Tuesday, October 15, 2024

‘మాయిముంత’ కోసం బిఆర్‌ఎస్ దేవులాట!

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఆ పని చేయవలసిందే. హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు చేస్తున్న ‘వీరంగం’ పట్ల పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉంటారు?. కాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ ‘రూల్ బుక్’ ప్రకారమే జరిగినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కెసిఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలను మర్యాదపూర్వక భాషలో ‘విలీనం’ చేసుకొని మజ్లిస్ పార్టీ ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించి న వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఎలా మరచిపోతారు? కెసిఆర్ పాఠాన్ని రేవంత్ ఆయనకే తిరిగి అప్పజెప్పారు.

బిఆర్‌ఎస్ పార్టీ తన పేగు బంధాన్ని వెతుక్కుంటున్నది. తన తల్లి వేరు కోసం తండ్లాడుతున్నది. తన మూలాలను కనుగొనే పనిలోపడింది. అయితే ఈ హడావుడిలో విద్వేషాలను రగిలించడం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలను భగ్నం చేయడం ఆ పార్టీని వివాదాల్లోకి నెట్టాయి. గురు, శుక్రవారాల్లో జరిగిన అవాంఛనీయ పరిణామాలు తెలంగాణ పౌరసమాజానికి అవమానకరంగా ఉన్నాయి. ‘తెలంగాణ’ పేరు తొలగించుకొని అవతరించిన బిఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్నది. తెలంగాణ వాదం పునాదులపై నిర్మించిన పార్టీ పట్టాలు తప్పింది. ఏ ‘తెలంగాణ వాదాన్ని’ మరచిపోయి అవకాశవాదాన్ని కెసిఆర్ ఆశ్రయించారో ‘ఆ శూన్యత’ను రేవంత్ రెడ్డి భర్తీ చేస్తున్నారు. అందెశ్రీ ‘జయ జయ హే’ గీతాన్ని తెలంగాణ గీతంగా గుర్తించి గౌరవించడం, ప్రొఫెసర్ కోదండరాంను శాసన మండలి సభ్యునిగా ఎన్నుకోవడం, మహిళా యూనివర్శిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం, కెసిఆర్ హయాంలో నిర్లక్ష్యానికి, అవమానాలకు గురైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యాకమిషన్‌కు చైర్మన్‌గా నియమించడం, కెటిఆర్ నిర్లక్ష్యంతో పెండింగులో పడిన జర్నలిస్టుల హౌజింగ్ సమస్యను పరిష్కరించడం వంటి చర్యలన్నీ రేవంత్ గ్రాఫ్‌ను పెంచుతున్నవి.

ఇద్దరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య జరుగుతున్న వివాదం ఓ పోరాటంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ ఇది కెసిఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో రచించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ఇతర నాయకులు అమలు చేస్తున్నట్టు కనబడుతున్నది. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎంఎల్‌ఎలకు చీరలు, గాజులు పంపుతున్నట్టు ప్రకటించడం మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్ళడానికి కౌశిక్ రెడ్డి ప్రయత్నించడం, తర్వాత గాంధీ తన బలగంతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం.. పోలీసులు, బిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు.. ఒక ఎత్తు. హరీశ్ రావు రంగంలోకి నేరుగా దిగడం మరో ఎత్తు. ‘రియల్ ఎస్టేట్ రంగం గడచినా తొమ్మిది నెలల్లో సర్వనాశనమైంది.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నది’ అని హరీశ్ రావు మాట్లాడిన మరుసటి రోజే జరిగిన ఘటనలు బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే విధంగా ఉన్నాయా? బ్రాండ్ ఇమేజ్‌ను కుప్పకూల్చే విధంగా ఉన్నాయా? అని బిఆర్‌ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవలసి ఉన్నది. ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతా ల నుంచి దశాబ్దాలుగా స్థిరపడ్డ వాళ్ళపైన చేసిన వ్యాఖ్య లు ముమ్మాటికీ విషపూరితమైనవి. ఆంధ్రా, తెలంగాణ అనే ప్రాంతీయ విభేదాల నిప్పురాజుకోవాలని కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు కోరుకుంటున్నారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఇలాంటి వ్యాఖ్యలు లేకపోవచ్చు. కానీ తమకు గిట్టని రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం వంటి వాళ్లను భయపెట్టడానికి ఎలాంటి నిర్బంధాన్ని అమలు చేశారో మనందరికీ తెలుసు. ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్నో ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. తమకు అధికారం శాశ్వతమన్న దురహంకారంతో ఆయన అలాంటి చర్యలకు పాల్పడ్డారు.

ఇప్పుడు అధికారం కోల్పోగానే విలవిలలాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు అని ఆయన పదేపదే చేస్తున్న ప్రకటనల వెనుక అధికారం కోల్పోయిన బాధ, ఆక్రోశం, అసహనం కనిపిస్తున్నవి. సంఘర్షణలు, గృహ నిర్బంధాలు కెసిఆర్ హయాంలోనూ జరిగినవే. ఇదేదో కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు చేస్తున్నట్టుగా బిఆర్‌ఎస్ నాయకుల ఆరోపణలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని, బిజెపిలో బండి సంజయ్‌లను ఎంతగా హింసించారో తెలుసు. కాగా చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సాధారణ సూత్రం మాజీ ముఖ్యమంత్రి ఎలా మరచిపోయారో అర్ధం కావడం లేదు. శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఆ పని చేయవలసిందే.

హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు చేస్తున్న ‘వీరంగం’ పట్ల పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉంటారు? కాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ ‘రూల్ బుక్’ ప్రకారమే జరిగినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కెసిఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలను మర్యాదపూర్వక భాషలో ‘విలీనం’ చేసుకొని మజ్లిస్ పార్టీ ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించిన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఎలా మరచిపోతారు? కెసిఆర్ పాఠాన్ని రేవంత్ ఆయనకే తిరిగి అప్పజెప్పారు. తమ హయాంలో అటువంటి తప్పిదం చేసి ఉండకపోతే, ప్రతిపక్షానికి పిఎసి చైర్మన్ పదవిని ఇచ్చి ఉంటే బిఆర్‌ఎస్‌కు విలువ ఉండేది. రేవంత్ రెడ్డి కెసిఆర్ కన్నా అడ్వాన్స్‌గా ఆలోచిస్తారని, పాత గాయాలను గుర్తు చేసుకొని ప్రతీకార చర్యలకు పాలపడతారని అంచనా వేయకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నవి. పిఎసి చైర్మన్ పదవి గాంధీకి ఇవ్వడం పట్ల బిఆర్‌ఎస్ ఆక్షేపణలు ఏవీ చెల్లవు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అన్న మాటలను మనసులో పెట్టుకోవద్దు.. ప్లీజ్. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తా. సెటిలర్లు అన్నభావనను విడిచిపెడదాం. హైదరాబాదులో ఉన్న వారంతా హైదరాబాదీలే. మీరంతా మావాళ్లే భాగ్యనగర అభివృద్ధికి మీ తోడ్పాటు అవసరం. తెలంగాణ మనది అనే భావనతో ముందుకు వెడదాం. నేను మెదక్ నుంచి వచ్చాను. కానీ హైదరాబాదీనే అని చెప్పుకుంటా. అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఉద్యమ అవసరాల్లో చాలా చెబుతాం. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అదే పాట పాడలేము. మా ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదాలు లేవు. అందుకే అధికారిక లాంచనాలతో సినీ నిర్మాత రామానాయుడు అంత్యక్రియలను జరిపాం. దాదాపు 58 ఏళ్లు మనమంతా కలిసి ఉన్నాం. కానీ విడిపోవలసి వచ్చింది అని ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ 2015 లో అన్నారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోవడం పట్ల ఆయన వ్యాఖ్యల్లో ‘ఆవేదన’ సైతం అంతర్లీనంగా కనిపిస్తుంది.

ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గతంలో కెసిఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉన్నవి. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో మాకు పేచీ లేదు. పొట్ట కొట్టడానికి వచ్చిన వాళ్ళతోనే మాకు పేచీ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం వేళ కెసిఆర్ అన్నమాటలు. అయితే అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తదితర ఆంధ్ర మూలాలు ఉన్న వారు పొట్టకూటి వచ్చినవారా? పొట్టకొట్టడానికి వచ్చినవారా? ఆంధ్రా వాళ్ళ పట్ల, సెటిలర్ల పట్ల ప్రేమాభిమానాలు లేకపోతే అలాంటి వారందరినీ తమ పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్టు? ఎందుకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నట్టు? కెసిఆర్ వద్ద సమాధానం ఉందా? ‘యుద్ధం అంతా మోసంతోనే కూడుకొని ఉంటుంది’ అని క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దానికి చెందిన చైనా యుద్ధరంగ నిపుణుడు సుంజు తన ‘ఆర్ట్ ఆఫ్ వార్’లో విశ్లేషించాడు. అందువల్ల ‘ప్రేమలోనూ, యుద్ధంలోనూ అంతా సబబే’ అని సాధారణంగా మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్టు బిఆర్‌ఎస్ నాయకత్వం చేసే వాదనలో పస లేదు. అలాగే కెసిఆర్ తన ఫామ్ హౌజ్ లో మాయోపాయాలు రచిస్తున్నారని అనడమూ సరైంది కాదు. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి.అయితే సమస్య ఏమిటంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల యుద్ధం ముగిసింది.

మరో నాలుగేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండనుంది. వెలుపలి నుంచి కెసిఆర్ కానీ అంతకన్నా జిత్తులున్నవారు కానీ ఏమి చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిర పరచడం సాధ్యం కాదు. తాజా ఘటనలన్నీ బిఆర్‌ఎస్‌ను డిఫెన్సులో పడవేసేవే. ఎంత మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా మేలు చేకూర్చే చర్యలు కావు. హరీశ్ రావు 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నందున, ఆయన సహజంగానే ‘క్రౌడ్ పుల్లర్’గా గుర్తింపు పొందా రు. అలాగే సొంత పార్టీలోనూ, తెలంగాణ సమాజంలోనూ హరీశ్ పట్ల సానుకూలత ఉన్నది. ప్రజామోద నాయకుడు కనుకనే గురువారం రాత్రి కేశంపేట పోలీసు స్టేషన్‌లో ఆయన ఉన్న చోటుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. కెసిఆర్ కూడా తన ప్రణాళికకు అనుగుణంగానే కౌశిక్ రెడ్డి, గాంధీ ఎపిసోడ్‌లో హరీశ్ రావును బరిలోకి దింపారని భావిస్తున్నారు. కానీ అదే సమయంలో ‘మామ ట్రాప్‌లో పడి ఈ ఎపిసోడ్‌లో హరీశ్ రావు తన పరువు పోగొట్టుకుంటున్నారు’ అనే మాటలు విమర్శకులు, మేధావుల నుంచి వినబడుతున్నవి.

ఎస్.కె. జకీర్(రచయిత సీనియర్ జర్నలిస్టు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News