Saturday, April 27, 2024

వరుస వరాలు ఓట్ల కోసమేనా?

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే మాటను వల్లె వేస్తున్నారు. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలు ఏకమయినా తమకు పోటీయే కాదని కమలనాథులు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే విచిత్రమేమిటంటే అంత ఆత్మ విశ్వాసం ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్ని నెలలుగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎడాపెడా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ వస్తున్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు, ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్రాల్లోనూ వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తున్నారు. ఇవన్నీ కూడా తమ ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకోవడంతో పాటుగా ఇతర పక్షాల ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టడం కోసమేననేది రాజకీయ విశ్లేషకుల భావన.

ఇది చాలదన్నట్లు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ దగ్గరపడే కొద్దీ మోడీ ఒక్కటొక్కటిగా తాయిలాలను బయటికి తీస్తున్నారు.కొద్ది రోజుల కింద ఉజ్వల స్కీమ్ కింద వంటగ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది గృహిణులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఇది చాలదన్నట్టుగా గురువారం మరో అడుగు ముందుకు వేసి పెట్రోలు, డీజిలు ధరలను లీటరుకు రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఒకటి, రెండు రోజుల్లో వెలువడవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో ప్రధానికి ఒక్కసారిగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించాలనే ఆలోచన రావడం విడ్డూరమే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి బ్యారెల్ 140 డాలర్లకు చేరువయిన తరుణంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి పక్షం రోజులకోసారి వీటి ధరలు పెంచుతూనే వచ్చాయి. అలా పెరిగి పెరిగి కొండెక్కి కూచున్న ఇంధన ధరలు మళ్లీ దిగి వచ్చిన పాపాన పోలేదు.

కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కంటి తుడుపుగా రూపాయో, రెండు రూపాయలో తగ్గించినా వాహనదారులకు పెద్దగా ఊరట లేదు. డీజిలు ధరలు పెరిగిన కారణంగా రవాణా చార్జీలు పెరిగి పోయి కూరగాయలు మొదలుకొని అన్ని నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నా, సామాన్యుడు విలవిలలాడుతున్నా మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు. ఒకవేళ మీడియా సమావేశాల్లో ఈ విషయమై సంబంధిత మంత్రిని విలేకరులు అడిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా వీటి ధరలు ఉంటాయంటూ తెలివిగా తప్పించుకునేవారు. మోడీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది గనుక ఇక ఇంధన ధరల గురించి పట్టించుకోరని వినియోగదారులు సైతం సర్దుకుపోవడం మొదలు పెట్టారు. ఇదే అదనుగా ఇప్పుడు వీటి ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా వారి దృష్టిలో అడగకుండానే వరాలిచ్చే దేవుడిలా మారిపోవాలని అనుకున్నట్లుగా కనిపిస్తోంది.

అందుకే 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను అసోం, పశ్చిమ బెంగాల్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకత కారణంగా అమలు చేయకుండా తెరవెనక్కి నెట్టేసిన మోడీ సర్కార్ ఒక్కసారిగా ఎన్నికల సమయంలో మళ్లీ తెరముందుకు తీసుకు వచ్చింది. అంతేకాదు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే దీని అమలుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఆరు నూరయినా దీన్ని అమలు చేసి తీరుతామని రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టి చెప్పడం చూస్తే దీని అమలు వల్ల ఎదురయ్యే వ్యతిరేకతకన్నా కూడా వచ్చే ఓటు బ్యాంకే ఎక్కువ అని మోడీ సర్కార్ గట్టి లెక్కలు వేసుకుని మరీ దీని అమలుకు నడుం బిగించిందని అర్థమవుతోంది. అయితే మోడీ ప్రకటించిన తాయిలాల అమలు భారం లక్ష కోట్ల మేరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. వీటి కారణంగా ఇప్పటికే అంచనాలను మించిపోయిన బడ్జెట్ లోటు మరింతగా పెరిగిపోతుందని వారు అంటున్నారు.

వీటికి తోడు పరిశ్రమలు, రైతులు ఇలా వివిధ వర్గాలకు ప్రకటించిన పన్ను రాయితీలు, సబ్సిడీలు అన్నీ కలిపితే తడిసి మోపెడంత అవుతాయి. ఎన్నికల తాయిలాలు దేశానికి మంచిది కాదని సుభాషితాలు చెప్పే ప్రధాని మోడీ తన విషయానికి వచ్చేసరికి మాత్రం దాన్ని మరిచిపోవడం ఏమిటని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అరణ్య రోదనే అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News