Friday, April 19, 2024

తమిళనాడులో కార్చిచ్చులా వ్యాపించిన ముగ్గుల నిరసన

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ఇంటి ముందు ముగ్గులు వేయడం భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. అయితే ఇప్పుడది ఒక వినూత్న నిరసన రూపంలో కార్చిచ్చులా తమిళనాడు అంతటా వ్యాపించింది. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ), జాతీయ పౌరసత్వ పట్టిక(ఎన్‌ఆర్‌సి)కు వ్యతిరేకంగా తమిళనాట నిరసనలు వెలువడుతున్న తరుణంలో ముగ్గుల రూపంలో తమ నిరసనను తెలియచేసిన ఐదుగురు మహిళలను చెన్నై పోలీసులు ఆదివారం అరెస్టు చేయడంపై రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికింది. సిఎఎ, ఎన్‌ఆర్‌సిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష డిఎంకె తమిళనాడు వ్యాప్తంగా ముగ్గుల నిరసనకు పిలుపునివ్వడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ ఇళ్ల ముందు ముగ్గులతో నిరసనలు తెలిపారు. డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ నివసించే ఆల్వార్‌పేటలోని ఇంటి ముందు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తండ్రి ఎం కరుణానిధి నివసించిన గోపాలపురం ఇంటి ముందు, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఇంటి ముందు పాటు మారుమూల గ్రామాలలోని డిఎంకె కార్యకర్తలు, అభిమానులు సైతం ముగ్గులతో సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకతను చాటిచెప్పారు.

కనిమొళి ఇచ్చిన పిలుపును అందుకున్న డిఎంకె మహిళా విభాగం కార్యకర్తలు, నాయకులు చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం వీధులలోకి వచ్చి ఈ ముగ్గుల నిరసనలో పాల్గొన్నారు. ఒక సిటిజన్స్ అగెనెస్ట్ సిఎఎ పేరిట ఒక బృందంగా ఏర్పడిన కొందరు యువ మహిళలు ఈ చట్టం పట్ల తమ నిరసనను సూచనప్రాయంగా తెలియచేసేందుకు చెన్నైలోని బెసంట్ నగర్‌లో ఆదివారం ఉదయం సిఎఎ, ఎన్‌ఆర్‌సిని వ్యతిరేక వాక్యాలతో ముగ్గులు వేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని వ్యానులోకి బలవంతంగా నెట్టేయగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు మహిళా న్యాయవాదులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల చర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. డిఎంకె, కాంగ్రెస్, వామపక్షాలు, విసికె, ఎండిఎంకెతోసహా పలు హక్కుల సంఘాల నుంచి నిరసనలు ఎదురవ్వడంతో పోలీసులు వారిని మరుసటి రోజు విడుదల చేశారు. అయితే వారు రాజేసిన చిన్న నిప్పురవ్వ దావనంలా రాష్ట్రమంతటా వ్యాపించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న డిఎంకె కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని అన్నా డిఎంకె నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ముగ్గుల నిరసనకు పిలుపునిచ్చింది. ఒక చిన్న ముగ్గును నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కాని ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ముగ్గులతో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు.

 

Kolam protests in TN, DMK calls for Kolam protests against to CAA and NRC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News