Friday, April 26, 2024

మకర జ్యోతి

- Advertisement -
- Advertisement -

 

శబరిమల అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతినాడు మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తాడు. దీనినే మకర విలక్కు అంటారు. శబరిమలలో అయ్యప్ప కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది.

పూర్వం మహిషిని వధించి తమను రక్షించినందుకు కృతజ్ఞలతో దేవతలు కాంతిమలై కొండపై స్వర్ణాలయాన్ని నిర్మించారు. అందులో జ్ఞానపీఠంపై అయ్యప్పను కూర్చోబెట్టి నిత్యం పూజలు చేస్తున్నారు. ఆ విధంగా నిత్య పూజ ముగించి ఉదయవేళలో దేవతలు ఇచ్చే హారతే మకరజ్యోతిగా దర్శనమిస్తుందని ఒక కథనం. మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం కాబట్టి దేవతలు ప్రతి రోజూ ఇచ్చే ఆ హారతే సంవత్సరానికి ఓ రోజు మకరజ్యోతిగా దర్శనమిస్తుందంటారు.

మకర సంక్రాంతి నాటి సాయంత్రం అయ్యప్పస్వామికి తిరువాభరణాలు అలంకరిస్తారు. అయ్యప్ప రాజకుమారుని అవతారాన్ని ముగించి శబరిమలైకు వెళ్లే సమయంలో తనను పెంచి పెద్ద చేసిన పందళరాజు రాజశేఖర పాండ్యునికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మేరకు అయ్యప్ప సంవత్సరానికి ఓ రోజు మకర సంక్రాంతినాడు తిరువాభరణాలను అలంకరించుకుంటాడు. మకర విళక్కుకు రెండు రోజుల ముందు పందళం ధర్మశాస్తా ఆలయం నుండి ఆభరణాలు బయలు దేరుతాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పందళం ధర్మశాస్తా ఆలయంపై గరుడ పక్షి ఎగురుతుంది. దీన్ని కృష్ణపరంతు అంటారు. గరుడ పక్షిని చూసి తరువాత రాజవంశీకుడు మూడు పెట్టెలతో ఆభరణాలను, అయ్యప్ప ప్రసాదించినట్టు చెప్పే ఉడవల్ అనే కత్తినీ పట్టుకుని బయలుదేరుతారు. వీరి ప్రయాణం 85 కిలోమీటర్ల మేర సాగుతుంది.

మొదటి రోజు రాత్రి ఆయురూరు దితియాకావు దేవి ఆలయంలోనూ, రెండో రోజు లావా ఎస్టేట్స్‌లోనూ మార్గమధ్యంలో ఆగుతారు. మూడోనాడు అంటే మకర విళక్కు నాటి మధ్యాహ్నానికి పంబానది వద్దకు చేరి అందులో స్నానం చేస్తారు. అక్కడ వినాయకుణ్ని సేవించి ఆపై శబరిమలైకి వస్తారు. పందళ రాజులలోని పన్నెండు వంశాల వారిలో కేవలం నాయర్ వంశవస్థులు మాత్రమే శబరిమలైకి వస్తారు. పంబ నుంచి శబరిమలైకి వెళ్లే మార్గంలో ఉన్న శరంగుత్తి ఆలె వరకు గరుడుపక్షి తిరువాభరణాలను అనుసరిస్తూ వచ్చిన తరువాత అదృశ్యమైపోతుంది.

వారు తెచ్చిన తిరువాభరణాలను సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఆలయంలోని మేల్ శాంతికి(అర్చకునికి) అందిస్తారు. ఆయన గర్భాలయంలోని స్వామికి ఆభరణాలు అలంకరిస్తారు. ఆ సమయంలోనే కాంతిమలై కొండపై ఆకాశంలో నక్షత్రం దర్శనమిస్తుంది. ఆభరణాలను అలంకరించిన తరువాత గర్భాలయం తలుపులు తెరచి హారతి ఇస్తారు. ఈ వేళలోని కొండపై మకర జ్యోతి దర్శనమిస్తుంది.  స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషలతో కొండంతా ప్రతిధ్వనిస్తుంది. జ్యోతి దర్శనంతో భక్తులు దివ్యానుభూతలకు లోనవుతారు. మకర జ్యోతిని గురించి ఎన్ని వాదనలున్నా అయ్యప్ప భక్తులకు మాత్రం ఇది మహిమాన్వితమైనది. దివ్యమైనది. అయ్యప్పలకు ఆరాధ్యమైనది.

Makara jyothi secret in telugu
Makara jyothi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News