శనానికి వచ్చే వారు, ఉర్సుకు వచ్చే వారు అక్కడ తీర్చుకునే మొక్కులను కందూరు అంటారు. కందూరు మొక్కులో మేకపోతు, గొర్రె పొట్టేలును నివేదంగా ఇవ్వడం ఆచారంగా వస్తుంది. భక్తులు తమ మొక్కు ప్రకారం మేక, పొట్టేలును తీసుకొచ్చి వాటికి స్నానం చేయించిన అనంతరం అలాల్ చేయిస్తారు. సఫాయి బావి నీటితో వండి దర్గాలో నివేదన(ఫాయితాలు) ఇచ్చి దర్శనంతో పాటు మొక్కు చెల్లించుకుంటారు. ఆ తర్వాత బంధు మిత్రులకు భోజనాలు పెడతారు. ఇలా చేస్తే చాలా పవిత్రమైనదని, మహిమాన్వితమైనదని భక్తులు భావిస్తుంటారు.

Janpahad Dargah Ursu celebrations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News