Saturday, April 13, 2024

కవిత అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనీ లాండరింగ్ కేసులో సా. 5.23కు అదుపులోకి తీసుకున్న ఇడి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశా రు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో శుక్రవారం మధ్యా హ్నం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల తర్వాత ఆమెను సాయంత్రం 5.20 అరెస్టు చేసి, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు. మనీ లాండ రింగ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు కవితకు ఇచ్చిన మెమోలో ఇడి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను 14 పేజీల్లో వివరిస్తూ కవితకు మెమో ఇచ్చామన్న ఇడి అధికారులు, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద ఆమె నేరానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బిఆర్‌ఎస్ నేతలు ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఇడి అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను శంషాబాద్ తరలిస్తున్న సమయంలో అడ్డుకోగా, పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు, ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అదుపు చేశారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. అంతకు ముందు శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఇడి అధికారు లు, ఇంట్లోని అందరి సెల్‌ఫోన్లు సహా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో బిఆర్‌ఎస్ లీగల్ సెల్

ప్రధాన కార్యదర్శి సోమ భరత్, లాయర్లు సహా ఎవరినీ అధికారులు లోపలికి అనుమతించలేదు, కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కవితకు చెందిన రెండు పర్సనల్ మొబైల్స్ తో పాటు ఇంట్లోని మొత్తం 16 మొబైల్స్‌ను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ వారంట్ జారీ చేసిన తర్వాత ఆ కాపీని కుటుంబ సభ్యులకు ఇడి అధికారులు అందించారు. కొద్దిసేపు కెటిఆర్, హరీష్‌రావులను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న ఇడి అధికారులపై కెటిఆర్, హరీశ్‌రావులు మండిపడ్డారు. ఇడి అధికారులు రాత్రి 8 గంటల 55 నిమిషాలకు ఫ్లయిట్ బుక్ చేసి కవితను ఢిల్లీకి తీసుకెళ్ళారు. కవిత అరెస్ట్ ను నిరసిస్తూ బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో అరెస్టుని అడ్డుకోవద్దని. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కెటిఆర్, హరీశ్‌రావు కోరారు.
కవిత కారు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోడీ, బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. కవితను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్ళే రూట్‌ని క్లియర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొందరు బిఆర్‌ఎస్ లీడర్లకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నేడు ఢిల్లీలో ఇడి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం
శనివారం మధ్యాహ్నం ఎంఎల్‌సి కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడున్న బిఆర్‌ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. కవితను తరలిస్తున్న సమయంలో కవిత భర్త, పిల్లలతో పాటు కెటిఆర్, హరీశ్ రావు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. కవితను తరలించిన వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరి కొందరు అధికారులు ఉన్నారు. భారీ భద్రత మధ్య కవితను ఎయిర్ పోర్టుకు తరలించారు.
సిబిఐ మాజీ జెడి కీలక వ్యాఖ్యలు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత అరెస్ట్‌పై సిబిఐ మాజీ జెడి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ స్పందించారు. 161 సిఆర్‌పిసి ప్రకారం మహిళలు విచారణ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, విచారణ అధికారులే మహిళల వద్దకు వస్తారని వివరించారు. గతంలో ఇడి అధికారులు కవితను ఢిల్లీకి పిలిచారని, దాంతో కవిత తరఫు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అయితే తాము కవితను విచారిస్తున్నది పిఎంఎల్‌ఎ చట్టం కింద అని, సిఆర్‌పిసికి పిఎంఎల్‌ఎకి తేడా ఉందని ఇడి సుప్రీంకోర్టుకు తెలిపిందని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడలేదన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారాలు దర్యాప్తు సంస్థలకు ఉంటాయి. అది ఇడి కావొచ్చు, సిబిఐ కావొచ్చు, స్థానిక పోలీసులు కావొచ్చు. కవితను అరెస్ట్ చేశారు కాబట్టి శనివారం ఢిల్లీలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. ఎందువల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఇడి అధికారులు మేజిస్ట్రేట్ ముందు చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో కవిత న్యాయవాది కూడా అక్కడ వాదనలు వినిపించవచ్చు. మేం దర్యాప్తు సంస్థతో సహకరిస్తున్నప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మేజిస్ట్రేట్ కు వివరించవచ్చు. ఇరువురి వాదనలు విన్న తర్వాత మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు‘ అని లక్ష్మీనారాయణ వివరించారు. ఇక, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీ ఎలా తరలిస్తారంటూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా లక్ష్మీనారాయణ స్పందించారు. ‘సాధారణంగా మహిళలను సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అరెస్ట్ చేయకూడదు.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అలా అరెస్ట్ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది సిఆర్‌పిసిలో ఉండే సాధారణ ప్రొసీజర్. కానీ సిఆర్‌పిసిలోని అంశాలు తమకు వర్తించవని ఇడి అధికారులు అంటున్నారు. ట్రాన్సిట్ వారెంట్ విషయానికొస్తే క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News