Monday, April 29, 2024

శ్రీకృష్ణుడు మా పక్షమే: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

తన పార్టీ ‘ధర్మం’ పక్షాన ఉన్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం చెప్పారు. ‘ధర్మం’ కావాలా లేక ‘అధర్మం’ కావాలా అన్నది జనం తేల్చుకోవాలని ఆయన కోరారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థి సుశీల్ గుప్తాకు వోటు వేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆప్, కాంగ్రెస్ కలసి హర్యానాలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. ఆ పొత్తు కింద హర్యానాలోని పది పార్లమెంటరీ సీట్లలో ఏకైక కురుక్షేత్ర సీటుకు ఆప్ పోటీ చేస్తున్నది. సభికులను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్ మహాభారతం ప్రస్తావన తెచ్చి, కురుక్షేత్రం ధర్మయుద్ధం జరిగిన పవిత్ర ప్రదేశమని చెప్పారు. ‘కౌరవుల వద్ద సర్వం ఉన్నా పాండవులు గెలిచారు’ అని కేజ్రీవాల్ చెప్పారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన వెంట ఉన్నారు. ‘పాండవుల వద్ద ఏమి ఉన్నది ? శ్రీకృష్ణుడు వారితో ఉన్నాడు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘ఇప్పుడు మాతో ఉన్నది ఏమిటి ? మేము చాలా తక్కువ మందిమి. శ్రీకృష్ణుడు మాతో ఉన్నాడు’ అని ఆయన అన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం గురించి కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ, ‘వారి వద్ద అన్నీ ఉన్నాయి. వారికి అన్ని అధికారాలూ ఉన్నాయి. వారికి ఐబి, సిబిఐ, ఇడి ఉన్నాయి. మా వద్ద ధర్మం ఉన్నది. ఇది ధర్మం, అధర్మం మధ్య పోరు. మీరు ధర్మం వెంట ఉన్నారా లేక అధర్మం వెంటా అన్నది తేల్చుకోవాలి’ అని కేజ్రీవాల్ సభికులతో అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో 370 సీట్లు గెలుస్తామని బిజెపి చెప్పుకుంటోందని, ‘మీ వోట్లు తమకు అవసరం లేదని వారు బాహాటంగా చెబుతున్నారు’ అని ఆయన తెలిపారు. ‘నేను ముకుళిత హస్తాలతో మీ వోట్లు కోరేందుకు ఢిల్లీ నుంచి వచ్చాను.

సుశీల్ గుప్తాజీ మీ వోట్లు కోరుతూ ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎన్నికల్లో విజయానికి మీ వోట్లు మాకు కావాలి. వారికి (బిజెపికి) మీ వోటు అక్కరలేదు’ అని కేజ్రీవాల్ చెప్పారు. దేశంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారని, ఒకరు దేశ భక్తులని, మరొకరు అంధ భక్తులని ఆయన పేర్కొన్నారు. ‘నాతో దేశ భక్తులు రావాలి& మాకు అంధ భక్తులు అక్కరలేదు’ అని కేజ్రీవాల్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News