Saturday, July 27, 2024

పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు

- Advertisement -
- Advertisement -

 

Modi

 

 

కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు. అంతకన్నా భారత్ గురించి మాట్లాడాలని ఆమె హితవు చెప్పారు. శుక్రవారం ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ ఎప్పుడూ భారత్‌ను పాకిస్తాన్‌తో మోడీ ఎందుకు పోలుస్తున్నారని ప్రశ్నించారు. తాము పాకిస్తాన్‌లా ఉండాలని కోరుకోవడం లేదని, తాము హిందుస్తాన్‌ను ప్రేమిస్తామని మమత అన్నారు. ఎవరైనా తనకు ఉద్యోగం లేదని, ఉపాధి కల్పించాలని అడిగినా, పరిశ్రమలు రావడం లేదని ప్రశ్నించినా వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి అంటూ మోడీ హుంకరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ చర్చిస్తుంది..మనం భారతీయులం. ఇది మన మాతృభూమి. మన దేశం గురించి మనం చర్చించుకుందాం..అంటూ మమత అన్నారు. భారతదేశం సుసంపన్నమైన సంస్కృతి, చారిత్రక వైభవం ఉన్న పెద్ద దేశమని, మన దేశంతో ఎందుకు పాకిస్తాన్ ఎందుకు పోలుస్తున్నారని ఆమె మోడీని ప్రశ్నించారు. వివాదాస్పద సిఎఎ చట్టాన్ని ఉపసంహరించుకునేంతవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

మత ప్రాతిపదికన దేశాన్ని ఎలా చీల్చాలని మాత్రమే బిజెపికి తెలుసని, అయితే తన మతం మాత్రం ప్రజల స్వేచ్ఛను కాపాడడమేనని ఆమె అన్నారు. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకుంటామని, ఇప్పుడు జరుగుతోంది రెండవ స్వాతంత్య్ర పోరాటమని మమత పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనము మన పౌరసత్వాన్ని నిరూపించుకోవలసి రావడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. ఒకపక్క దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి అమలు చేయబోమని ప్రధాని మోడీ అంటుంటే మరోపక్క కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు మాత్రం దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలుచేస్తామని ప్రకటిస్తున్నారని ఆమె చెప్పారు.

 

Modi is Pak ambassador, says Mamata, She said PM Narendra Modi talks of Pak all day like their ambassador instead of Hindustan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News