Saturday, April 27, 2024

తెలంగాణ పరిశోధనల ‘సారాంశం’

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా 1990లో మండల్ ఉద్యమం, ఫూలే శత వర్ధంతి, 1991లో అంబేడ్కర్ శత జయంతి, ఆ తర్వాత ఎల్‌పిజి (లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్) ప్రభావం, తెలుగునాట వీటికి తోడు కాన్షీరావ్‌ు ఉద్యమాల ప్రభావం అన్నీ కలగలిపి బహుజనోద్యమాలకు ఊపిరులూదాయి. ఈ ప్రభావం అధ్యాపకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, అందులో జరిగే పరిశోధనాంశాలపై కూడా బలంగా ఉండింది. 1990వ దశకం నుంచి ఉస్మానియా కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా ఊపందుకుంది. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఇప్పుడే ఏర్పడింది. తెలుగు డిపార్ట్‌మెంట్లలో ప్రాంతేతరులపై పాఠ్యాంశాలను నిరసించింది. తెలంగాణ సోయిని ప్రోది చేసింది. ఇట్లా వివిధ విశ్వవిద్యాలయాల్లో మెజారిటీ తెలంగాణ స్కాలర్లకు ఇక్కడి అంశం తమ పరిశోధనకు కేంద్రకమైంది. ఇంకొందరికి దళిత బహుజన ఉద్యమాలు దారి చూపాయి. ఈ దశలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మారంరాజు ఉదయ ‘తెలుగు నవలల్లో తెలంగాణ జనజీవనం’ అనే అంశంపై పరిశోధన చేసి పట్టాపుచ్చుకున్నారు.

అట్లాగే యం.డి. రాజ్‌మహమ్మద్ ‘తెలంగాణ గిరిజనుల మౌఖిక సాహిత్యం’ అనే అంశంపై 1992లో థీసిస్ సబ్మిట్ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసి రిటైరైన ఎన్.ఆర్. వెంకటేశం ‘బుడిగె జంగాలుభాషా సాహిత్య సాంస్కృతికాంశాల పరిశీలన’ అనే అంశం పై విలువైన పరిశోధన చేసిండు. వీటితో పాటు అభ్యుదయ భావాలతో వి.వీరాచారి ‘తెలుగునాట సాంస్క ృతిక పునరుజ్జీవనోద్యమాలు, కవులు రచయితలు’, కథ, నవలా రచయిత కాలువ మల్లయ్య ‘తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం’, బన్న అయిలయ్య ‘తెలంగాణాలో సాహిత్య కార్యక్రమాలు సంస్థలు’ అనే అంశంపై పరిశోధన చేసి పట్టాలందుకున్నారు. అంటే 1990ల తర్వాత తెలంగాణ స్కాలర్లు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి ఉద్యమాలు, సాహిత్యం, సంస్థలు, కవులు, రచయితలపై ఫోకస్‌గా పరిశోధన చేశారు. అంతేగాదు దాదాపు ఇందులో ఒక్క మారంరాజు ఉదయ మినహా మిగతావారందరూ దళిత, బహుజన వర్గాల వారు కావడం విశేషం.

ఈ విషయాలన్నీ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అట్టెం దత్తయ్య సంపాదకత్వంలో వెలువడ్డ ‘సారాంశం’ ద్వారా తెలుస్తున్నది. మొత్తం 110 మంది తెలంగాణ స్కాలర్లు వివిధ అంశాలపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పుచ్చుకొని, అచ్చేసిన పుస్తకాలపై విహంగ వీక్షణ వ్యాస సంపుటాలు ఇవి. దాదాపు 1200ల పేజీల్లో అచ్చయిన ఈ రెండు సంపుటాల్లో తెలంగాణ పరిశోధనా రంగం ఎట్లా ఎదుగుతూ వచ్చిందో కండ్ల మందుంచిండు దత్తయ్య. వివిధ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల్లో గత 50 ఏండ్లుగా ఎంత పరిశోధన జరిగిందో గడచిన రెండు దశాబ్దాల్లో అంతకన్నా ఎక్కువ రీసెర్చ్ తెలంగాణ స్కాలర్లు చేసిండ్రు. విషయాల్లోనూ వినూత్నత, భిన్నత్వం చోటు చేసుకున్నది. ఈ రెండు సంపుటాలను గమనించినట్లయితే తెలంగాణలో తెలుగు సాహిత్య పరిశోధన ఎట్లా సంప్రదాయ, సనాతన మార్గాల నుంచి అభ్యుదయ, ప్రగతిశీల దారిన నడిచిందో తెలుస్తది.

1929 నుంచి (చిలుకూరి నారాయణరావు తొలి పిహెచ్‌డి నుంచి) దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల్లో దాదాపు 3000లకు పైగా పిహెచ్‌డిలు సబ్మిట్ అయ్యాయి. ఇందులో అచ్చయినవి 2000లకు మించి ఉండవు. ఇందులో తెలంగాణ నుంచి దాదాపు 1200ల మంది స్కాలర్లు పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టానందుకున్నారు అని భావిస్తే అందులో నాలుగో వంతు కూడా అచ్చుకు నోచుకోలేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో ఒక విశ్వవిద్యాలయంలో మొదట తెలుగు విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో తొలి లెక్చరర్‌గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన రాయప్రోలు సుబ్బారావు నియమితులయ్యారు. అందుకు ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్‌తోటి పైరవీ చేయించుకున్నాడు. ఆయనతో పాటు కొన్ని రోజులు వరంగల్‌లో ఆ తర్వాత ఉస్మానియాలో పని చేసిన వాడు ఖండవల్లి లక్ష్మీరంజనం. ఈయన తెలంగాణలో పుట్టకపోయినా ఇక్కడి ప్రజలతో మమేకమయిన మెన్నతుడు.

ఖండవల్లి మీది కోపంతో రాయప్రోలు సుబ్బారావు తన పదవీ కాలం ముగిసిన పిదప హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ముందు ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అవసరం లేదు. దీన్ని రద్దు చేయాలని విశ్వవిద్యాలయ అధికారులకు లేఖ రాసిండు.అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసు చర్య వల్ల ఆయన సిఫారసు పని చేయలేదు. దీంతో 1949 తర్వాత విశ్వవిద్యాలయంలో కొత్త నియామకాలు జరిగాయి. ఈ దశలోనూ ఆంధ్రా, రాయలసీమ నుంచి ప్రాంతం నుంచి వచ్చిన అధ్యాపకులు ఇక్కడ తెలుగు సాహిత్యానికి కొత్తగా పాదులు తీసిండ్రు. అప్లయి చేసుకున్నా శేషాద్రిరమణ కవులు లాంటి వారికి అధ్యాపక పదవులు రాలేదు. వారి స్థానంలో దివాకర్ల వెంకటావధాని లాంటి వారు లెక్చరర్లుగా నియమితులయ్యారు. ఇక్కడే కె.గోపాలకృష్ణారావు లాంటి వారు తెలంగాణ ఆత్మను డిపార్ట్‌మెంట్‌లో పటిష్ట పరిచారు.

ఈ విశ్వవిద్యాలయంలో మొదటి పరిశోధన సురవరం ప్రతాపరెడ్డి సూచన మేరకు బిరుదురాజు రామరాజు ‘జానపద గేయ సాహిత్యం’ మీద చేసిండు. ఇది తెలంగాణ మట్టిపరిమళానికి సాహిత్య గౌరవం కల్పించింది. అట్లాగే కె. గోపాలకృష్ణారావు చేసిన ‘ఆంధ్ర శతక వాఙ్మయ వికాసం’ సాహిత్యమంటే శిష్ట వర్గాలదే కాదు బహుజనులది కూడా అని నిరూపించింది. విస్మరణకు గురైన ఎందరో బహుజన శతకకారులని లెక్కగట్టి, పండితులు తిరస్కరించిన సాహిత్యానికి పట్టం గట్టిండు. ఇవి రెండూ తెలంగాణ నుంచి తెలుగు సాహిత్య పరిశోధనకు తొలినాళ్ళలో చేసిన మేలైన చేర్పులు. అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఆంధ్రాధిపత్యం రాజకీయ రంగంలో పెరుగుతూ ఉండడం తెలంగాణ వాడయినప్పటికీ సినిమా పాటల అవకాశాల కోసం ఎల్లకాలం ఆంధ్రావారితో మమేకమైన సి. నారాయణ రెడ్డి, సనాతనుడైన బిరుదురాజు రామరాజు, ప్రాంతేతరుడైన దివాకర్ల వెంకటావధాని తెలుగు శాఖలో ఆంధ్రా వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఈ దశలో కె. గోపాలరావుకు పిహెచ్‌డి గైడ్‌షిప్ లేదు అని గుర్తుంచుకోవాలి.

ఈ దశలోనే కె.వి.రామకోటి శాస్త్రి, పాటిబండ్ల మాధవశర్మ, వేటూరి ఆనందమూర్తి తదితరులు ఉస్మానియాలో పరిశోధనలు చేసిండ్రు. దీంతో 1953 నుంచి 1980ల వరకు ఎక్కువగా ఉస్మానియాలో రామాయణ, భారత, భాగవతాలు, ప్రబంధ కవులు, సనాతన సాహిత్యం, కవిత్రయం, వ్యాకరణాలు, నిఘంటువుల మీదనే పరిశోధనలు జరిగాయి. తెలంగాణకు చెందిన ప్రాచీన కవులను సైతం ఉస్మానియా విశ్వవిద్యాలయం విస్మరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఇందుకు కొంత మినహాయింపు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటై దాదాపు 45 ఏండ్లవుతున్నా అందులో తెలంగాణవాళ్ళు చేసిన పరిశోధన అరుదు. నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు స్కాలర్లు డాక్టరేట్లు పొందుతున్నారు. అవి ఇంకా అచ్చు రూపంలోకి రావాల్సి ఉన్నది.

1958లో ప్రచురితమైన బిరుదురాజు రామరాజు పరిశోధన గ్రంథం ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’ మొదలు 2017లో ప్రచురితమైన తాళ్లపల్లి యాకమ్మ రీసెర్చ్ థీసిస్ ‘బోయ జంగయ్య సాహిత్యానుశీలన’ వరకు మొత్తం 110 రీసెర్చ్ గ్రంథాలపై అవలోకనా వ్యాస సంపుటాలు ‘సారాంశం’. ఇందులో బుక్కా బాలస్వామి, గిరిజా మనోహర్ బాబు, ఎన్. వేణుగోపాల్, సంగిశెట్టి శ్రీనివాస్ మొదలు అనేక మంది లబ్ధప్రతిష్టులతో పాటు వర్ధిష్ణువులు కూడా ఒక ఫార్మాట్ పద్ధతిలో పరిచయ వ్యాసాలు రాసిండ్రు. ఒక్క ఘట్టమనేని మినహా దాదాపు అందరూ తెలగాణ వాళ్ళే కావడం విశేషం. ఇవన్నీ కూడా వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులకు, పరిశోధక విద్యార్థులకు, సామాన్య పాఠకులకు రెడీ రెఫరెన్స్ బుక్ లాగా ఉపయోగపడనున్నాయి. ఒక్కో పరిశోధకుడు పదేండ్లు పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలను ఒక క్రమ పద్ధతిలో రీసెర్చ్‌లో భాగంగా పట్టా కోసం సమర్పించుకున్నారు.

ఇందులో పల్లా దుర్గయ్య, నారాయణ రెడ్డి, ఎం. కులశేఖరరావు, హరి శివకుమార్, పాకాల యశోదారెడ్డి, అమరేశం రాజేశ్వర శర్మ, ఎస్వీ రామారావు, ముకురాల రామారెడ్డి, వే. నరసింహారెడ్డి మొదలు యువకులైన తాళ్లపల్లి యాకమ్మ, పసునూరి రవీందర్, బూర్ల చంద్రశేఖర్‌ల వరకు వారి పరిశోధనా గ్రంథాలపై విశ్లేషణ ఉన్నది. ఒక్కొక్క సిద్ధాంత గ్రంథం గురించి క్లుప్తంగా పది పేజీలకు మించకుండా అందించారు సంపాదకులు.నిజానికి మొత్తం తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి డాక్టరేట్ పుచ్చుకున్న దళిత మహిళ బొజ్జ విజయ భారతి. ఈమె 1969లో ‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయము సాంఘిక జీవనము’ అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పల్లా దుర్గయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసింది. ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కొలకలూరి ఇనాక్ ‘తెలుగు వ్యాసం’ పైన రీసెర్చ్ చేసిండు.

అయితే తెలంగాణ నుంచి పట్టా అందుకున్న తొలి దళిత వ్యక్తిగా ఎన్.ఆర్ వెంకటేశం రికార్డయిండు. ఈయన 1992 లో ‘బుడిగె జంగాలు భాషా, సాహిత్య సాంస్కృతికాంశాల పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు. అంటే 1969లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక దళిత మహిళ పట్టా అందుకున్న 23 ఏండ్లకు తెలంగాణ వ్యక్తి ఆ స్థాయికి చేరుకోలేదని అర్థమవుతున్నది. మొదటి సంపుటిలో తాళ్లపల్లి యాకమ్మ, మండల స్వామి లాంటి దళితులు వ్యాసకర్తలుగా ఉన్నారు. రెండో భాగంలో పుస్తకం అచ్చేసిన దళిత పరిశోధకుల్లో ఎన్.ఆర్. వెంకటేశంతో పాటు బన్న అయిలయ్య, గుండె డప్పు కనకయ్య, పసునూరి రవీందర్, తాళ్లపల్లి యాకమ్మలున్నారు. ఒకే ఒక్క గిరిజన మహిళ పరిశోధకురాలిగా సూర్యా ధనంజయ్ ఉన్నారు. వీళ్లందరూ తమ తమ పరిశోధనాంశాలను పుటంబెట్టి మెరుగు పరిచారు. ఈ సంపుటాల్లో మొదటి దాన్ని ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు, రెండో దాన్ని ఆచార్య వై.శ్యామలకు అంకితమివ్వడం కూడా వారు పరిశోధన, నిఘంటు రంగాల్లో చేసిన కృషికి సరైన గౌరవం.

ఇట్లా విశ్వవిద్యాలయాలకు సమర్పించుకున్న గ్రంథాలను చాలా మంది ఆర్థిక ఇబ్బందులకు తాళలేక అచ్చు వేసుకోలేదు. అచ్చు వేసుకున్న వాటిలో కొన్నింటిని ఈ పరిశీలనకు అర్హతగా ఎంచి అట్టెం దత్తయ్య ఇప్పుడు వెలుగులోకి తెస్తున్నాడు. అంటే దాదాపు 70 ఏండ్ల తెలంగాణ పరిశోధనా పరంపరను కొండ అద్దంలో చూపించినట్లు మనకందిస్తున్నాడు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. థాంక్‌లెస్ పని కూడా. అయినా అవసరమైన పని. ఈ అవసరమైన పనిని తెలంగాణ కాలంలో (సాహితీ రంగంలో తెలంగాణ కాలమే నడుస్తున్నది)అందిస్తున్న దత్తయ్యకు అభినందనలు. కవిత్వం, కథలు రాసుకొని ప్రచారం చేసుకోవడానికి తెలుగునాట ఎక్కువ మంది రచయితలు ఇష్టపడతారు. ఇతరుల గురించి అధ్యయనం చేయాలంటే, అదీ పరిశోధన గ్రంథా లు చదవాలి, రాయాలి అంటే పిడికెడు మంది కూడా ముందుకు రారు. అట్లా ఇంత మంది పరిశోధనల గురించి ఇష్టంగా రాయించి, దానికి సొంత సమయాన్ని వినియోగించి, సమాజానికి ఉపయోగపడేలా పని చేయడం సాహసోపేతం.

అందుకే అట్టెం దత్తయ్య అంటే పట్టువిడవని పరిశోధకుడు, అలుపెరుగని రచయిత అని చెప్పవచ్చు. ఇది ఆయన కార్యదీక్షకు నిదర్శనం. ఆయన గతంలో ఎంతో శ్రమకోర్చి వెలువరించిన ‘బిసి సాహిత్య విమర్శ’ రాబోయే తరానికి మార్గ నిర్దేశనం చేసే ‘లైట్ హౌజ్’గా కానున్నది. సముద్ర ప్రయాణం చేసే సెయిలర్స్‌కు ఈ లైట్ హౌజ్ విశిష్టత తెలుసు. చిమ్మ చీకటిలో దిశా నిర్దేశం చేస్తది.
ఇక మళ్ళీ ప్రస్తుత విషయానికి వస్తే పరిశోధనల కోసం వివిధ విశ్వవిద్యాలయాల మధ్యన సమన్వయం ఉండాలి. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏ అంశంపై ఏ ఏ విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు అని ఆయా శాఖల వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. దీని వల్ల దేశంలో ఎక్కడ కూడా పరిశోధన రిపీట్ కాకుండా ఉంటుంది. అట్లాగే వివిధ శాఖల మధ్యన ఉదాహరణకు తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖల్లో ఒకే అంశంపై పరిశోధన జరిగేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు తమ దగ్గర అలాట్ అయిన పరిశోధన టాపిక్‌లను ఇరు విభాగాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లయితే టాపిక్ కేటాయించేప్పుడు జాగ్రత్త పడడానికి వీలుంటది.

నిర్ణీత గడువులోగా పరిశోధన చేయని విద్యార్థి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు వీలవుతుంది. అట్లాగే పరిశోధన థీసిస్‌ని సబ్మిట్ చేసిన మూడు నెలల వ్యవధిలో దాన్ని ‘శోధ్ గంగ’ జ్ఞాన సాగరంలో జత చేయాల్సి ఉంటది. కానీ దురదృష్టవశాత్తు ఏ విశ్వవిద్యాలయం ఆ పని చేయడం లేదు. ఈ సారాంశం స్ఫూర్తితోనైనా ఆ పనిని అని విశ్వవిద్యాలయాలు చేసినట్లయితే భవిష్యత్ పరిశోధకులకు బంగారు బాటలు వేసినట్లయితది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News