ప్రవీణ్‌కుమార్ అనుచరుల ద్వారానే ప్రభుత్వంపై బురద జల్లే యత్నం ఆర్‌ఎస్ హయాంలో భారీగా నిధుల దుర్వినియోగం అవినీతి ఆరోపణలు వచ్చినందుకే కార్యదర్శి పదవి నుంచి తొలగింపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనను కొందరు
అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు.
103 గురుకుల భవనాలు బిఆర్‌ఎస్ నేతల బంధువులవే అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
రేవంత్ రెడ్డి పాలనను కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని, ఆ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన అనుచరులను సిబ్బందిగా నియమించుకున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు వారి ద్వారానే ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆమె ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వచ్చాకే ఆయన్ను కార్యదర్శిగా తొలగించారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని వదలబోమని సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె అన్నారు.
విద్యార్థి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం
వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామని ఆమె తెలిపారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఇది మొదటి సంఘటన అని, చాలా బాధగా ఉందన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిమ్స్‌లో చికిత్స పొందిన అమ్మాయికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని, కానీ, ఆమె చనిపోయిందన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే ఆదుకున్నారా? అంత బాధ మీకు ఉంటే ఆ అమ్మాయి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో చాలా సంఘటనలు జరిగాయని, కానీ, ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదన్నారు.
తమ ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులు అయిన అధికారులను కూడా సస్పెన్షన్ చేశామన్నారు. ఫుడ్ పాయిజన్ వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని మంత్రి తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని నడవకుండా చేయాలని ఒక ప్రణాళికతో డ్రామాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్‌ను హత్య చేయాలని చూశారని మంత్రి ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకులు మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఉసురు తీసుకోలేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయం కోసం 254 ఎకరాలు భూ సేకరణ చేస్తామన్నారు. గతంలో మహబూబాబాద్‌లో గిరిజనులను కొట్టించి మళ్లీ అక్కడ మహా ధర్నా ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు.
103 గురుకులాల భవనాలు బిఆర్‌ఎస్ నేతల బంధువులవి
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని కూడా తెలియదా కెటిఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. కెటిఆర్ సోదరి లోపల ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నారని, కానీ, బయటకు వచ్చినప్పటి నుంచి భయపడుతున్నాడన్నారు. కవిత, హరీష్ ఒక్కటయ్యారని కెటిఆర్ భయపడుతున్నారని మంత్రి సురేఖ ఆరోపించారు. కెసిఆర్ కవితకు ప్రియారిటీ ఇస్తున్నారని, కెటిఆర్ భయపడుతున్నారన్నారు. తమ ఏడాది పాలనలో ఏమి చేశామో తాము చెబుతామన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని గతంలో బిఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని మంత్రి పేర్కొన్నారు. గతంలో రూ.99 కోట్లను టెండర్లు లేకుండా ఖర్చు చేశారన్నారు.
103 గురుకులాల భవనాలు బిఆర్‌ఎస్ నేతల బంధువులవని వాటిని కిరాయికి ఇచ్చారన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ల అనుచరగణం లక్షల రూపాయల గతంలో వసూలు చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. దళిత ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడానికి బిఎస్పీలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యారన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆయన అనుచరగణం ఉన్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గతంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాఫియా నడిపారన్నారు. తమపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పెయిడ్ సోషల్ మీడియా వాళ్లకు భార్యలు తల్లులు లేరా పరిమితికి మించి ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారన్నారు.
మరో ఐదేళ్లు కూడా అధికారం తమదే
అధికారం కోల్పోయేసరికి బ్రెయిన్ పనిచేయకనే కెటిఆర్ ఇలాంటి కుట్రలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని మరో ఐదేళ్లు కూడా అధికారం తమదే అని మంత్రి కొండా ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా కెటిఆర్ పిచ్చి మాటలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయిస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. ప్రజలను మోసం చేశారు కాబట్టే మిమ్మల్ని ఓడించి పక్కన పెట్టారని మంత్రి విమర్శించారు. జైలుకు పోవాలని కెటిఆర్‌కు ఉబలాటం ఎక్కువ అయ్యిందని మంత్రి ఎద్దేవా చేశారు.