Wednesday, March 22, 2023

పాటతల్లికి జన్మ అరణమిచ్చిన కవి

- Advertisement -

Creative thinkers and makers provide their communities with joy, interaction, and inspiration, but they also give thoughtful critique to our political, economic, and social systems- pushing communities to engage thoughtfully and make steps toward social progress. ‘Lesley Birch, Scottish Artist

RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు రాజమౌళి, టాప్ యువ హీరోలు జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ నటనా వైదుష్యం ఆదివాసీ అమరుడు కొమురం భీం జీవితేతివృత్తం తాలూకు కాల్పనికత ఈ మూడూ ట్రిపుల్ ఆర్ చిత్ర భారీవిజయానికి కారణం. అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. అదే ఈ సినిమాలోని పాటలు. ప్రధానంగా ’ కొమురం భీముడో ’ ’కొమ్మా ఉయ్యాలా కోనా జంపాల’ పాటలు. కొమ్మా ఉయ్యాల పాట శాంత రస ప్రధానమైంది. కరుణం వీరం అద్భుతం మూడు రసాలు సమ్మిశ్రితమైన పాట కొమురం భీముడో. ఈ పాట ధాటికి థియేటర్లలోనే కాదు,విడిగా బయట వినే ఏ శ్రోతా ప్రేక్షకుడూ రసవివశుడు కాకుండా ఉండలేడు.

గాయకుడు కాలభైరవ పాడిన విధానం, పాటకు తీగలా దాపున్న ఇంపైన సంగీతం కొమురం భీముడో పాట శ్రోతలను చేరడంలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అద్భుతంగా గాయకుడు పాడేందుకు, అమోఘంగా సంగీతదర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వర కల్పన చేసేందుకు దోహద పడింది పాటలోని సాహిత్యమేనన్న విషయాన్ని అందరం అంగీకరించి తీరాలి.ఇవాళ రెండు రాష్ట్రాల్లో సగటు మనిషితోపాటు సాహిత్యవేత్తల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్లేజాబితాలో స్వీయజ్ఞాపకాలను కలబోసే పాటలతోపాటు ప్రాదేశిక స్ఫూర్తికి ఏకైక పాటగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నపాట కొమురం భీముడో.ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్ది పాటలు ’దేశభక్తి-ప్రాదేశిక స్ఫూర్తి’ కేటగిరీలో వివిధ జానర్‌లలో వచ్చివుండవచ్చు.కానీ,వీటన్నింటిలో కొమురం భీముడో పాట అరుదైనది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భాన యావద్దేశానికీ అవసరమైంది.

కొమురం భీముడో పాట పాటగా,మంచి పాటగా, గొప్ప పాటగా శ్రోతల గుండెల్లో స్థిరపడటానికి పాటలో కనిపించే చారిత్రక సన్నివేశం, ధీరోదాత్తతకు పరాకాష్టగా నిలిచిన కథానాయకుడి అనిర్వచనీయ సందేశమే కారణం. యధారీతి సూటిగా చెప్పుకోవాల్సివస్తే చారిత్రక సన్నివేశాన్ని, అనుపమాన త్యాగనిరతిని శ్రవణ సమ్మోహనంగా పాదపాదాన రక్తికట్టించిన గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రచనా సామర్థ్యం. చిత్రదర్శకుడు దృశ్యం చెప్పినా, సంగీత దర్శకుడు స్వరాలు ఇచ్చినా సన్నివేశం కోసం పాట రాస్తున్నప్పుడు అటు దర్శకుడి భావుకతనూ ఇటు సంగీతదర్శకుడి స్వరాభినివేశాన్నీ గీత రచయిత అందిపుచ్చుకోవాలి. అంతేకాదు, పాటకు ఖరీదుకట్టే ప్రేక్షకుడి అనుభూతి స్థాయిని విజువలైజ్ చేసుకోవాలి.

ఇందుకు సినీగేయ రచయితలకు ఉండాల్సిన ప్రథమ గుణం convertibility. అయితే convertibility అంత సులభంగా అలవడదు. మనోమండలాన అక్షాంశ రేఖాంశాలుగా విప్పారివున్న స్పృహ చైతన్యా( Consciousness and Conscience )లను భద్రంగా వాడుకునే ఎరుకపరులకే convertibility సాధ్యం. కన్వర్టబిలిటీ పుష్కలంగా ఉన్న మనకాలపు గేయ రచయిత డా.సుద్దాల అశోక్ తేజ. కవులు రచయితలకు సృహ, చైతన్యం వీటిగుండా సిద్ధించే దార్శనికత ఎట్లా అబ్బుతాయనేది వాళ్ళ వాళ్ల సెన్సిబిలిటీ స్థాయినిబట్టి ఉంటుంది. ఇందుకు కవులు రచయితల జీవితాల్లోకి కూడా మనం వెళ్లాల్సుంటుంది. కవులు రచయితల జీవితాలను, సెన్సిబిలిటీని చర్చకు పెట్టే క్రమంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వాళ్ల స్థానికతను గురించి.

స్థానికత అంటే కవులు రచయితలు పుట్టిపెరిగిన భూమి, పరిసరాలు. సుప్రసిద్ధ జపనీ విద్యావేత్త Makiguchi TsunesaburM; తన ’ A Geography of Human Life ’ గ్రంథంలో ‘ అనాది నుండి జాగ్రఫిలో చరిత్రలో స్థానికతకు గల ప్రాశస్త్యం చిరస్థాయిని కలిగుందని, భౌగోళికత మానవ కార్యకలాపాలకు మధ్యగల సంబంధాలు అంతర్లీనంగా మనిషిని సృజనదిశగా జాగృతం చేస్తాయని‘ అంటారు. అంతేకాదు, మానవాళి జీవన పరిచర్యలకు ఆలవాలమైన భౌమ్యపరిసరాలు మనుషుల రక్తమాంసాలకు జవజీవాలను లోలోపలనుంచి జోడిస్తాయని, ప్రకృతి మాధ్యమంగా ప్రజలకు తనకు మధ్య జరిగే చర్య ప్రతిచర్యల్లో ఉద్దీపనకు దేదీప్యమానంగా భూమి తెరతీస్తుందని,తనే వేదికగా జీవన దృగ్విషయాలను మేళవించి ఎప్పటికప్పుడు ప్రేరణను ఉపదేశాన్ని జనసామాన్యానికి భూమి చేరవేస్తుందని చెపుతారు మకిగుచి. ఈ సమన్వయంలోంచే ’కొమురం భీముడో ’ పాట RRR సినిమాకు అందాలను అద్దింది.

ప్రేక్షకుల ఆనందావధులను ముద్దాడింది. విడిగా పాటగా పాడుకోగల సత్తాగల ప్రతిగొంతుకలో భూతాత్త్వికతను, రాజకీయాలను, సాంస్కృతికతను ప్రదీప్తం చేస్తుంది. దర్శకుడు రాజమౌళి,కథాకర్త విజయేంద్ర ప్రసాద్ ఇరువురూ కొమురం భీము స్థానికత నుంచి పాటను రాయించ దలచుకున్నారు. తండ్రి సుద్దాల హనుమంతు అందించిన పోరాట వారసత్వాన్ని, ప్రజాకళల వారసత్వాన్ని నూటికి నూరుపాళ్లు అందిపుచ్చుకున్న అశోక్ తేజను గీతరచనకు ఎంపికచేసుకున్నారు. గీత రచనలో విజయేంద్ర ప్రసాద్,రాజమౌళి తనను ఎంతగా నమ్మారో అంతే సమర్థవంతంగా సారవంతంగా పాటను అందించారు అశోక్ తేజ. పాటలు రాసే కవులను పాటకవులంటున్నం.

ఆశువు(spontaneous)గా పాటలు రాసే కవులు,ఏదైనా సందర్భానికి ఎవరైనా కోరితే, insist చేస్తే రాసే కవులు- ఇట్లా పాటకవులు రెండు తీర్లు. స్పాంటేనియస్ గా రాసే పాట సందర్భంలో స్వశక్తినుంచి, అనుకున్న ఇతివృత్తం నుంచి తనకు అందిన ఉన్మిఖీకరణ కవికి ఆధారమవుతాయి. ఇన్సిస్ట్ చేస్తే రాసే కవులకు రాయించుకునే వాళ్లు చెప్పే కథనం, రాసే సమయంలో తారసపడిన పాటకు సంబంధించిన భావన, వాక్పటిమ ప్రేరణ ఇస్తాయి. అయితే, ఇద్దరి పాటల్లోనూ వాళ్ల గానశాస్త్ర సామర్థ్యం, స్థానికతలే ఆకృతి ధరిస్తాయి. ప్రముఖ సంగీత అధ్యాపకులు విన్సెంట్ రైనా ఒక పాట గొప్ప పాటగా ఆవిర్భవించడానికి చెపుతున్న హేతువులు ఇవి: పాట శ్రుతి గమనం ( Chord progression), పాటలోని బలమైన సాహిత్యం ( Strong Lyrics),పాట నిర్మాణ దృఢత్వం(Solid structure), పాట ప్రతిబింబించే ప్రతిచర్య మరియు భావోద్వేగం (Reaction and Emotion), పాటలోని శక్తివంతమైన పునరుక్తి ( Special hook or riff) ఈ ఐదు ప్రత్యేకతలతో కొమురం భీముడో పాట తనకు తనే సాటి.

మొదటిదైన శ్రుతిగమనం ఒక్కటి స్వరకర్త ఎం.ఎం.కీరవాణి ఖాతాలోకి వెళ్తే మిగతా నాలుగు శ్రేష్ఠతలు పాటకు అశోక్ తేజ ప్రసాదించిన ప్రత్యేకతలు. నిజానికి శ్రుతిగమనపు గొప్పతనం కూడా అశోక్ తేజదే. ఎందుకంటే,గీత రచన జరిగాకే స్వరకల్పన జరిగింది.అశోక్ తేజ తాను అనుకున్న ట్యూన్ లో పాట రాసిచ్చాక దానికి కీరవాణి పరిపూర్ణ స్వరరూపం కల్పించారు.అందుకే కీరవాణి కూడా శ్రుతిగమన గౌరవాన్ని అశోక్ తేజకే చెల్లిస్తారు. యుగళ గీతాలు, సోలో సాంగ్స్ రాసే చేయితిరిగిన రచయితలకు సైతం విప్లవగీతాలు రాయడం రాదు. భౌతికంగా మానసికంగా విప్లవోన్ముఖమైన భౌగోళికమైన వారసత్వం నుండి ఆయా రచయితలు వలసీకరణలో యాంత్రికమై స్థానీయశోభకు ఎడం జరగడమే ఇందుకు కారణం. అశోక్ తేజ ఇందుకు పూర్తిగా భిన్నం.

ఈయన భౌతిక మానసిక పరిసరాలు రెండూ ఇప్పటికీ ఎప్పటికీ విప్లవోన్ముఖమే, సాయుధరైతాంగపు తెలంగాణా పోరుకెరటాలే అనడానికి ఇదివరకటి పాటలతోపాటు ఇప్పుడీ పాటా సాక్ష్యమే. భావగీతాలు రాసేప్పుడూ తెలంగాణ నుడికారానికే పట్టంకట్టే అశోక్ తేజ పాటలో ప్రగతిశీల దృక్పథానికి విప్లవ భావధారకు అవకాశం కనుక వస్తే అగ్నిని అక్షరాలతో అభిషేకించగలడు. అగ్నికి అక్షరాభిషేకమే కొమురం భీముడో పాట. Protective use of force అంటామే ఇది కేవలం వాక్ఝరిలోనేకాదు, కవి స్థానికత గుండా పాట నిలువెల్లా ప్రవహించిన తీరు ఇంతకు ముందు ఏ తెలుగు సినీగీతంలోనూ సంభవించలేదు.

సమాజంలో కళాకారుల పాత్రను ప్రస్తావిస్తూ ‘ I prefer to be a harbinger of good news and hope, in this increasingly broken world of ours and I find that images have immense power to restore collective emotional pain and lift the spirit.‘ అని అంటారు సుప్రసిద్ధ చిత్రకారిణి అలెటా మిఖాలిటోస్. ఈవిడే ’ కళాకారులు తమ సందేశాల ద్వారా ఆశను బతికించేందుకు నిరతం ప్రయత్నిస్తారు’ అని కూడా అంటుంది. ఇది అశోక్ తేజకు అక్షరాలా వర్తిస్తుంది. స్వాతంత్య్రానంతరం నాల్గోతరంగా ఇంచుకైనా దేశం గురించి పట్టని నేటి యువతలో దేశీయతనూ జాతీయతనూ జమిలిగా పాదుకొల్పుతూ భూమాత ఆశను బతికించే ప్రయత్నమే కొమురం భీముడో పాట చేసింది. అందుకే ఇది మహితాత్మక గీతం. తండ్రి హనుమంతులాగే ప్రజాకళలకు హారతిపట్టి పాటతల్లికి జన్మను అరణం ఇచ్చిన కవి సుద్దాల అశోక్ తేజ.

ప్రపంచంలో అత్యుత్తమ పాటల్లో మొదటిదిగా రికార్డుల్లోకి ఎక్కిన పాట ’ A Nation Once Again ’. రచయిత ఐర్లాండుకు చెందిన థామస్ ఓస్బోర్న్ డేవిస్. పద్దెనిమిదో శతాబ్దంలో బ్రిటీష్ ఏలుబడి నుండి స్వాతంత్య్రం పొందేందుకు తమ దేశప్రజల్లో పోరాట పటిమను రగిలించిన రాజకీయ కవి. ఈయన ఏమంటారంటే ’ సంగీతం మా మొదటి గురువు. మాతృభూమిని గురించిన భక్తిని మేం మనస్సులలో శాశ్వతంగా సజీవంగా నిక్షిప్తం చేసుకోవడానికి పాటలు కట్టమని సంగీతం మాకు అనేక ఫణితులను నేర్పిస్తుంది. వేయి ప్రసంగాల కంటే ఒక పాట అత్యంత శక్తివంతమైంది. తత్ శక్తిని జనబాహుళ్యానికిచ్చే ప్రయత్నంలో భాగమే నా పాట’ అని. పోలిక చెప్పవలసివస్తే కొమురం భీముడో పాటను ఐరిష్ విముక్త గీతం ’ ఏ నేషన్ వన్స్ ఎగైన్ ’ తో సమానమైందని చెప్పుకోవచ్చు.

ఇంకాస్త వెనక్కి వెళ్తే మన భక్త తుకారాం ’ పదం మాత్రమే ఏకైక ధనం.దాన్ని ప్రజలకు పంచుతున్నా’ అంటాడు.బహుశా అశోక్ తేజ విలక్షణమైన ’ అభంగ ’ గమకంలో ‘ కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగరగ సూరీడై రగలాలి కొడుకో ‘ అంటూ ఒక్కోమాటను మంత్రపూరితంగా మలచి తెలుగుభాషకు చేసిన ఉపకారమూ ఇదే. ప్రతి కళాకారుడు, కవి, రచయిత సమాజ శ్రేయోభివృద్ధికోసం కోసం విభిన్నమైన అవసరమైన పాత్రను పోషిస్తాడు. ఈ ప్రకార్యంలోనే అశోక్ తేజ తన పాటల అమ్ముల పొదిని సిద్ధపరచారు. దీంట్లో అత్యంత పదునైనది, పరుసవేది కొమురం భీముడో పాట. కళ ఎల్లప్పుడూ ప్రజల భావోద్వేగాలను పెనవేసుకొని ఉంటుంది. వ్యక్తిగతమైంది, అదే సమయంలో కళ సార్వత్రికమైంది కూడా.ఈ రెండు పార్శ్వాల్లో మరో వెయ్యేళ్లపాటు తెలుగు ప్రజలను అంటిపెట్టుకొని ఉండే చేవగల పాట కొమురం భీముడో. తెలంగాణా చరిత్రలో గోండు వీరుడు కొమురం భీం వీరోచిత గాథ ప్రాతఃస్మరణీయం ఎట్లాగో, పాటల ఇతిహాసంలో తెలుగునాట కొమురం భీముడో పాట కళాకాంతులూ అట్లాంటివే.

డా.బెల్లి యాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News