Monday, March 4, 2024

మంథనిలో చతుర్ముఖం

- Advertisement -
- Advertisement -

ప్రచారంలో దూసుకు పోతున్న నాల్గు పార్టీలు, పోరులో బిఆర్‌ఎస్, బిఎస్‌పి, కాంగ్రెస్, బిజెపి పార్టీలు

మంథని అసెంబ్లీ పోరులో నాలుగు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో పోటీ తీవ్రం గా నెలకొనగా తామేం తక్కువకాదు అన్నట్లుగా బీఎస్పీ, జిజెపి అభ్యర్థులు కూడా ప్రచారంలో దూకుడు పెంచి ప్రజాదరణ పొందుతున్నారు. మంథనిలో పలువురు నామినేషన్లు వేయగా తిరస్కరణ, ఉపసంహరణ పోను 21మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బిఆర్‌ఎస్ నుంచి పెద్దపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్టమధు, కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌ఎ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీఎస్పీ నుంచి కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, బిజెపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ రాంరెడ్డి కుమారుడు చందుపట్ల సునీల్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

మంథని నియోజకరవ్గంలో 2,36,442 ఓటర్లు ఉండగా 9 మండలాలు ఉన్నాయి. ఇందులో భూపాలపల్లి జిల్లాలో 5 మండలాలు, పెద్దపల్లి జిల్లాలో 4 మండలాలు ఉన్నాయి. మంథనికి 15సార్లు ఎన్నికలు జరుగగా 12సార్లు కాంగ్రెస్, ఒక్కసారి బిఆర్‌ఎస్, ఒక్కసారి టిడిపి, ఒక్క సారి సోషలిస్టు పార్టీలు ఎంఎల్‌ఎ పదవిని కైవసం చేసుకున్నాయి. ఇప్పటి వరకు గులకోట శ్రీరాములు, చందుపట్ల నారాయరెడ్డి, పివి. నర్సింహరావు, దుద్దిళ్ల శ్రీపాదరావు, చందుపట్ల రాంరెడ్డి, దుదిళ్ల శ్రీధర్‌బాబు, పుట్టమధుకర్‌లు ఎంఎల్‌ఎలు గా ప్రాతినిథ్యం వహించారు. ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో పార్టీల ప్రచారాలు జోరు పెరిగాయి. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచార రథాలు ఓటర్లను ఆకటకట్టుకునేలా గల్లీ గల్లీ తిరుగుతున్నాయి. అభ్యర్థులు పార్టీల చేరికలతో, ఇంటింటి ప్రచారాలతో కలియ తిరుగుతున్నారు. బీఆర్‌ఎస్ తరఫున ముఖ్యమంత్రి హాజరైన మంథని ప్రజా ఆశీర్వాదసభలో పెద్దసంఖ్యలో ప్రజలను సమీకరించి తన బలాన్ని నిరూ పించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్‌గాంధీ రోడ్డు షోతో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

బిఆర్‌ఎస్‌కు కలిసిచ్చే ప్రధాన అంశాలు…
బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వం అందించిన సంక్షేమాలైన రైతుబంధు, వ్యవసాయానికి 24గంటల కరెంటు, రునమాఫీ, చెరువుల అభివృద్ధి, సరిపడా ఎరువుల సరఫరా, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పెద్దమొత్తంలో పింఛన్లు తదితర పథకాలు, నూతన గ్రామ పంచాయతీలు, మండలాల ఏర్పాటు, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, తను నియోజకరవ్గంలో పేదవారికి పుట్టలింగమ్మ ట్రస్టు ద్వారా చేసిన పెళ్లిల్లు, విద్యార్థులకు ఉచిత భోజనాలు లాంటి మరెన్నో సేవలతో పాటు బిఆర్‌ఎస్ తలపెట్టిన మేనిఫెస్టో, తను ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు, ప్రస్తుత జెడ్‌పి చైర్మన్‌గా ప్రభుత్వ సహాయంతో చేసిన అభివృద్ధి తనకు కలిసిసచ్చే ప్రధాన ఆంశాలు.

కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు…
కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రిగా, ఎంఎల్‌ఎగా నియోజకవర్గంలో చేసిన పనులు, కళాశాలల ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లు వంటిఅభివృద్ధి కార్యక్రమాలు కలసిరానున్నాయి. వీటితో పాటు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే అంశాలతో పాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటి పథకాలు, 62 ఆంశాల మేనిపెస్టో, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లు కలసివచ్చే ఆంశాలుగా చెప్పుకోవచ్చు.

బిఎస్పీకి కలిసొచ్చే ఆంశాలు…
బిఎస్పీ అభ్యర్థి నియోజకవర్గానికి నూతన అభ్యర్థి సర్పంచ్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆయన, ఆయన కుటుంబం కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలో ప్రజలకు పనులు చేసిన అనుభవం, బహుజనవాదం పార్టీ నుంచి టికెట్ దక్కడం బహుజనలు అంతా సహకరిస్తారనే నమ్మకం, తన సామాజిక వర్గం ఓట్ల ఆదరణ తనకే ఉంటుందని, నియోజవకర్గంలో పలు పార్టీల పాలన చూసి సంతృప్తిగా లేరని కొత్తవారికి అవకాశం ఇవ్వవచ్చనే ఆంశాలు ఆయనకు కలిసిరానున్నాయి.

బిజెపికి కలిసచ్చే ఆంశాలు…
బిజెపి అభ్యర్థి తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో నియోజకవర్గంలో చురుకుగా పాల్గొనడం, 10 సవంత్సరాలుగా నియోజకవర్గంలో చేస్తున్న సేవలు, కొత్తగా రాష్ట్రంలో బిజెపిని ఆదరిస్తారనే నమ్మకం, తండ్రి ఎంఎల్‌ఎగా చేసినసేవలు ఈయనకు కలిసచ్చే ఆంశాలు. సమయానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. మొత్తంమీద నలుగురు అభ్యర్థుల్లో ఎవరు ప్రజల మన్ననలు పొంది విజయం సాదిస్తారో, మంథనిలో ఏపార్టీ జెండా ఎగరవేస్తుందో డిసెంబర్ 3న వెలువడే పలితాలకోసం వేచి చూడాల్సిందే.

(ఎం. లక్ష్మారెడ్డి/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News