పరిస్థితి ఎట్లా ఉందంటే, వ్యాసం రాసి అది అచ్చయేలోగా భారత, పాకిస్థాన్‌ల సైనిక ఘర్షణ జరగవచ్చు. లేదా అచ్చు వేయటం అర్ధరాత్రి దాటిన తర్వాత పూర్తయి, తెలవారున పత్రిక పాఠకులకు చేరే వేళకు మొదలైపోవచ్చు. సైనిక వ్యూహాలు సాధారణంగా అట్లాగే ఉంటాయి. యుద్ధం పగటివేళల కొనసాగుతుంది. కాని మొదలయేది మనం నిద్రపోయిన తర్వాత. ముఖ్యంగా వైమానిక దాడులు. ఆధునిక రాడార్ వ్యవస్థలు అభివృద్ధి చెందిన తర్వాత, శత్రువిమానాల రాకను చాలా ముందుగానే పసిగడుతున్నపుడు, దాడి జరిగేది పగలా, రాత్రా అనే దానితో సంబంధం ఉండదు. అందువల్ల, పాకిస్థాన్‌పై ఇండియా వైమానిక దాడి ఎపుడు జరుగుతుందా అని రోజంతా ఎదురుచూసి అలసిపోయిన వారు, తిరిగి ఉదయమే టెలివిజన్ ఆన్ చేయటం మంచిది. అప్పటికి వారికి పత్రికలు వచ్చి ఉండినా సరే, అవి అచ్చయిన సమయానికి దాడులు ఇంకా మొదలై ఉండకపోవచు గనుక. మొత్తానికి, అసాధారణ నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే తప్ప, సర్వసాధారణంగా జరిగేది ఇదే.
భారత దేశం దాడి చేస్తుందా అని ఇప్పటికీ కొందరు అమాయకంగా ప్రశ్నస్తున్నారు. అది అమాయకత్వమని అనటం ఎందుకంటే, విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత దాడి అన్నది ఒక విధంగా అనివార్యం. పహల్గాంలో సాధారణ పౌరులపై ఘాతుకమైన టెర్రరిస్టు దాడి జరిగింది. భారత ప్రభుత్వం ఆ వెంటనే టెర్రరిస్టుల కోసం వెతుకుతూనే, వారికి పాకిస్థాన్ అండ ఉందని ప్రకటించింది. కొన్ని ప్రతీకార చర్యలు దౌత్యపరంగా తీసుకున్నది. పాకిస్థాన్ తన చర్యలు తాను ప్రకటించింది. ఆ తర్వాతి స్థాయి సైనిక చర్యలు. అటువంటి చర్యలు తీసుకుని తీరగలమని ప్రధానమంత్రి మోడీ స్పష్టంగా ప్రకటించారు. ‘టెర్రరిజాన్ని ధ్వంసం చేసే విధంగా ఆ చర్య ఉండాలని జాతి తీర్మానించింది’ అన్నారాయన.
తర్వాత అందుకు సన్నాహంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో పర్యటించి సైన్యాన్ని అప్రమత్తం చేయటం, త్రివిధ బలాల సన్నద్ధల వంటి చర్యలన్నీ జరిగిపోయాయి. తాజాగా భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాలు ఏప్రిల్ 30న ప్రధాని అధ్యక్షతన జరిగాయి. అంతకు ముందు రోజునే సైన్యానికి ‘ఆపరేషనల్ ఫ్రీడం’ ఇచ్చారు. ఏ చర్య, ఎప్పుడు, ఎక్కడ తీసుకుంటారనే స్వేచ్ఛ అన్నమాట. ఈ విధంగా అన్ని సన్నాహాలూ జరిగిపోయాయి. గనుకనే, పాకిస్థాన్ మంత్రులు అదే బుధవారం మాట్లాడుతూ, తమపై 36 నుంచి 48 గంటలలోగా ఎపుడైనా భారత సైన్యం దాడి జరపగలదనే విశ్వసనీయ నిఘా సమాచారం తమకుందన్నారు. ఇటు భారత సైన్యం సన్నాహాలు చేస్తున్నట్లే అటు పాకిస్థాన్ సైన్యం కూడా సన్నాహాలు ప్రారంభించింది.
సరిహద్దుల్లో రాడార్ల మోహరింపు, సైన్యాల తరలింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు పౌర విమానాల నిలిపివేత, వైమానిక బలాన్ని సరిహద్దు సమీపంనుంచి దూరంగా తమ పశ్చిమ సరిహద్దులకు మార్చటం వంటి చర్యలు అందులో ఉన్నాయి.
పాక్ మంత్రుల సమాచారం నిజమైతే, దాడి మే 2, 3 తేదీల కల్లా మొదలైపోవాలన్న మాట. ఇంతవరకు వచ్చిన తర్వాత దాడి జరగకపోవడమంటూ ఉండదు. అట్లాగే, గమనించవలసింది, 2019 నాటి బాలాకోట్ దాడుల సమయానికి మించి అనేక రెట్ల సన్నాహాలు జరుగుతున్నాయి. టెర్రరిజాన్ని పూర్తిగా అణచివేసే చర్యలు తీసుకోగలమంటూ ప్రధాని మోడీ దేశానికి హామీ ఇచ్చారు. దేశ ప్రజల ఆగ్రహం ఎంతగా ఉన్నదో కనిపిస్తున్నదే. కొందరు కేవలం దాడులు కాదు పూర్తి స్థాయి యుద్ధమంటున్నారు. కొందరు పాక్ ఆక్రమిత కశ్శీర్‌ను ఇదే అదనుగా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి కొందరు, బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ నుంచి విడగొట్టాలని, తక్కిన పాకిస్థాన్‌ను సైతం ముక్కలు ముక్కలు చేయాలని కోరుతున్నారు. ఇందులో ఏది సాధ్యం, ఏది కాదు, ఇంతకూ భారత ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటున్నది, సైన్యానికి వ్యవహరణా స్వేచ్ఛ అంటే అర్థమేది అనే ప్రశ్నలున్నాయి. వాటిలోకి వెళ్లేముందు గుర్తించవలసిందేమంటే, దాడి అంటూ జరగటం మాత్రం తప్పదు. జరగనట్లయితే, తక్కినవి ఎట్లున్నా మోడీ ప్రభుత్వానికి అన్ని విధాలా మొహం చెల్లకుండాపోతుంది.ఇక ఇపుడు కొన్ని విషయాలు చర్చించాలి. ఇండియా కొన్ని దాడులు జరిపి, పాకిస్థాన్ కొన్ని ఎదురుదాడులు చేసి సైనిక చర్య అంతటితో ఆగటం ఒక పద్ధతి. ఆ దాడులు ఈసారి బాలాకోట్ కన్న తీవ్రంగా ఉండవచ్చు గాక. కాని అంతటితో ఆపటం ఒక పద్ధతి. అపుడు భారత ప్రభుత్వం తాను పాకిస్థాన్‌కు, అక్కడి టెర్రరిస్టు శిబిరాలకు తీవ్ర నష్టాలు కలగజేసినట్లు ప్రకటించే అవకాశం ఉంటుంది. బాలాకోట్ సందర్భంలో అదే జరిగింది.
మరొక వైపు పాకిస్థాన్ అదంతా వట్టిదని తన ప్రజలకు చెప్పవచ్చు. భారత్ దాడుల వల్ల తమకు కలిగిన నష్టం స్వల్పమని, బాలాకోట్ వద్ద అసలు టెర్రరిస్టు స్థావరాలంటూ లేనేలేవని, భారత వైమానికి దాడులు జరిగినపుడు తాము ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసి దాని పైలట్‌ను బందీగా పట్టుకున్నామని ఎదురు ప్రచారం చేయటం తెలిసిందే. ఈసారి కూడా అటువంటివి జరగగలవని ఊహించవచ్చు. భారత సైన్యం దాడులు నిజంగానే భీషణంగా సాగి, ఆ నష్టాలు పాకిస్థాన్ దాచలేని విధంగా ఉంటే తప్ప. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ అక్కడకు అంతర్జాతీయ మీడియాను తీసుకువెళ్లి, జరిగిన నష్టం స్వల్పమని చెప్పేందుకు ప్రయత్నించింది. ఈసారి ఆ పని చేయలేని విధంగా ఉంటేనే భారతదేశపు దాడులు నిజంగా తీవ్ర ప్రభావం చూపినట్లవుతుంది.
ఇది ఒకటి కాగా, బాలాకోట్ తర్వాత టెర్రరిస్టు కార్యకలాపాలు పాకిస్థాన్‌లోగాని, కశ్మీర్‌లోగాని ఆరేళ్లు గడిచినా ఆగలేదు. మిలిటెన్సీలు, టెర్రరిజాల స్వరూప స్వభావాలు, కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఎట్లుండేదీ తెలిసిన వారు, ఈ సమస్య కశ్మీర్‌లోనూ ఇప్పటికిపుడు ముగిసిపోగలదని భావించలేరు. అంతెందుకు సాక్షాత్తూ పాకిస్థాన్‌లో ఈ చర్యలకు మాజీ ప్రధానులు, సైన్యాధికారుల స్థాయి వారు బలయ్యారు. అక్కడ ఉన్నన్ని మిలిటెంట్, టెర్రరిస్టు సంస్థలు మరే దేశంలోనూ లేవంటారు. అందుకు కారణాలు ఏమిటన్న చర్చకు ఇది సందర్భం కాదు గనుక పక్కన ఉంచుదాం. విషయం ఏమంటే, పాకిస్థాన్‌పై నేడో రేపో జరగనున్న దాడితో, అదెంత తీవ్రంగా, విస్తృతంగా సాగినా, పాకిస్థాన్‌కు నష్టా లు వాటిల్లటం ఖాయమే గాని, టెర్రరిజం కశ్మీర్‌లో ఆగిపోగలదా? అక్కడగాని, ఇక్కడ గాని ఆగే అవకాశాలు కనిపించవు.
పాకిస్థాన్‌లో ఏవో శక్తుల నుంచి వారికి ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. అదే ప్రభావం కశ్మీర్‌లో కొనసాగుతూనే ఉంటుంది. కనుక, సమస్యకు పరిష్కారాన్ని మరెక్కడో కనుగొనాలి. అది వేరే చర్చ గనుక అందులోకి ఈ సందర్భంలో వెళ్లలేము.ఇటువంటి విషయాలలో సైనిక ఘర్షణలు అంచెలంచెలుగా ఉంటాయి. పైన అనుకున్నట్లు బాలాకోట్ సందర్భంలో వలే ఒకస్థాయి దాడులు జరిపి, విజయాన్ని ప్రకటించి అంతటితో ఆగిపోవటం. అపుడు, వాస్తవాలు ఎట్లున్నా, రెండు పక్షలూ విజయం ప్రకటించుకుని, అంతటితో సంతృప్తి చెంది, ఉపసంహరించుకుంటాయి. అది మొదటి స్థాయి అవుతుంది. రాజకీయ నిర్ణయం మేరకు జరగుతుంది. అట్లాగాక, ఆ ఘర్షణను అంతకు మించిన స్థాయికి తీసుకు వెళ్లటం రాజకీయ నిర్ణయమైనట్లయితే, అపుడు కేవలం దాడులన్నవి యుద్ధంగా పరిణమిస్తాయి.
వైమానిక దాడులు మరింత విస్తరించటంతో పాటు పదాతిసైన్యం, నౌకాదళాలు కూడా రంగప్రవేశం చేస్తాయి. తిరిగి అది పరిమిత యుద్ధమా, పూర్తి స్థాయిదా అనేది రాజకీయ నిర్ణయమే అవుతుంది. సాధారణంగా పరిమితి యుద్ధ స్థాయిలో స్వయంగానో, బయటి ప్రమేయాలతోనో యుద్ధ విరమణలు, రాజీలు జరుగుతుంటాయి. ఎవరికీ గెలుపు ఓటములుండవు.
అట్లాగాక పూర్తి స్థాయి అమీతుమీ యుద్ధస్థాయికి వెళితే పరిస్థితి వేరు. అపుడు ఫలితం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. యుద్ధం త్రివిధ బలాల మధ్య సంప్రదాయిక ఆయుధాలలో జరగటం ఒకటి. అనూహ్యంగా అణ్వస్త్రాల స్థాయికి వెళ్లటం రెండు. సంప్రదాయిక ఆయుధ బలం పాకిస్థాన్‌కు తక్కువేమీ కాదు గాని, యుద్ధం తగినంత కాలం సాగితే భారతదేశ బలాన్ని తట్టుకోలేదు. అనగా ఓటమి తప్పదు. ఇక్కడ గుర్తించవలసిన కీలకమైన విషయం ఏమంటే రెండు దేశాలూ అణ్వస్త్ర శక్తిని సంపాదించిన తర్వాత పరిస్థితి మౌలికంగా మారిపోయింది. తర్వాత నుంచి అన్ని అణ్వస్త్ర దేశాలకు వలెనే పాకిస్థాన్‌కు కూడా ‘నూక్లియర్ డాక్ట్రిన్’ అనేది రూపొందింది.
దాని ప్రకారం, ఒకటి, పాకిస్థాన్ ఉనికికి ముప్పు ఏర్పడినా, రెండు, ఏదైనా యుద్ధంలో ప్రత్యర్థి దేశం తమ భూభాగాన్ని గణనీయంగా ఆక్రమించి చొచ్చుకు వస్తున్నా, మూడు, తమ ఆక్రమణలోగల కశ్మీర్‌ను ఆక్రమించే పరిస్థితి ఏర్పడినా అణ్వస్త్రాల ప్రయోగానికి సందేహించబోరు. అది కూడా పూర్తి స్థాయి అస్త్రాలు గాక పరిమిత స్థాయి ప్రభావం ఉండే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. ప్రస్తుత సందర్భంలోనూ గత కొద్ది రోజులుగా, తమ అంతిమ ఆయుధాలు ఇవేనని పాకిస్థాన్ మంత్రులు, ఇతర ప్రముఖులు పలుమార్లుగా సూచిస్తున్నారు. దాడులు ఘర్షణలై, ఘర్షణలు పరిమిత యుద్ధం నుండి పూర్తి స్థాయికి చేరి, అపుడు పాకిస్థాన్ అంతిమంగా ఓడే పరిస్థితి వస్తే, ఇటువంటి దేదో జరిగే ప్రమాదం రావచ్చునా? ఘర్షణ ఎంత దూరం అనే ప్రశ్న తలెత్తటం అందువల్లనే.
- టంకశాల అశోక్ (దూరదృష్టి) (రచయిత సీనియర్ సంపాదకులు)