మోడీ రాజధర్మం మరిచారుః ఖర్గే
వెలివేసినట్లుగా వ్యవహారం
ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనలు
న్యూఢిల్లీ : దేశ ప్రధాని అయ్యి ఉండి రాజధర్మం అనే కనీస బాధ్యతను నరేంద్ర మోడీ నిర్వర్తించలేదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే శనివారం నిందించారు. మణిపూర్‌లో తెగల ఘర్షణలు హింసాకాండ ఆరంభమయ్యి రెండేళ్లు కావస్తోంది దేశంలో ఎక్కడ ఎటువంటి కల్లోలం చెలరేగినా, జనం మధ్య ఘర్షణలు చెలరేగినా ప్రధాని అక్కడికి వెళ్లడం , పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించడం రాజధర్మం, పదవిలో ఉన్నందుకు చేయాల్సిన కనీస కర్తవ్యం . అయితే ఆయన ఇప్పటికీ కూడా మణిపూర్ సందర్శనకు వెళ్లలేదు. బాధితులను పరామర్శించలేదని , ఇంతకూ ప్రధాని మోడీకి మణిపూర్ ఘర్షణలు 2023 మే 3 వ తేదీన ఆరంభమయిన విషయం గుర్తుందా? అని ఖర్గే నిలదీశారు.
రెండేళ్లుగా రక్తసిక్త రీతిలో మణిపూర్ కుంటుతోంది.ఈ ప్రాంత ప్రజల కంటనీరు తుడిచే , కనీసం పలకరించి తానున్నానని తెలిపే బాధ్యత ప్రధానికి లేదా? అని ఖర్గే నిలదీశారు. ఇప్పటికి మణిపూర్‌లో ఎక్కడా సామరస్యం జాడలేకుండా పోయింది. రెండు రోజుల క్రితమే తమెన్‌లాంగ్ ప్రాంతం తెగల మధ్య సంకుల సమరం జరిగిందని తెలిపారు. ఎందరో గాయపడ్డారని చెప్పారు. ఇప్పటివరకూ మణిపూర్ ఘర్షణలలోదాదాపుగా 260 మందికి పైగా అకాల మరణం చెందారు. వేలాదిగా గాయపడ్డారు. లక్షలాదిగా నిరాశ్రయులు అయ్యి , రాదార్లపై తలదాచుకుంటున్నారు. మణిపూరీయులు అంటే ప్రధానికి ఎందుకీ ఈసడింపు? నిర్లక్షం? వారి ప్రాణాలు గాలిలో దీపాలు కావల్సిందేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్ల కాలంలో ప్రధాని మోడీ ఎటువంటి సంకోచాలు లేకుండా 44 విదేశీ పర్యటనలకు సకల సౌఖ్యాలతో రాజమర్యాదలతో వెళ్లి వచ్చారు. ఇది ప్రభుత్వాధినేతగా అవసరమే. ఇక దేశవ్యాప్తంగా అధికారిక పర్యటనల పేరిట 250 వరకూ దేశీయ పర్యటనలు జరిపారు. అయితే ప్రధానికి ఈ మధ్యకాలలో కనీసం పట్టుమని పది నిమిషాలు అయినా మణిపూర్‌లో విడిది చేయాల్సిన అవసరం లేదా? మోడీ వచ్చి వెళ్లగానే సమస్య పరిష్కారం అవుతుందని కాదు కానీ అక్కడి బాధితులలో కనీస ఆత్మస్థయిర్యం పెరగుతుందని ఖర్గే మండిపడ్డారు.
కేంద్రం పాటిస్తోన్న మణిపూర్ వెలి
రెండేళ్లుగా ప్రధాని మోడి మణిపూర్‌ను వెలివేశారు. మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దడంలో హోం మంత్రి అమిత్ షా విఫలం అయ్యారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలి. లేదా మణిపూర్ విషయంలో ఏమి చేయలేకపొయ్యామని మోడీ షా ద్వయం అంగీకరించాల్సి ఉంటుందని ఆయన శనివారం తెలిపారు. మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దడంలో కేంద్రం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ విమర్శించింది.