Saturday, July 27, 2024

ఓటర్లకు కానుకల పంట!

- Advertisement -
- Advertisement -

ప్రతి ఆడపడుచుకు ఒక పట్టుచీర, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులకు బంగారం,  కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ,  అడిగినోళ్లకు, అడగనోళ్లకు అందరికీ తాయిలాలు…?

మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయం ప్రధాన పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది. అభ్యర్థులు వినూత్నంగా ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. నియోజకవర్గాల ఓటర్లకు కానుకల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఉత్తర తెలంగాణలోని ఓ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనాలకు వస్తున్న ప్రతి ఆడపడుచుకు ఒక పట్టుచీరను పంచారు. సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులకు బంగారం, కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. ఇలా అడిగినోళ్లకు, అడగనోళ్లకు అందరికీ తాయిలాలు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో వీటి కోసం కోట్లాటలు జరుగుతున్నాయి.

బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలతో పాటు స్థిరాస్తి వ్యాపారులు, వ్యాపార సంస్థల ప్రముఖులు బరిలో ఉన్న కొన్నిచోట్ల కోట్లల్లో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇకపోతే సభలు, ప్రచారానికి జనం తరలింపు, వాహనాల ఖర్చులు, పోలింగ్‌కు ముందు ఓటర్లకు ప్రత్యేకంగా పంచేవి అభ్యర్థులకు అదనం అయ్యాయి. బరిలో దిగిన అభ్యర్థులు ఏ గ్రామంలో అడుగు పెడితే అక్కడ తమ మార్కును చూపిస్తున్నారు. గ్రామదేవతల ఆలయాలు మొదలు గుడులు, గోపురాల మరమ్మతులు, పునర్నిర్మాణాల కోసం నిధులు ఇస్తున్నారు. ప్రార్థనా మందిరాల నిర్వాహకులతోనూ సమావేశమై సాయం అందజేస్తున్నారు. సామాజిక వర్గాల సంఘాల ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం విశేషం.

కొన్ని ఉమ్మడి జిల్లాలో పంపిణీ పూర్తి…
కార్తీక మాసం పురస్కరించుకొని వన సమారాధనలు, వన భోజనాల ఏర్పాటుకు కనిష్టంగా రూ.2 లక్షల దాకా అభ్యర్థులు సమర్పిస్తున్నారు. ఇప్పుడే ఇంత చేస్తున్నానని, గెలిస్తే మరెంతో చేస్తానని ఒక్కసారి అవకాశం ఇవ్వండని కొందరు, మరొక్క అవకాశం కల్పించండని సీనియర్లు ఓటర్లను ప్రాధేయపడుతూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కొందరు కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలను అభ్యర్థులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.

అభ్యర్థుల తాయిలాలు ఇలా…
కుల సంఘాల సంక్షేమ భవనాలకు రూ.50 లక్షలు, కుల సంఘాల సంక్షేమానికి (వెల్ఫేర్) రూ.కోటికి పైగా, బస్తీలు, కాలనీల్లోని బహిరంగ కమ్యూనిటీ హాళ్లకు రూ.10 లక్షలు, గ్రామాల్లో కమాన్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, పేదింటి ఆడ పిల్లల వివాహాలకు రూ.లక్షకు పైగా, సంఘాలకు షామియానా,టెంట్ సామగ్రికి రూ.5 లక్షలు, యువతకు క్రీడా సామగ్రి, జిమ్ పరికరాలకు రూ.2 లక్షలు, యువజన సంఘాలకు డీజే కిట్స్ రూ.3 లక్షలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో సిసి టివిలకు రూ.5 లక్షలు, కూడళ్లలో సోలార్ వీధి దీపాల ఏర్పాటుకు రూ.5 లక్షలు, పలు సంఘాలకు స్థలం కొని ఇవ్వడానికి రూ.50 లక్షలు, ఏదైనా మరణాలు చోటుచేసుకుంటే వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.50 వేలు, అత్యవసర శస్త్రచికిత్సలు వైద్య సేవలకు రూ.5 లక్షల వరకు పంపిణీ చేస్తుండడంతో ఓటర్లు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

వన భోజనాలకు రూ.2 లక్షలు…
తాయిలాల రూపంలో వన భోజనాలకు రూ.2 లక్షలకు పైగా ప్రతి ఆదివారం గ్రామానికి రెండు పొట్టేళ్లను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికీ పట్టు చీర, కుక్కర్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, స్టౌలను అందజేస్తున్నారు. మరోవైపు ఆలయాలకు రూ.2 లక్షలకు పైగా నిధులను, కుల దేవతలు ఆలయాల పునర్నిర్మాణానికి రూ.5 లక్షలు సమర్పించుకోవడం విశేషం. గ్రామాల్లోని ఆలయాల మరమ్మతులకు రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షలు అందిస్తున్నారు. అలాగే నూతన ఆలయ నిర్మాణానికి రూ. కోటికి పైగా ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News