Tuesday, April 23, 2024

‘కా’పై ‘సత్యా’గ్రహం

- Advertisement -
- Advertisement -

Satya-Nadella

 జరుగుతున్నది మంచిది కాదు
విచారకరం, బంగ్లాదేశ్ వలసదారు ఇండియాలో ఎంఎన్‌సి సారథి కావాలని కోరుకుంటున్నాను
భారత్ బహుళ సంస్కృతుల దేశం, ఆ వారసత్వంలోనే నేను తయారయ్యాను
మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల

న్యూయార్క్ : నూతన పౌరచట్టంపై మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ సంతతికి చెందిన సత్య హైదరాబాద్‌లో జన్మించారు. తాను పుట్టిన దేశంలో వివాదాస్పద పౌరచట్టం రూపుదిద్దుకోవడం తనకు బాధ కల్గిస్తోందని ఆయన తెలిపారు. పౌరసత్వానికి సంకుచిత ప్రాతిపదిక రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పనికి వచ్చే వ్యక్తి ఎక్కడి వారైతే ఏమిటని సత్య నాదెళ్ల ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారుడు కూడా ఇండియాలో ఏదో ఒక బహుళ జాతి కంపెనీకి సారథ్యం వహించే పరిస్థితి ఉండాలని అభిప్రాయపడ్డారు.

దేశ ఆర్థిక పరిస్థితికి ప్రయోజనం కల్గించే వాతావరణం ఏర్పడాలని సూచించారు. దేశంలో ఇమ్మిగ్రేంట్లు కూడా బహుళ జాతి సంస్థలను నడిపించే రోజు రావాలనేదే తన ఆశ అని అన్నారు. ప్రతి దేశం ఖచ్చితంగా తమ దేశ సరిహద్దులను నిర్వచించుకోవల్సిందే. ఇది తప్పనిసరి. జాతీయ భద్రత కీలకమైన అంశం. దీనికి అనుగుణంగా ఇమిగ్రేషన్ పాలసీని రూపొందించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామిక దేశాలలో ఏ విషయంపై అయినా తప్పనిసరిగా ప్రజలు, ప్రభుత్వం మధ్య సరైన చర్చ జరిగి, కార్యాచరణను రూపొందించుకునే పరిస్థితి ఉండాలని స్పష్టం చేశారు.

తాను భారతీయ వారసత్వంతోనే ఇప్పుడీ స్థాయికి చేరుకున్నానని, బహుళ సంస్కృతుల ఘనమైన భారతదేశంలో పెరగడం, ఆ తరువాత వలసదారుల విషయంలో అమెరికాలో తనకున్న అనుభవం నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయని అన్నారు. ఇతర చోట్ల నుంచి వచ్చే వారు కూడా ఇక్కడ ప్రగతిదాయక స్టార్టప్‌లు చేపట్టడానికి, ఎంఎన్‌సిలు ఆరంభించడానికి వీలు కల్పించాల్సి ఉందన్నారు. భారతీయ సమాజానికి మేలు కల్గించే పరిణామం , ఆయువుపట్టు వంటి ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే ప్రక్రియకు అనువైన వాతావరణం అవసరం అన్నారు. ఇది ఏ దిక్కు నుంచి వచ్చినా ఆహ్వానించదగ్గదే అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి పౌరసత్వ కల్పన ప్రతిపాదన క్రమంలో అక్కడి వారు వలస వచ్చి ఇక్కడ భారీ కంపెనీలు పెట్టి, దేశానికి మేలు చేస్తే కాదనాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమన్నారు.

న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్ తరఫున జరిగిన కార్యక్రమంలో ఎడిటర్లతో సత్యనాదెళ్ల మాట్లాడారు. ఈ సందర్భంగా బజ్‌ఫీడ్ వార్తా సంస్థ వారు భారతదేశంలో తలపెట్టిన సిఎఎపై స్పందించాలని కోరారు. ఈ సందర్బంగా సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. పౌర చట్టం తనకు బాధ కల్గిస్తోందన్నారు.

పుట్టిన హైదరాబాద్‌కు ఘన సంస్కృతి

తాను పుట్టి పెరిగిన నగరం అందించిన సంస్కృతి వారసత్వం తనకు గర్వకారణం అయిందని సత్యనాదెళ్ల చెప్పారు. తాను పెరిగిన నగరంలో అన్ని పండుగలను చేసుకునే వారమని, దివాళీ, క్రిస్మస్ ఏదైనా ఒక వేడుకగా ఉండేదన్నారు. అటువంటి వాతావరణంలో పెరగడం గొప్పదనమే అనుకుంటానని అన్నారు.తాను విశాలదృక్పథంతో ఉండటానికి తాను పెరిగిన వాతావరణం దోహదం చేసిందని, ఏళ్లు గడిచినా తన జన్మస్థలానికి దూరమైనా తనకు ఇప్పటికీ అంతః ప్రేరణ అప్పటి సమ సహజీవన వాతవరణమే అన్నారు. సమభావనతో కూ డిన వాతావరణంలో పెరిగిన తనకు ఇప్పుడు ఇండియా లో పరిణామాలు ఇబ్బందిగా అన్పిస్తున్నాయన్నారు.

Microsoft Chief Satya Nadella Comments on CAA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News