Thursday, April 25, 2024

ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం

- Advertisement -
- Advertisement -

inter-examinations

 

ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు
మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ
ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్‌ఎస్) ప్రారంభంలో సిఎస్

హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్, ఎస్‌ఎస్‌సి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు సోమవారం ఇంటర్,ఎస్‌ఎస్‌సి అధికారులతో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించానని పేర్కొన్నారు. ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం (బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రివియెన్స్ రిడ్రెసల్ సిస్టమ్- బిఐజిఆర్‌ఎస్)ను మంగళవారం సిఎస్ ప్రారంభించారు. ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరువుతున్నారని, 0.0001 శాతం కూడా పొరపాట్లు జరుగకుండా, జీరో టాలరెన్స్‌తో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరుగకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంకు సంబంధించి త్రిసభ్య కమిటీ చేసిన ఆరు సిఫార్సులను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా www.bigrs. telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

పరీక్షలు ముగిసిన తర్వాత జవాబుపత్రాల మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మూల్యాంకనం విధానం, బబ్లింగ్ చేసే విధానం తదితర అంశాలపై బుక్‌లెట్ రూపొందించి ఎగ్జామినర్లకు అందజేస్తామని చెప్పారు. ఎగ్జామినర్లు ఎక్కడైనా పొరపాటు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా కూడా విధిస్తామని సిఎస్ హెచ్చరించారు.

త్రిసభ్య సిఫార్సులలో గ్రివియెన్స్ సెల్ ముఖ్యమైనదని, దానిని ఇప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం ద్వారా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం వ్యవస్థను తీసుకువస్తున్నామన్నారు. రెండు రోజుల్లో యాప్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు సిజిజి డిజి రాజేంద్ర నిమ్జే మాట్లాడుతూ, విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారికి నోటిఫికేషన్ వెళుతుందని చెప్పారు.

విద్యార్థులు ఫిర్యాదు చేసే విధానం
ఏదైనా సమస్యలు ఉన్న విద్యార్థులు ముందుగా www.bigrs.telangana.gov.in లేదా యాప్‌లో తమ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వారి మొబైల్ నెంబర్‌కు వచ్చిన వన్ టైం పాస్‌వర్డ్(ఒటిపి) ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వివిధ రకాల సమస్యలకు సంబంధించిన జాబితా వస్తుంది. ఆ జాబితాలో విద్యార్థి తమ సమస్యను ఎంపిక చేసుకుని తమ దరఖాస్తును సమర్పించాలి. ఫిర్యాదు ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు టికెట్ నెంబర్ వస్తుంది.

Management of inter-examinations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News