Tuesday, April 30, 2024

జీవనశైలే ఆరోగ్యానికి కీలకం

- Advertisement -
- Advertisement -

మనిషి ఆరోగ్యంతోనే కుటుంబ, దేశ ఆర్థికారోగ్యం ముడిపడి ఉన్నది. ఆధునిక ప్రపంచంలో మనిషి ఆరోగ్యం కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు యావలో ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనే నానుడిని ఎవరూ గుర్తించడం లేదు. కోవిడ్ తర్వాత మనుషుల ఆలోచన, ప్రవృత్తిలో కొంత మార్పు వచ్చినా మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితం, తోటి వారి సంపదతో నిత్యం బేరీజు లాంటి అంశాలు మనిషి జీవన శైలిని కల్లోలంగా మారుస్తున్నాయి. ఒత్తిడి, అలసట, అసూయతో కూడిన మారని జీవన శైలి సకల అనర్థాలకు దారి తీస్తున్నది. ఏ క్షణాన ఎవరి ప్రాణం పోతుందో తెలియని అనిశ్చిత పరిస్థితిలో మనుషులు జీవిస్తున్నారు.

మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, స్థూలకాయం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి అనేకానేక ప్రాణాంతక వ్యాధులకు దారి తప్పిన జీవన శైలే మూల కారణమని అనేక ఆరోగ్య నివేదికలు ఎప్పటికప్పుడు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నా జీవన శైలిలో మార్పు కనిపించడం లేదు. బ్యాక్టీరియా లేదా వైరస్‌తోనే జబ్బులు వస్తాయనుకుంటే పొరపాటు. మనం తినే తిండి, దాని పరిమాణం, అది తీసుకునే సమయం, దానిలో వాడిన ఉప్పు, కారం, ఫైబర్, ప్రొటీన్ లాంటివన్నీ జీవన శైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. ఇదే కాకుండా ధూమపానం, మద్యపానం, డ్రగ్స్, మితిమీరిన కామవాంఛ లాంటివి కూడా జీవన శైలి తోవలోకి వస్తాయి. తినే తిండే కాకుండా నిద్రించే సమయం కూడా జీవన విధానాన్ని తెలియజేయడమే కాకుండా సకల అనారోగ్యాలకు అవే దారి తీస్తున్నాయి.

‘చికిత్స కన్నా నివారణ మేలు’ అనే నానుడి అందరికీ తెలిసిన విషయమే అయినా ఆచరించే వారు కరువు కావడం వల్లనే ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తున్నాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటి జబ్బులకు భారత దేశం అగ్ర స్థానంలో ఉందనే నివేదికలు కూడా మన జీవన శైలి ఎంత కల్లోలభరితంగా మారిందో తెలియజెపుతున్నది. జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు రావాలని సామాజిక వేత్తలు, ఆరోగ్య నిపుణులు ఎన్ని రకాలుగా తెలియజెపుతున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా ఆసుపత్రుల పాలై తమ కష్టార్జితంలో సింహ భాగం జబ్బులకే ఖర్చు పెడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వం లేదా పాలకుల్లో కూడా జీవన శైలి ఒక ప్రధాన అంశమనే అవగాహన లోపిస్తున్నది.

పాలకులు ఈ విషయంలో ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి. జీవన శైలి విషయంలో ప్రజల్లో మార్పు తేవడంతో పాటు దానికి దారి తీస్తున్న కారణాల విషయంలో పాలనా విధానాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్, ధూమపానాన్ని కఠినంగా నియంత్రించడానికి బదులు పాలకులు వాటినే ప్రభుత్వానికి, తమకు ఆదాయ వనరుగా మలుచుకోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో వ్యాధి నిర్ధారణ అత్యంత కీలకమైనది. రోగానికి ముందే అది ముదరక ముందే వచ్చే రోగాన్ని నిర్ధారించే వ్యాధి పరీక్షలను ఖరీదు కాకుండా పాలకులు నివారించాలి. ఈ పరీక్షల ఖర్చును ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేకుంటే ప్రజలకు వ్యాధి నిర్ధారణకు ముందుకు రాకుండా చావుకు దగ్గరవుతున్నారు.

ప్రజల ఆరోగ్యమే ప్రధానమని పాలకులు గుర్తించకపోతే ప్రాణాంతక వ్యాధులు కుటుంబాలనే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తాయని తెలుసుకోవాలి. పిల్లల నుంచి వృద్ధుల దాకా ఆరోగ్యంపై, జీవన శైలిపై అవగాహన శిబిరాలు నిర్వహించాలి. అవసరమైతే జీవన శైలిని కూడా పాఠ్యాంశంగా రూపొందించాలి. ఆరోగ్య, అనారోగ్య ఆహారమేదో తెలియజెప్పాలి. ఈ విషయంలో ఇటీవల కాలంలో చెప్పుకోవాల్సి వస్తే కర్నాటక ప్రభుత్వం ఒక ఆదర్శనీయ నిర్ణయం తీసుకున్నది.

ఆ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌కు కారణమయ్యే ముడి పదార్థాలు వాడిన పీచు మిఠాయి, మంచూరియాలపై నిషేధం విధించింది. వీటిని తరచుగా తినేవారు క్యాన్సర్ బారిన పడుతున్నారనే నివేదికలు రాగానే ప్రభుత్వం ఆ ఆహారంపై నిషేధం ప్రకటించడం హర్షనీయం. కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ప్రజారోగ్యం బాగుపడదు. ప్రభుత్వాలు ఆదాయం కోసం దురలవాట్లను ప్రోత్సహించకూడదు. అవసరమైతే చక్కటి జీవన శైలిని అవలంబించే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి ఆరోగ్య సమాజం నిర్మాణమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా సకల దురలవాట్లకు దూరంగా ఉండి శారీరక శ్రమను పెంచితే తప్ప జీవన శైలి బాగుపడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News