Sunday, September 21, 2025

రాష్ట్ర చరిత్రలో నిత్యజ్యోతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ చరిత్రలో నిత్యజ్యోతిలా వెలుగొందిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితం కేవలం రాజకీయ నాయకుడి ప్రస్థానం మాత్రమే కాదు. సామాజిక సేవ, ప్రజా హక్కుల కోసం సాగిన నిరంతర పోరాటయాత్ర. చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే నూలు మెలకువలు, నేసే శ్రమ, దానికి సంబంధించిన కష్టాలు దగ్గరగా చూశారు. ఆ అనుభవం ఆయన హృదయంలో అచంచలమైన ముద్రవేసింది. బాపూజీ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానంతర కాలంలో పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దగ్గరగా గమనించారు. ఆ తరువాత ప్రజాస్వామ్య విధానంలో సమానత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పలు దశల్లో తన దృఢమైన పోరాటాన్ని కొనసాగించారు. ఆయన పదవులు, అధికారం కోసం కృషి చేయలేదు. కేవలం ప్రజల హక్కులు, వారి గౌరవం కాపాడటమే ధ్యేయంగా భావించారు.

తెలంగాణ వేర్పాటు ఉద్యమంలోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆ సమయానికి తన వయసు డ్బ్బై దాటినా, బాపూజీ ఆత్మవిశ్వాసం, ప్రజానిబద్ధత మాత్రం తగ్గలేదు. ‘నేను బతికున్నంత వరకూ తెలంగాణ గళం వినిపించాలి’ అన్న ఆయన మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తాయి.రాజకీయ రంగంలో ఆయన ప్రస్థానం సత్యనిష్ఠతో నిండినది. పద్ధతిగా వాదించడం, తర్కంతో ఆమోదింపజేయడం ఆయన శైలి. అయితే బాపూజీని మరింత విశిష్టంగా నిలబెట్టిన రంగం చేనేత. సంప్రదాయ వృత్తులు క్షీణిస్తున్న కాలంలో, చేనేత కూలీల కష్టాలను ఆయన చాలా దగ్గరగా చూశారు. హస్తకళలతో అల్లిన చీరలు, నేసిన వస్త్రాలు కేవలం ఒక వస్తువు కాదని, అవి ఆ కుటుంబాల బతుకుదెరువు అని ఆయన గట్టిగా నమ్మారు. ఈ నమ్మకమే ఆయనను చేనేతకు అంకితభావంతో పనిచేయించిందని చెప్పాలి. బాపూజీ ఆధ్వర్యంలో చేనేతకారుల పక్షాన అనేక విధానాలు అమలులోకి వచ్చాయి. చేనేత సహకార సంఘాల స్థాపన, నూలు సరఫరా వ్యవస్థలో పారదర్శకత, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో ఆయన కృషి అపారమైంది. ముఖ్యంగా పల్లెస్థాయిలో చేనేత వృత్తిని రక్షించడానికి ఆయన చేసిన కృషి కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.

కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత కూలీలకు ఇచ్చిన అండవల్లే వారిలో కొత్త ఉత్సాహం ఏర్పడింది. నూలు కత్తెర మోగిన ప్రతి ఇంటి వెనుక ఆయన చేసిన శ్రమ ఉంది. ఆయన మాటల్లో చెప్పాలంటే -చేనేత వృత్తి కూలిపోతే అది కేవలం ఒక వృత్తి నాశనం కాదు, అది మన సాంప్రదాయానికి పెద్ద దెబ్బ. అందుకే చివరి వరకూ ఆయన చేనేత పరిరక్షణకు కృషి చేశారు. రాజకీయాలలోనూ, సామాజిక రంగంలోనూ, ముఖ్యంగా చేనేత పునరుద్ధరణలోనూ ఆయన చేసిన సేవలు బాపూజీని విశిష్ట స్థానంలో నిలిపాయి. ఆయన జీవితం ఒక సందేశం – పదవులు, బిరుదులు కంటే ప్రజల కోసం శ్రమించడం గొప్పదని తెలిపిన ఆయన జీవిత ప్రయాణం.దేశీ చీర ధరిస్తేనే మన కూలీ కుటుంబానికి ఆహారం లభిస్తుంది అనే ఆయన ఆహ్వానం వల్ల పలు ప్రాంతాల్లో ప్రజలు చేనేత వస్త్రాలవైపు తిరిగారు. ఆయన జీవన విధానం ఎంతో సరళం. సాధారణ వేషధారణ, ప్రజల్లో కలిసిపోవడం, కష్టాలు విన్నవెంటనే స్పందించడం ఆయనకు సహజం.

ప్రజలు ఆయనను బాపూజీ అని పిలవడం యాదృచ్ఛికం కాదు; ఆయనలో గాంధేయ విలువలు, అహింసా స్ఫూర్తి, సేవామూర్తి ప్రతిబింబించాయి. చేనేత వృత్తిని కాపాడటానికి చేసిన ఆయన కృషి నేటికీ ఒక మార్గదర్శకం. ఈ రంగంలో ఆవిర్భవిస్తున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే, బాపూజీ ఆలోచనలే ఆధారం కావాలి. ఆయన కల చేనేతకు కొత్త వెలుగులు రావాలి. తన వృద్ధాప్యంలో కూడా ఆయన తెలంగాణ సాధన కోసం తలొగ్గలేదు. అఖిలపక్షాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడం, ఆవేశభరితమైన యువతను ఆత్మస్థైర్యంతో ముందుకు నడిపించడం, కఠిన సమయాల్లో కూడా ధైర్యం నింపడం ఆయన కృషిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. చివరకు 2014లో తెలంగాణ సాధన సాకారమైనప్పుడు, ఆయన ఆ కలను నిజంగా కనుగొన్న నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజాస్వామ్య విలువలకు ఆయన చూపిన కట్టుబాటు, పదవులకంటే ప్రజల కోసం చేసిన త్యాగం, నిజాయితీతో కూడిన నాయకత్వం కొత్త తరాలకు ప్రేరణ.

డా. చిటికెన కిరణ్ కుమార్, 94908 41284

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News